ఆమె సొమ్ము... అత్తింటిదా?

వరకట్న నిషేధచట్టం-1961 ప్రకారం మనదేశంలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. హిందూ వారసత్వ చట్టం-1956, సవరణ చట్టం-2005లోని సెక్షన్‌-6 హిందూ స్త్రీకి, తన సోదరులతో పాటు వారసత్వపు ఆస్తిలో సమాన హక్కుని కల్పించింది. అయితే, ఆ ఆస్తి 2004 డిసెంబరుకి ముందు భాగాలు పంచుకోనిది అయితేనే ఆమెకు హక్కు ఉంటుంది.

Updated : 31 May 2024 14:47 IST

లావణ్యకు పెళ్లప్పుడు తల్లిదండ్రులు పది తులాల బంగారం, ఎకరం పొలం కానుకగా ఇచ్చారు. ఆ నగల్ని కొన్నాళ్లకే వ్యాపార అవసరాలకోసమని అమ్మేశాడామె భర్త. అతడితో మనస్పర్థలు రావడంతో ఇప్పుడా యువతి  విడాకులు తీసుకోవాలనుకుంటోంది. మరి ఆ ఆభరణాల సంగతేంటి?

రమ్య ఉద్యోగం చేస్తోంది. తన సంపాదనలో కొంత మొత్తాన్ని తన తల్లిదండ్రుల అవసరాల కోసం వాడుతోంది. దానికి భర్త పెళ్లయ్యాక నీ సంపాదన అత్తింటిదే తప్ప పుట్టింటిది కాదని వాదిస్తున్నాడు. తన స్వార్జితంపై ఆమెకు హక్కులేదా? 

వారసత్వంగానూ, కానుకల రూపంలోనూ, సంపాదించుకున్న డబ్బులూ, ఆస్తుల విషయంలో ఆమె హక్కులేంటి? స్త్రీధనం అని దేన్ని అంటారు... వంటి సందేహాలు మీకూ ఉన్నాయా అయితే చదివేయండి. 

రకట్న నిషేధచట్టం-1961 ప్రకారం మనదేశంలో కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. హిందూ వారసత్వ చట్టం-1956, సవరణ చట్టం-2005లోని సెక్షన్‌-6 హిందూ స్త్రీకి, తన సోదరులతో పాటు వారసత్వపు ఆస్తిలో సమాన హక్కుని కల్పించింది. అయితే, ఆ ఆస్తి 2004 డిసెంబరుకి ముందు భాగాలు పంచుకోనిది అయితేనే ఆమెకు హక్కు ఉంటుంది. ఇలా వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు... ఈ చట్టంలోని సెక్షన్‌-14 ప్రకారం... స్త్రీలు తమ సంపాదనతో కూడబెట్టుకున్న ఆస్తులూ, పెళ్లికిముందూ లేదా తరవాత పుట్టింటి నుంచైనా, అత్తింటి కుటుంబం, బంధువులు, స్నేహితుల ద్వారా దానం, భాగస్వామ్యం, వారసత్వం, బహుమతుల రూపంలో అందుకున్నదంతా స్త్రీధనమే. వీటిల్లో బంగారం, వెండి నగలూ, విలువైన రాళ్లు, వాహనాలు, ఖరీదైన కళాఖండాలు, ఫర్నిచర్‌ వంటివన్నీ వస్తాయి. అలానే భర్త నుంచి అందుకున్న భరణం, క్రయ విక్రయాలతో కూడబెట్టిన స్థిర చర ఆస్తుల్ని కూడా దీని కిందే పరిగణిస్తారు. అయితే, పెళ్లి సమయంలో అత్తమామలు అల్లుడికి బహుమతిగా ఇచ్చిన ఉంగరం, బంగారు గొలుసు వంటివి స్త్రీధనం పరిధిలోకి రావు. భార్య పేరిట భర్త ఏదైనా చర, స్థిరాస్తిని కొన్నా, దాన్ని బహుమతిగా ఇవ్వకపోతే ఆ ఆస్తి స్త్రీధనం పరిధిలోకి రాదు. వివాహిత తన నెలవారీ సంపాదనలో కొంత మొత్తాన్ని ఇంటి ఖర్చుల కోసం ఉపయోగిస్తే, దాన్ని తిరిగి క్లెయిమ్‌ చేయడానికి వీలుండదు.

భర్త తీసుకోవచ్చా?

సాధారణంగా మన సమాజంలో కట్నకానుకల రూపేణా వచ్చిన డబ్బూ నగలూ అత్తింటివారి స్వాధీనమవుతాయి. కానీ, ఈ స్త్రీధనం కుటుంబ ఉమ్మడి ఆస్తి కాదనీ, భర్తకు లేదా మరే ఇతర కుటుంబ సభ్యులకూ దానిపై ఎలాంటి హక్కూ ఉండదనీ, సంపూర్ణ అధికారం ఆమెదేనని సుప్రీంకోర్టు మరోసారి పునరుద్ఘాటించింది. ఒకవేళ కష్టకాలంలో వాడుకున్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుందని తేల్చి చెప్పింది. కేరళకు చెందిన ఓ హిందూ మహిళకు తల్లిదండ్రులు పెళ్లప్పుడు కొన్ని నగలు చేయించారట. తొలిరాత్రి నాడు వాటిని భద్రపరుస్తానని తీసుకున్న భర్త... తల్లితో కలిసి తన అప్పులు తీర్చడానికి దుర్వినియోగం చేశాడనేది ఆమె ఆరోపణ. దీనిపై కేసు వేస్తే జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందంటూ 2011లో ఫ్యామిలీ కోర్టు తీర్పిచ్చింది. అయితే, తరవాత కేరళ హైకోర్టు ఈ తీర్పు కొట్టేయడంతో బాధితురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం ‘స్త్రీ ధనం’ భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదనీ, దానిపై ఆమె భర్తకు ఎటువంటి హక్కూ ఉండదనీ పేర్కొంది. అంతేకాదు, ఆభరణాల దుర్వినియోగానికి గాను భర్త ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలని తీర్పిచ్చింది.

ఎలా కాపాడుకోవాలి?

మహిళలు తమకు వస్తు, ధన రూపంగా వచ్చిన బహుమతులను తమంతట తాముగా భద్రపరచుకునే సౌకర్యం కలిగి ఉండాలి. ఆభరణాలు, విలువైన వస్తువులకు సాక్ష్యంగా పెళ్లి ఫోటోలు, వీడియోలను వాడుకోవచ్చు. ముందు వాటి జాబితాను పక్కాగా రాసుకుని నగల్ని బ్యాంకు లాకర్‌లో, నగదుని తన పేరిట బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోవాలి. ప్రతి వస్తువు బిల్లూ ఆమె పేరు మీద ఉండేలా చూసుకోవాలి. మహిళ ఒకవేళ జాబ్‌ చేస్తుంటే, తన పేరు మీద ప్రత్యేక బ్యాంకు అకౌంట్‌ ఉండాలి.

భార్యాభర్తలు విడిపోతుంటే... 

ఆమె తన నగలు, వస్తువులు, ఆస్తికి సంబంధించిన పత్రాలు, బిల్స్, ఫొటోల్లాంటివి సాక్ష్యంగా చూపించవచ్చు. ఆ క్లెయిమ్‌ను తిరస్కరించడం కూడా గృహ హింస కిందికి వస్తుంది. ఆమె భర్తతో పాటు అత్తమామలు కూడా క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ఒకవేళ అత్తింటివారు ఇవ్వకపోతే! 

పెళ్లైన తరవాత భద్రత పేరుతో కోడలి బంగారాన్ని భర్త లేదా అత్తింటివాళ్లు బ్యాంక్‌ లాకర్‌లో పెట్టడం, ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు దాన్ని తిరిగి ఇవ్వకపోవడం వంటివి సాధారణంగా చూస్తుంటాం. అలాంటి సంఘటనలకు పరిష్కారమే ఈ సుప్రీం కోర్టు తీర్పు. ఒకవేళ స్త్రీధనంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులను అత్తమామలు దాచిన సందర్భాల్లో, సదరు మహిళ అడగగానే వాటిని తిరిగి ఇచ్చేయాలి. లేదంటే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 406 ప్రకారం ‘నేరపూరిత నమ్మక ఉల్లంఘన’ కింద కేసు పెట్టొచ్చు. దీని ప్రకారం కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తుంది. భర్త చేసిన అప్పులు తీర్చడానికి మహిళకు సంబంధించిన ఆస్తి ఉపయోగించకూడదు. స్త్రీధనం మహిళకు సంబంధించిన సంపూర్ణ ఆస్తి.


ఆ స్త్రీధనం తరవాత ఎవరికి? 

హిందూ స్త్రీ ఎవరైనా వీలునామా రాయకుండా చనిపోతే... ఆ మహిళ ఆస్తిపాస్తులు ముందుగా పిల్లలకు, భర్తకు చెందుతాయి. వారు లేకపోతే భర్త వారసులకు వెళ్తాయి. అదీకాకపోతే ఆ స్త్రీ తల్లిదండ్రులకీ లేదంటే.. ఆపై తండ్రి వారసులకూ చివరిగా తల్లి వారసులకు అవి సంక్రమిస్తాయి.  ఇందులో మినహాయింపు ఏంటంటే... తల్లిదండ్రుల నుంచి పొందిన ప్రాపర్టీ తండ్రి వారసులకూ, మామగారు లేదా భర్త సంబంధీకుల నుంచి వచ్చిన ఆస్తి భర్త వారసులకు చెందుతుంది. 

జి. వరలక్ష్మి, న్యాయవాది


క్రెడిట్‌... అందరికీ

ప్పుడంటే అమ్మాయిలు కూడా క్రెడిట్, డెబిట్‌ అంటూ అన్ని కార్డులు వాడేస్తున్నారు కానీ, ఒకప్పుడు మహిళలకు వాళ్ల పేర్లతో క్రెడిట్‌ కార్డులు ఇచ్చేవారు కాదట. 1974లో యూఎస్‌ కాంగ్రెస్, ఈక్వల్‌ క్రెడిట్‌ ఆపర్చ్యునిటీ యాక్ట్‌(ఈసీఓఏ)ను ప్రవేశపెట్టిందట. అప్పటినుంచి జాతి, కులం, లింగభేదం, మ్యారిటల్‌ స్టేటస్‌... వంటి వాటితో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ క్రెడిట్‌ సౌలభ్యం కల్పించారట.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్