షెల్ఫ్ లైఫ్.. ఎక్స్‌పైరీ తేదీ.. రెండూ ఒక్కటేనా?

మార్కెట్లో ఏ వస్తువు కొన్నా.. దానిపై తయారీ తేదీ, గడువు తేదీలు కచ్చితంగా రాసుంటాయి. అవి ఎప్పుడు తయారయ్యాయి? ఎంతకాలం వరకు వినియోగించడానికి సురక్షితం? అనే విషయాల్ని ఇవి తెలియజేస్తాయి....

Published : 13 Jun 2024 20:27 IST

మార్కెట్లో ఏ వస్తువు కొన్నా.. దానిపై తయారీ తేదీ, గడువు తేదీలు కచ్చితంగా రాసుంటాయి. అవి ఎప్పుడు తయారయ్యాయి? ఎంతకాలం వరకు వినియోగించడానికి సురక్షితం? అనే విషయాల్ని ఇవి తెలియజేస్తాయి. అయితే వీటితో పాటు ‘షెల్ఫ్‌ లైఫ్‌/యూజ్‌ బై’ అని కూడా కొన్నిటి మీద రాసుంటుంది. చాలామంది ఇది, గడువు తేదీ ఒకటేనేమో అని పొరబడుతుంటారు. కానీ ఈ రెండింటికీ స్వల్ప వ్యత్యాసం ఉందంటున్నారు నిపుణులు. లేబుల్‌ని సునిశితంగా పరిశీలిస్తే ఆ తేడాను ఇట్టే పసిగట్టేయచ్చంటున్నారు. మరి, అదేంటో తెలుసుకుందాం రండి..

విషపూరిత ఆహారం తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు అనారోగ్యానికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు గడువు తేదీ, షెల్ఫ్‌ లైఫ్‌ దాటిన ఆహారం తీసుకోవడమూ ఓ కారణమంటున్నారు నిపుణులు. ప్రతి ప్యాకేజీపై వీటిని పరిశీలించడంతో పాటు సరైన రీతిలో భద్రపరిస్తే ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధుల్ని చాలావరకు అరికట్టచ్చంటున్నారు.

రెండింటి మధ్య తేడా ఏంటంటే?
మార్కెట్లో కొనే ఉత్పత్తులపై తయారీ, గడువు తేదీలు ఉంటాయన్న విషయం తెలిసిందే! అయితే వీటితో పాటు షెల్ఫ్‌ లైఫ్‌ని కూడా ఆయా సంస్థలు లేబుల్‌పై పేర్కొంటాయి. కానీ ఇది, గడువు తేదీ ఒకటేనేమోనని అనుకుంటారు కొందరు. అయితే ఈ రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉందంటున్నారు నిపుణులు.
గడువు తేదీ అంటే..
ఒక ఉత్పత్తిని ఎన్ని రోజుల తర్వాత అస్సలు వాడకూడదో తెలియజేసే కాల పరిమితి. ఆ తర్వాత దాని ప్రభావం తగ్గిపోవడమే కాదు.. అది హానికరం కూడా అని దీని అర్థం!
అదే షెల్ఫ్‌ లైఫ్‌ విషయానికొస్తే..
ఉత్పత్తిని తెరిచిన తర్వాత.. దాని లేబుల్‌పై పొందుపరిచిన నియమనిబంధనలకు అనుగుణంగా సరైన నాణ్యతా ప్రమాణాలతో దాన్ని నిల్వ చేయడం/భద్రపరచడం చేస్తే అది ఎంత కాలం సురక్షితంగా ఉంటుందని తెలియజేసే సూచిక ఇది. ఉదాహరణకు.. 12M అని ఉంటే.. దానికి 12 నెలల షెల్ఫ్‌ లైఫ్‌ ఉందని అర్థం! సాధారణంగా దీన్ని ఉత్పత్తిపై ‘యూజ్‌ బై’ లేదా ‘సెల్‌ బై’ అనే పదాలతో సూచిస్తారు. షెల్ఫ్‌ లైఫ్‌ దాటినప్పుడు ఒకవేళ గడువు తేదీ మీరకపోయినా ఆయా ఉత్పత్తుల్ని వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఆహారం, మందులు, కాస్మెటిక్స్‌.. వంటి ఉత్పత్తుల్ని ఉపయోగించే క్రమంలో ఈ రెండు తేదీల్ని దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమంటున్నారు. తద్వారా ఆహారం, అందంపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

దేని గడువు.. ఎలా?
కొనే వస్తువు ఏదైనా సరే.. దాన్ని ఉపయోగించే క్రమంలో గడువు తేదీ, షెల్ఫ్‌ లైఫ్‌.. వంటివి తెలుసుకోవడానికి లేబుల్‌ని సునిశితంగా పరిశీలించాలంటున్నారు నిపుణులు. అయితే ఈ క్రమంలో కొన్ని ఉత్పత్తులపై ‘ఎక్స్‌పైరీ’, ‘యూజ్‌ బై’ అనే పదాలకు బదులు ‘బెస్ట్‌ బిఫోర్‌’ అని రాసుంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల స్నాక్స్‌.. క్యాన్‌డ్‌ ఉత్పత్తులు వంటి వాటి లేబుల్స్‌పై ఈ పదాన్ని గుర్తించచ్చు. నిజానికి ఇవి గడువు తేదీ దాటినా పాడవవు. కానీ వాటిపై పేర్కొన్న తేదీ దాటితే మాత్రం వాటి రుచి, నాణ్యత, ఆకృతిలో తేడాల్ని గమనించచ్చు. కాబట్టి ఇలాంటివి కూడా ఆరోగ్యకరం కాదంటున్నారు నిపుణులు.
ఇక మరోవైపు.. పాలు-పాల పదార్థాలు, మాంసాహారం, మందులు.. వంటి ఉత్పత్తులు గడువు దాటితే త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీటిని నిర్ణీత వ్యవధి లోపే ఉపయోగించుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.


నిల్వ చేయడమూ ముఖ్యమే!

అయితే మార్కెట్లో కొన్న ఉత్పత్తి ఏదైనా సరే.. వాటిపై పేర్కొన్న గడువు, షెల్ఫ్‌ లైఫ్‌ తేదీలకు అనుగుణంగా మన్నాలంటే.. దాన్ని నిల్వ చేసే లేదంటే భద్రపరిచే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే వాటి నాణ్యత తగ్గిపోయే ఆస్కారం ఉందంటున్నారు. ఇందుకోసం ఆయా ఉత్పత్తులపై పేర్కొన్న లేబుల్స్‌ని సునిశితంగా పరిశీలించాలంటున్నారు. ఉదాహరణకు.. ఫ్రిజ్‌లో పెట్టే ఉత్పత్తుల్ని లేబుల్‌పై పేర్కొన్న ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడం ముఖ్యం. అలాగే ఆహారం, మందుల్ని ఫ్రిజ్‌లో లేదంటే బయట ఉంచినా.. సరైన నిల్వ ప్రమాణాల్ని పాటించాలి. ఇక వీటితో పాటు ఉపయోగించే ఉత్పత్తుల గడువు, షెల్ఫ్‌ లైఫ్‌ తేదీల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. అవి దాటిపోకుండా జాగ్రత్తపడితే ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.. ఈ అలవాటు ఇంటిల్లిపాదికీ మంచిది కూడా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్