వీటి 'ట్రాప్'లో పడితే ఇక దోమల పని అంతే..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా దోమల బెడదే నెలకొంది. వీటివల్ల చాలామంది మలేరియా, డెంగ్యూ.. వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. అందుకే ఈ దోమల సమస్యను తగ్గించుకోవడానికి సాయంత్రం అయ్యిందంటే చాలు.. తలుపులు, కిటికీలు మూసేయడం చేస్తున్నారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాగోలా దోమలు ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి.. రాత్రుళ్లు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. వీటి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందడం కోసం దోమల బ్యాట్లు, దోమ తెరలు, మస్కిటో రిపెల్లెంట్స్.. వంటివి ఎన్ని వాడినా ఫలితం మాత్రం శూన్యం.

Published : 29 Jul 2021 17:26 IST

ప్రస్తుతం ఎక్కడ చూసినా దోమల బెడదే నెలకొంది. వీటివల్ల చాలామంది మలేరియా, డెంగ్యూ.. వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. అందుకే ఈ దోమల సమస్యను తగ్గించుకోవడానికి సాయంత్రం అయ్యిందంటే చాలు.. తలుపులు, కిటికీలు మూసేయడం చేస్తున్నారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలాగోలా దోమలు ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి.. రాత్రుళ్లు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. వీటి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందడం కోసం దోమల బ్యాట్లు, దోమ తెరలు, మస్కిటో రిపెల్లెంట్స్.. వంటివి ఎన్ని వాడినా ఫలితం మాత్రం శూన్యం. మరి, ఈ ప్రాణాంతక దోమల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడమెలా.. అని ఆలోచిస్తున్నారా? అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లోనైనా, బయటైనా దోమల బెడదను తగ్గించుకోవడానికి విభిన్న రకాల 'మస్కిటో ట్రాప్స్' ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మస్కిటో రిపెల్లెంట్‌గా కొన్ని, నైట్ ల్యాంప్‌గా మరికొన్ని.. ఇలా విభిన్న డిజైన్లలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండి, దోమల సమస్యను పరిష్కరిస్తోన్న ఇలాంటి కొన్ని మస్కిటో ట్రాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

మస్కిటో రిపెల్లెంట్ ల్యాంప్

సాధారణంగా రాత్రుళ్లు మన ఇంట్లోకి ప్రవేశించిన దోమల్ని తరిమికొట్టడానికి వివిధ రకాల రిపెల్లెంట్స్, మస్కిటో కాయిల్స్ ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే వాటి ద్వారా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకోసమే ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి పర్యావరణహిత మస్కిటో రిపెల్లెంట్ ల్యాంప్స్. ఫొటోలో చూపించినట్లుగా ఒక చిన్న ల్యాంప్ మాదిరిగా ఉండే ఈ మస్కిటో ట్రాప్ పైభాగం నుంచి పర్పుల్ కలర్ ఎల్ఈడీ లైట్ వెలువడుతుంది. దాంతో పాటు సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన లిక్విడ్ రిపెల్లెంట్ ఇందులో నింపి ఉండడం వల్ల లైట్‌తో పాటు చక్కటి సువాసన కూడా బయటికి వెదజల్లుతుందీ పరికరం. తద్వారా దోమలు ఈ వెలుతురుకు, వాసనకు ఆకర్షితమై దాని దగ్గరికి వెళ్లగానే అది దోమల్ని తనలోకి లాగేసుకొని అందులో ఉండే విద్యుత్ సహాయంతో చంపేస్తుంది. ఇందులో యూఎస్‌బీ ద్వారా నేరుగా కనెక్ట్ చేసుకునేవి కొన్నైతే.. ముందుగానే ఛార్జింగ్ చేసుకొని ఆపై ఉపయోగించుకునేవి మరికొన్ని ఉంటాయి.

నైట్ ల్యాంప్ మస్కిటో ట్రాప్

రాత్రుళ్లు కొందరు చీకట్లో పడుకోవడానికి ఇష్టపడితే.. మరికొందరు బెడ్ లైట్ లేదా నైట్ ల్యాంప్ లేకపోతే అస్సలు నిద్రపోరు. అందుకే ఒక బెడ్ ల్యాంప్‌ని బెడ్‌రూమ్‌లో ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఆ ల్యాంప్ అటు కాస్త వెలుతురునిస్తూనే, ఇటు దోమల్ని కూడా చంపేసేదైతే బాగుంటుంది కదూ!! అలాంటివారి కోసమే నైట్ ల్యాంప్ మస్కిటో ట్రాప్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఫొటోలో చూపించినట్లుగా చిన్న ఛార్జింగ్ లైట్ మాదిరిగా ఉండే ఈ ల్యాంప్‌కి లోపలి భాగంలో ట్యూబ్స్, దాని చుట్టూరా విద్యుత్ తీగలు చుట్టి ఉంటాయి. ఇక ఈ అమరిక చుట్టూరా మన రక్షణ కోసం బ్త్లెండ్స్ మాదిరిగా మరో అమరిక ఉంటుంది. ఈ ల్యాంప్‌ని సాకెట్‌కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే.. దీన్నుంచి డిమ్ లైట్ వెలువడడంతో పాటు లైట్ల చుట్టూ ఉన్న విద్యుత్ తీగల్లో విద్యుత్ ప్రసరిస్తుంది. తద్వారా దోమలు వెలుతురుకు ఆకర్షితమై విద్యుత్ షాక్‌కు గురై చనిపోతాయి.

మస్కిటో ట్రాప్ మెషీన్

కొంతమందికి రాత్రుళ్లు బెడ్ ల్యాంప్ ఉండాలి.. కానీ దాన్నుంచి వెలుతురు కళ్లపై పడకుండా, నిద్ర చెడగొట్టకుండా ఉండాలని భావిస్తుంటారు. అదే సమయంలో దోమల బెడద కూడా ఉండకూడదు అనుకుంటే మస్కిటో ట్రాప్ మెషీన్‌ని మీ ఇంటికి తెచ్చుకోవాల్సిందే! ఫొటోలో చూపించినట్లుగా అచ్చం బెడ్‌సైడ్ టేబుల్ ల్యాంప్‌ని పోలి ఉండే ఈ ట్రాప్ మెషీన్‌కి పైన అమర్చి ఉన్న గొడుగు కింద యూవీ లైట్ ఉంటుంది. దీని సహాయంతో కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్త్తె దానికి దగ్గరగా వచ్చిన దోమల్ని ఆకర్షిస్తుంది. ఇవి ఈ గొడుగు కింది భాగంలో పడిపోయి దాని లోపల అమరి ఉన్న ఫ్యాన్‌లో ఇరుక్కుపోయి, డీహైడ్రేట్ అయి చచ్చిపోతాయి. ఈ మెషీన్ నుంచి వెలువడే యూవీ లైట్‌కి పైనున్న గొడుగు పూర్తిగా కవర్ అయి ఉంటుంది కాబట్టి అది మనపై ఎలాంటి ప్రభావం చూపదు.

సూపర్ ట్రాప్ మస్కిటో కిల్లర్ మెషీన్

లైట్లకు దోమలు త్వరగా ఆకర్షితమవుతాయి. సాధారణంగా ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఛార్జింగ్ లైట్ లేదా మొబైల్‌లో టార్చ్ లైట్ ఆన్ చేసి ఒక దగ్గర ఉంచితే పురుగులు, దోమలు ఆ లైట్ చుట్టూనే తిరుగుతుంటాయి. అలా దోమలకున్న ఆ బలహీనతతోనే వాటిని నిర్మూలించాలి. అందుకోసం ప్రస్తుతం సూపర్ ట్రాప్ మస్కిటో కిల్లర్ మెషీన్స్ మార్కెట్లో కొలువుదీరాయి. ఫొటోలో చూపించినట్లుగా ఓవల్ షేప్‌లో ఉన్న ఈ మస్కిటో కిల్లర్‌కు పైభాగంలో ఎల్ఈడీ లైట్లు అమర్చి ఉండడం మనం గమనించచ్చు. దీన్ని సాకెట్‌కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయడం వల్ల దాన్నుంచి వెలుతురు రావడంతో పాటు ఇందులో నింపిన సహజసిద్ధమైన రిపెల్లెంట్ వాసన కూడా వెలువడుతుంది. ఈ రెండింటికీ ఆకర్షితమైన దోమలు దాని దగ్గరగా వచ్చి ఆ ఉచ్చులో చిక్కుకుంటాయి. అవి కింది భాగంలో ఉన్న ఫ్యాన్‌పై పడి డీహైడ్రేట్ అయి చనిపోతాయి.

ఎకో-ఫ్రెండ్లీ మస్కిటో రిపెల్లెంట్ ల్యాంప్

అటు వెలుతురును ప్రసరిస్తూనే, సహజసిద్ధమైన రిపెల్లెంట్‌ని వెదజల్లుతూ దోమల్ని ఆకర్షించే మరో ట్రాప్ మెషీనే ఈ ఎకో-ఫ్రెండ్లీ మస్కిటో రిపెల్లెంట్ ల్యాంప్. ఫొటోలో చూపించినట్లుగా సిలిండర్ షేప్‌లో ఉండి.. పై భాగంలో మరో చిన్న అమరిక ఉండే ఈ మెషీన్‌ని సాకెట్‌కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే పై నుంచి ఎల్ఈడీ లైట్ వెలుగుతుంది. ఆ వెలుతురుకు ఆకర్షితమైన దోమలు దానికి దగ్గరగా రాగానే ఆ మెషీన్ వాటిని ఆకర్షిస్తుంది. దాంతో అందులో పడిపోయిన దోమలు విద్యుత్ షాక్‌తో డీహైడ్రేట్ అయి చనిపోతాయి. ఇలా చనిపోయిన దోమలన్నీ కింది భాగంలో ఉండే డబ్బాలో పడిపోతాయి.. ఉదయాన్నే దాన్ని తీసి సులభంగా క్లీన్ చేసుకొని తిరిగి బిగించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్