close
Updated : 15/07/2021 13:50 IST

అమ్మనయ్యా.. అమితానందంగా ఉంది.. కానీ!

‘అమ్మనయ్యానన్న సంతోషం మన మనసుని ఒక్కచోట నిలవనివ్వదు.. ప్రస్తుతం తామూ అలాంటి అమితానందంలోనే తేలియాడుతున్నామం’టోంది బాలీవుడ్‌ నేచర్‌ బ్యూటీ దియా మీర్జా. మూడు నెలల క్రితం తాను గర్భిణినన్న విషయం బయటపెట్టిన ఈ అందాల తార.. తనకు మగబిడ్డ పుట్టాడంటూ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే నెలలు నిండకుండానే తనకు ప్రసవం జరిగిందని, ప్రస్తుతం తన చిన్నారి నియోనాటల్‌ ఐసీయూలో ఉన్నాడంటూ భావోద్వేగానికి గురైంది. గర్భం ధరించిన తొలినాళ్లలో పలు అనారోగ్యాలతో బాధపడ్డానంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అందరితో పంచుకునే సమయంలోనే బయటపెట్టిన దియా.. తన ప్రి-మెచ్యూర్‌ డెలివరీకి గల కారణాల గురించి కూడా తాజాగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది.

పర్యావరణమంటే ప్రాణమిచ్చే దియా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్‌ రేఖితో ఏడడుగులు వేసింది. తన పెళ్లిలో ఆద్యంతం పర్యావరణహిత ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చిన ఆమె.. మహిళా పురోహితురాలి సమక్షంలో మనువాడి సంచలనం సృష్టించింది. అయితే వివాహం తర్వాత రెండు నెలలకు తాను గర్భవతినంటూ ప్రకటించింది దియా. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే తాను గర్భం ధరించానన్న హడావిడిలో మాత్రం పెళ్లి చేసుకోలేదని, గర్భం ధరించిన తొలినాళ్లలో ఎదురైన పలు అనారోగ్యాల కారణంగా గర్భం నిలుస్తుందో, లేదోనన్న సందిగ్ధం వల్లే ఆలస్యంగా ఈ విషయం అందరితో పంచుకోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చిందీ అందాల తార.

ప్రి-మెచ్యూర్‌ డెలివరీ!

ఇలా కాబోయే అమ్మగా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ.. ఆ ఫొటోలు, వీడియోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇప్పుడు మరోసారి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సడెన్‌గా తాను అమ్మనయ్యానంటూ ప్రకటించడమే ఇందుకు కారణం!

‘అవును.. నేను, వైభవ్‌ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందాం.. మాకు మగబిడ్డ పుట్టాడు..’ అంటూ మురిసిపోయిన ఈ బాలీవుడ్‌ మామ్‌.. తనకు నెలలు నిండకుండానే ప్రసవం జరిగిందని, ప్రస్తుతం బిడ్డ నియోనాటల్‌ ఐసీయూలో ఉన్నాడంటూ భావోద్వేగానికి లోనైంది. ఈ క్రమంలో తన చిన్నారి చేయి పట్టుకొని దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న దియా.. ఓ సుదీర్ఘ పోస్ట్‌ రాసుకొచ్చింది.

ఆ సమస్య వల్లే..!

‘బిడ్డ పుట్టాడన్న ఆనందం మన మనసుని ఒక్కచోట నిలవనివ్వదు. తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందిన నేను, వైభవ్‌.. ప్రస్తుతం అలాంటి అమితానందంలోనే మునిగిపోయాం. మాకు మే 14న అందమైన బాబు పుట్టాడు. వాడి పేరు అవ్యాన్‌ అజాద్‌ రేఖి. డెలివరీ డేట్‌ కంటే కొన్ని నెలల ముందే పుట్టాడు. అప్పట్నుంచి నియోనాటల్‌ ఐసీయూలోనే ఉన్నాడు. గర్భిణిగా ఉన్న నేను తీవ్ర బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌కి గురయ్యాను. దీంతో అత్యవసరంగా అపెండెక్టమీ (అపెండిసైటిస్‌ శస్త్రచికిత్స) చేయాల్సి రావడంతో.. డాక్టర్లు సిజేరియన్‌ చేసి బిడ్డను బయటికి తీశారు. ప్రస్తుతం నేను, నా బిడ్డ క్షేమంగా ఉన్నాం. ఈ క్రమంలో ఎంతో శ్రమించిన వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు.. వారు అందించిన వైద్య సేవలు, నన్ను, బాబును కంటికి రెప్పలా చూసుకున్న తీరుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. నా లిటిల్‌ అవ్యాన్‌ త్వరలోనే ఇంటికి రాబోతున్నాడు. వాడిని చేతుల్లోకి తీసుకొని ముద్దాడడానికి ఇంట్లో అంతా ఎదురుచూస్తున్నారు. మాపై ప్రేమ కురిపిస్తూ ప్రార్థించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు! థ్యాంక్యూ!!’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకుందీ న్యూ మామ్.

ఇలా తమకు కొడుకు పుట్టిన విషయం దియా ఇన్‌స్టాలో పంచుకోగానే.. సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి ఈ న్యూ పేరెంట్స్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కంగ్రాట్స్‌ దియా-వైభవ్!


Advertisement

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి