Updated : 31/12/2021 17:46 IST

ఈ న్యూఇయర్ వింత సంప్రదాయాల గురించి విన్నారా?

పాత ఏడాదికి గుడ్‌బై చెప్పేసి కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తరుణం ఆసన్నమైంది. న్యూ ఇయర్ అనగానే పార్టీలు, డీజేలు.. ఇలా ఎంతో జోష్‌తో కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి రడీ అవుతుంటారంతా. ఎందుకంటే ఇలా ఆ రోజు ఎంత ఆనందంగా గడిపితే ఆ సంవత్సరమంతా అంత సంతోషంగా ఉండచ్చనేది అందరి భావన.

ఇక పార్టీలు, డీజేలు.. పక్కన పెడితే కొన్ని దేశాల్లో మాత్రం నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో కొన్ని వింత సంప్రదాయాల్ని పాటిస్తుంటారట అక్కడి ప్రజలు. తద్వారా రాబోయే ఏడాదంతా తమ జీవితం ఆనందమయం అవుతుందని వారు నమ్ముతారు. మరి, ఈ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే క్రమంలో కొన్ని దేశాలు పాటించే ఆసక్తికర సంప్రదాయాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..


ఉపయోగించని పాత్రల్ని పగలగొట్టి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు డెన్మార్క్‌ వాసులు. ఆ ఏడాదిలో పాతబడిపోయిన పాత్రలు, ప్లేట్స్‌.. వంటివి పడేయకుండా పక్కన పెట్టి వాటిని డిసెంబర్‌ 31న తమ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇంటి తలుపులకేసి కొడతారు. ఇలా చేయడాన్ని కొత్త సంవత్సరానికి శుభసూచకంగా భావిస్తారా దేశస్థులు.


డిసెంబర్‌ 31 అర్ధరాత్రి ఈక్వెడార్‌ ప్రజలు దిష్టిబొమ్మల్ని దహనం చేస్తారు. ఈ మంటల్లో గతంలో తాము దిగిన ఫొటోల్ని సైతం వేస్తుంటారు. తద్వారా గతేడాది తమ జీవితంలో జరిగిన చెడును కాల్చేస్తూ కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్లు వారు భావిస్తారు.


డిసెంబర్‌ 31 అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు పన్నెండు ద్రాక్షపండ్లను నోట్లో కూరుకొని కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు స్పెయిన్‌ వాసులు. అయితే ఒక్కో గంట కొట్టేకొద్దీ ఒక్కో పండును నోట్లో పెట్టుకుంటూ(మింగకూడదు) ఇలా 12 పండ్లను ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా నోట్లో కూరుకుంటారో వారికి కొత్త ఏడాది సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందనేది అక్కడి ప్రజల నమ్మకం.


బౌద్ధులు ఎక్కువగా నివసించే జపాన్‌లో కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కోసం 108 సార్లు గంట కొడతారట! తద్వారా వచ్చే ఏడాదంతా ఆనందంగా సాగుతుందని, అదృష్టం వరిస్తుందని జపనీయుల భావన.


చల్లచల్లటి ఐస్‌క్రీమ్‌ను నేలమీద పడేస్తూ కొత్త ఏడాదిని ఆహ్వానిస్తారు స్విట్జర్లాండ్‌ వాసులు.


పోల్కా డాట్స్‌ దుస్తులు ధరించడం, గుండ్రటి ద్రాక్షపండ్లు తినడం, కాయిన్స్‌ టాస్‌ వేయడం.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో ఇలా గుండ్రంగా ఉన్న వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు ఫిలిప్పీన్స్‌ వాసులు. తద్వారా కొత్త ఏడాది ధన ప్రాప్తి కలుగుతుందని వారు భావిస్తుంటారు.


విడి నాణేలు నదిలో విసరడం ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు రొమేనియన్లు. ఇలా చేయడం వల్ల కొత్త ఏడాది ధనానికి ఎలాంటి లోటు ఉండదనేది వారి భావన.


కొత్త ఏడాది సందర్భంగా చెడును తమ జీవితంలో నుంచి తొలగించి మంచిని ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి గుర్తుగా పూర్టోరికో ప్రజలు తమ బాల్కనీలోంచి నీళ్ల బకెట్లను బయటకి విసురుతుంటారు.


స్వీట్లు తయారుచేసి వాటిలో నాణేలను అమర్చుతారు బొలీవియా దేశస్థులు. కొత్త ఏడాది రోజున ఆ స్వీట్లు తినే క్రమంలో ఎవరికైతే ఆ కాయిన్స్‌ వస్తాయో వారికి వచ్చే ఏడాదంతా డబ్బుకు కొదవుండదనేది ఆ దేశ ప్రజల నమ్మకం.


తియ్యతియ్యటి ప్యాన్‌ కేక్స్‌తో నోటిని తీపి చేసుకుంటూ నూతన ఏడాదికి స్వాగతం పలుకుతారు ఫ్రెంచ్‌ ప్రజలు. తద్వారా కొత్త సంవత్సరమంతా స్వీట్‌లాగా మధురంగా, ఆనందంగా గడిచిపోతుందని వారు నమ్ముతారు.


కొత్త సంవత్సరం రోజు కొలంబియా ప్రజలు ఎక్కడికెళ్తే అక్కడికి తమ వెంట సూట్‌కేస్‌లను తీసుకెళ్లాల్సిందే! తద్వారా ఆ ఏడాదంతా వేర్వేరు చోట్లలో పర్యటిస్తూ సంతోషంగా గడపొచ్చనేది వారి ఆలోచన.


ఒకరి ముఖాలపై ఒకరు బూడిద పూసుకుంటూ, బకెట్‌ నీళ్లు ఒకరిపై ఒకరు విసురుకుంటూ కొత్త ఏడాదిని ఆహ్వానిస్తారు థాయిలాండ్‌ వాసులు. ఇలా ఎంజాయ్‌చేస్తూ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తే వచ్చే ఏడాదంతా ఆనందంగా ఉంటుందనేది అక్కడి ప్రజల నమ్మకం.


బ్రెడ్‌ ముక్కల్ని గోడలపై విసురుతూ తమ జీవితంలోని చెడు తొలగిపోవాలని కొత్త ఏడాది సందర్భంగా కోరుకుంటారు ఐర్లాండ్‌ దేశస్థులు.


కొత్త ఏడాది తొలి రోజున ఏడుసార్లు కడుపునిండా ఆహారం తీసుకోవడం ఈస్టోనియా ప్రజల ఆచారం. తద్వారా వచ్చే ఏడాదంతా కడుపునిండా ఆహారం దొరుకుతుందని వారు భావిస్తారు.


ఆ ఏడాదిలో ఏర్పడిన విభేదాలను డిసెంబర్‌లో పరిష్కరించుకోవడానికి మొగ్గుచూపుతారు పెరూ ప్రజలు. తద్వారా సరికొత్తగా, ఆనందంగా కొత్త ఏడాదిని ఆహ్వానించచ్చని పెరూవియన్లు నమ్ముతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని