పొట్టలో ఇన్ఫెక్షన్.. తగ్గేదెలా?

తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు.. జీర్ణవ్యవస్థలో తలెత్తే ఇలాంటి సమస్యల్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం..

Published : 12 Sep 2022 20:17 IST

తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు.. జీర్ణవ్యవస్థలో తలెత్తే ఇలాంటి సమస్యల్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం.. అదే తగ్గిపోతుందిలే అంటూ నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ కొన్ని సందర్భాలలో ఇలాంటి లక్షణాలు పొట్ట ఇన్ఫెక్షన్‌కు (Stomach Flu) సూచన కావచ్చు అంటున్నారు నిపుణులు. ఇలా జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల దీని ప్రభావం ఇతర అవయవాల పనితీరుపై కూడా పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే దీనికి సంబంధించి వెంటనే వైద్యులను సంప్రదించడంతో పాటు మనం తీసుకునే ఆహారంలో పలు మార్పులు-చేర్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

Stomach Flu/పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్‌.. ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్‌ జీర్ణ వ్యవస్థపై దాడి చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌ కారణంగా వికారం, వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపులో నొప్పి.. వంటి దుష్ప్రభావాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా కేవలం శారీరక ఆరోగ్యం పైనే కాదు.. మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ఈ ఇన్ఫెక్షన్‌కి మనం తీసుకునే ఆహారమే విరుగుడు అంటున్నారు నిపుణులు.

ఏవి తీసుకోవాలి?

* పొట్ట ఇన్ఫెక్షన్‌ కారణంగా అయ్యే వాంతులు, విరేచనాల వల్ల శరీరం ఎక్కువ మొత్తంలో నీటిని కోల్పోతుంది. తద్వారా డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే నీళ్లు, ఎలక్ట్రోలైట్ వాటర్‌, కొబ్బరి నీళ్లు, అల్లం-పుదీనాతో తయారుచేసిన హెర్బల్‌ టీ, కాయగూరలు ఉడికించిన నీళ్లు.. వంటివి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. తద్వారా సమస్య తగ్గడంతో పాటు శరీరానికి శక్తి కూడా అందుతుంది.

* ఈ సమయంలో సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు/వంటకాలకే అధిక ప్రాధాన్యమివ్వాలంటున్నారు. ఈ క్రమంలో పెసరపప్పు-బియ్యంతో చేసుకునే కిచిడీ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్‌ అందుతుంది.

* మనకేదైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు గుడ్లు-మాంసం వంటివి చూస్తేనే వికారం వస్తుంటుంది. కానీ పొట్ట ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారు కోడిగుడ్లను తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు. వీటిలో ఉండే ‘బి’ విటమిన్, సెలీనియం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో సహకరిస్తాయట! తద్వారా ఎలాంటి అనారోగ్యాన్నైనా దూరం చేసుకోవచ్చన్నమాట! అలాగే మాంసం తీసుకోవాలనుకున్న వారు స్కిన్‌లెస్‌ని ఎంచుకోవడం మంచిది.

* మనం ఆహారంలో భాగంగా తీసుకునే సూప్స్‌ కూడా పొట్ట ఇన్ఫెక్షన్‌ని దూరం చేసి.. జీర్ణశక్తిని పెంచుతాయి. అంతేకాదు.. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్‌ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

* పొట్ట ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారికి BRAT డైట్‌ మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇందులో భాగంగా అరటిపండ్లు (Banana), అన్నం (Rice), యాపిల్‌ సాస్‌ (Apple sauce), టోస్ట్‌ (Toast).. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో అధిక మొత్తంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందించడంతో పాటు వాటిలోని ఇతర పోషకాలూ శరీరానికి అందుతాయి.

ఇవి వద్దు!

* ఫ్రైడ్‌ ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌.. వంటి పదార్థాల్లో కొవ్వులు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అంత సులభంగా జీర్ణం కావు.. పైగా వాటి కారణంగా ఫ్లూ లక్షణాల తీవ్రత మరింత ఎక్కువవుతుంది.

* మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుంటే వికారం, వాంతులయ్యే అవకాశాలే ఎక్కువ.

* శరీరాన్ని హైడ్రేట్‌ చేసుకోవడానికి పండ్ల రసాలు తాగుతుంటారు కొంతమంది. కానీ వాటిలో ఉండే అధిక చక్కెరలు విరేచనాల సమస్యను మరింతగా పెంచుతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే పొట్ట ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారు వీటికి దూరంగా ఉండాలంటున్నారు.

* పచ్చి కాయగూరలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వీటిని తీసుకొని బాధపడడం కంటే దూరంగా ఉండడమే బెటర్.

ఇవీ మేలు చేస్తాయ్!

* ఫ్లూ కారణంగా వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి హీటింగ్‌ ప్యాడ్‌/హాట్‌ బ్యాగ్‌ చక్కటి ప్రత్యామ్నాయం. ఇది అందుబాటులో లేని వారు వేడి నీళ్లలో ముంచి పిండిన కాటన్‌ వస్త్రంతో పొట్టపై కాపడం కూడా పెట్టుకోవచ్చు.

* ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిళ్లన్నీ పక్కన పెట్టి హాయిగా నిద్ర పోవడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో శరీరం తనను తాను రిపేర్‌ చేసుకుంటూ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కూడగట్టుకుంటుందని సలహా ఇస్తున్నారు.

ఇలా ఇవన్నీ చేసినా ఈ సమస్య నుంచి విముక్తి పొందలేకపోతున్నారంటే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి! తద్వారా వారు సూచించిన మందులు వాడుతూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ సమస్య నుంచి క్రమంగా బయటపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్