Published : 19/01/2023 21:01 IST

Thyroid Awareness Month : జాగ్రత్తగా ఉంటే.. థైరాయిడ్ ఏం చేస్తుంది?

మహిళల్ని ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్‌ ఒకటి. పిరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం, బరువు పెరగడం, ఇతర అనారోగ్యాలు.. ఇలా ఒక్కటేమిటి థైరాయిడ్‌తో వచ్చే ఆరోగ్య సమస్యలు అనేకం. ‘జాతీయ థైరాయిడ్‌ అవగాహన మాసం’ సందర్భంగా అసలీ థైరాయిడ్ ఎందుకొస్తుంది? దీన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా? వంటి విషయాలు తెలుసుకుందాం రండి..

గుర్తించడం సులువే..!

కొన్ని శారీరక లక్షణాల ద్వారా థైరాయిడ్‌ను గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. ఆకలి లేకపోవడం, బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం, మలబద్ధకం, నెలసరి క్రమం తప్పడం, జుట్టు విపరీతంగా రాలడం, చర్మం పొడిగా మారడం, చలికి తట్టుకోలేకపోవడం.. వంటివి కనిపిస్తే దానిని 'హైపో థైరాయిడిజం'గా భావించాలి..

సరిగానే తింటున్నా విపరీతంగా బరువు తగ్గడం, నిద్ర పట్టక పోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి, చల్లగా ఉన్న వేళల్లోనూ వేడిగా అనిపించడం, ఎక్కువగా చెమటలు పట్టడం, నెలసరి క్రమం తప్పడం, ఎక్కువసార్లు మలవిసర్జనకు వెళ్లాల్సి రావడం.. వంటి లక్షణాలు కనిపిస్తే దానిని 'హైపర్ థైరాయిడిజం'గా పరిగణించాలి.

అసలెందుకు వస్తుంది?

థైరాయిడ్ రావడానికి శరీరంలోని హార్మోన్ స్థాయుల్లో తేడాలే కారణమంటున్నారు నిపుణులు. T3, T4, TSH అనే హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల వల్ల థైరాయిడ్ గ్రంథి వేగంగా లేక నెమ్మదిగా పని చేస్తుంది. హార్మోన్లు ఎక్కువగా విడుదలైతే థైరాయిడ్ గ్రంథి వేగంగా పనిచేస్తుంది. దాన్ని ‘హైపర్ థైరాయిడిజం’ అంటారు. అదే తక్కువగా విడుదలైతే థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోతుంది. దీన్ని ‘హైపో థైరాయిడిజం’ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టే హైపర్ థైరాయిడిజంలో శరీరంలోని అవయవాలు వేగంగా పనిచేస్తాయి. గుండె కొట్టుకునే వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో క్యాలరీలు త్వరగా కరిగిపోయి సన్నగా అవుతూ ఉంటారు. హైపో థైరాయిడిజంలో అవయవాలు నెమ్మదిగా పనిచేయడం వల్ల క్యాలరీలు అంత త్వరగా కరగవు. అందుకే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. హైపో థైరాయిడిజంలో గుండె కొట్టుకునే వేగం కూడా తక్కువగా ఉంటుంది.

ఏం చేయాలి?

థైరాయిడ్‌ను అదుపులో ఉంచుకోవడానికి.. కనీసం ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్లు సూచించిన ప్రకారం మందులు వాడాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించడమూ ముఖ్యమే.. హైపో థైరాయిడిజం ఉన్నవారు బరువు అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. ఇందుకోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు వాకింగ్, యోగా లాంటివి చేయాలి.

ఎలాంటి ఆహారం మంచిది?

థైరాయిడ్ ఉన్న వాళ్లు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకలీ, సోయా, చిక్కుళ్లు.. వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. అయొడిన్, జింక్, ఇనుము, కాపర్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి ఆకుకూరలు, చేపలు, పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటాయి. రోజుకు 150మి.గ్రా ల అయొడిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు.. సుమారు 200మి.గ్రాలు తీసుకోవడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని