వావ్‌.. ఈ పాప్‌కార్న్‌ మేకర్స్‌ భలేగున్నాయే!!

టీవీ చూసేటప్పుడైనా.. థియేటర్‌లో సినిమా మధ్యలో బ్రేక్‌ వచ్చినా.. ఫ్రెండ్స్‌తో బాతాఖానీ వేసేటప్పుడైనా.. టైంపాస్‌గా ఏదైనా తిందాం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే స్నాక్‌ ఐటమ్‌ ‘పాప్‌కార్న్‌’. ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే అద్భుతమైన రుచి వీటి సొంతం. అలాగని బయట చేసిన పాప్‌కార్న్‌ తెచ్చుకుంటారా ఏంటి? ఆ అవసరం లేకుండానే ఇంట్లోనే చిటికెలో వీటిని తయారుచేసుకోవచ్చు. అలాంటి బోలెడన్ని పాప్‌కార్న్‌ మేకింగ్‌ గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయ్‌.

Updated : 28 Sep 2022 15:58 IST

టీవీ చూసేటప్పుడైనా.. థియేటర్‌లో సినిమా మధ్యలో బ్రేక్‌ వచ్చినా.. ఫ్రెండ్స్‌తో బాతాఖానీ వేసేటప్పుడైనా.. టైంపాస్‌గా ఏదైనా తిందాం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే స్నాక్‌ ఐటమ్‌ ‘పాప్‌కార్న్‌’. ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే అద్భుతమైన రుచి వీటి సొంతం. అలాగని బయట చేసిన పాప్‌కార్న్‌ తెచ్చుకుంటారా ఏంటి? ఆ అవసరం లేకుండానే ఇంట్లోనే చిటికెలో వీటిని తయారుచేసుకోవచ్చు. అలాంటి బోలెడన్ని పాప్‌కార్న్‌ మేకింగ్‌ గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయ్‌. వాటిలో కార్న్‌ గింజలు వేసి సర్వింగ్‌ బౌల్స్‌ చేతిలోకి తీసుకునేలోపే ఇవి సిద్ధమైపోతాయి. అంత త్వరగా పాప్‌కార్న్‌ను తయారుచేస్తాయీ గ్యాడ్జెట్స్‌. ఇక వీటిలో కావాలంటే నూనె వేసుకోవచ్చు.. లేదంటే ఆయిల్‌ ఫ్రీగా కూడా రుచికరమైన పాప్‌కార్న్‌ తయారుచేసుకోవచ్చు. మరి, చిటికెలో పాప్‌కార్న్‌ను సిద్ధం చేసే కొన్ని పాప్‌కార్న్‌ మేకర్స్‌ గురించి మీకోసం..

పాప్‌కార్న్‌ బండి వచ్చేసింది!

బయటికి వెళ్లినప్పుడు రోడ్డు పక్కన బండి మీద తయారుచేసే పాప్‌కార్న్‌ చూడగానే తినాలని మనసు లాగుతుంటుంది. అలాంటి పాప్‌కార్న్‌ బండి ఇంటికే వచ్చేస్తే..? ఈ వింటేజ్‌ మోడల్‌ ‘హాట్‌ ఎయిర్‌ పాప్‌కార్న్‌ మేకర్‌’ కూడా అలాంటిదే! చూడగానే ఆకట్టుకునేలా ఉండే ఈ మేకర్‌తో ఒకేసారి ఎక్కువ మొత్తంలో పాప్‌కార్న్‌ తయారుచేసుకోవచ్చు. ఫొటోలో చూపించినట్లుగా ఓ చిన్న సైజు బండి మాదిరిగా ఉండే దీని పైభాగంలో ఉండే రంధ్రంలో కార్న్‌ గింజలు వేయాలి. అవి అక్కడ్నుంచి నేరుగా కింది భాగంలో ఉండే మెషీన్‌లో పడతాయి. అవసరమైతే ఇందులో నూనె/బటర్‌ వేసుకోవచ్చు. ఇప్పుడు ప్లగ్‌ని సాకెట్‌కి కనెక్ట్‌ చేసి స్విచాన్‌ చేసి.. మేకర్‌కి పక్క భాగంలో ఉన్న బటన్‌ని నొక్కాలి. అంతే.. నిమిషాల్లో కార్న్‌ పాప్‌కార్న్‌లా మారి.. ముందుభాగంలో ఉండే ఓపెనర్‌ ద్వారా బౌల్‌లో పడతాయి. సో.. ఒక్కసారి ఇలా పెద్ద మొత్తంలో పాప్‌కార్న్‌ తయారుచేసుకుంటే కుటుంబ సభ్యులందరికీ సరిపోతాయి.


సాకర్‌ బాల్‌ పాప్‌కార్న్‌ మేకర్‌..

ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులందరూ కలిసి క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ.. మధ్యమధ్యలో పాప్‌కార్న్‌ లాగిస్తూ ఉంటే ఆ మజానే వేరు కదండీ.. అయితే అందుకోసం కుక్కర్‌, గిన్నెలంటూ కష్టపడాల్సిన అవసరం లేదు. అటు క్రికెట్‌ మిస్‌ కాకుండానే ఇటు పాప్‌కార్న్‌ సిద్ధం చేసుకోవచ్చు. ఆ మేకర్‌ను కూడా మీరు టీవీ చూస్తున్న ప్రదేశంలోనే టేబుల్‌పై అమర్చుకొని పాప్‌కార్న్‌ తయారుచేసుకోవచ్చు. అలాంటిదే ఈ ‘సాకర్‌ బాల్‌ పాప్‌కార్న్‌ మేకర్‌’ కూడా! చిత్రంలో చూపించిన విధంగా పైభాగంలో ఫుట్‌బాల్‌లా ఉండి, కిందివైపు మెషీన్‌ ఉంటుంది. ఇప్పుడు పైనుండే ఫుడ్‌బాల్‌ మూతను ఓపెన్‌ చేసి, అందులో కొన్ని కార్న్‌ వేయాలి. ఆపై ఈ మేకర్‌తో పాటే వచ్చిన.. ఒకవైపు ఓపెన్‌ చేసి ఉన్న గ్లాస్‌బౌల్‌ను దానిపై అమర్చాలి. ఇప్పుడు ప్లగ్‌ని సాకెట్‌కి కనెక్ట్‌ చేసి.. స్విచ్‌ ఆన్‌ చేయాలి. ఆపై మెషీన్‌కి ముందు భాగంలో ఉన్న బటన్‌ని నొక్కాలి. ఈ కార్న్‌లో అవసరమైతే కొద్దిగా బటర్‌ లేదా నూనె వేసుకోవచ్చు. ఆపై రెండు మూడు నిమిషాలకు కార్న్‌ పాప్‌కార్న్‌లా మారి ఫొటోలో చూపించిన విధంగా బయటకొచ్చేస్తుంది. ఈ కార్న్‌లో ఫ్లేవర్‌ కోసం ఉప్పు, కారం.. వంటివి కలుపుకొని యమ్మీగా లాగించేయచ్చు. ఇలా మనం ఎక్కడైనా కూర్చొని పాప్‌కార్న్‌ను ఈజీగా ప్రిపేర్‌ చేసుకోవచ్చు.


స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ స్టర్రింగ్‌ పాప్‌కార్న్‌ మేకర్‌

సరదాగా ఫ్రెండ్స్‌తోనో.. ఫ్యామిలీతోనో పిక్‌నిక్‌కు వెళ్లాలనుకుంటున్నారా? మరి ముందుగానే పాప్‌కార్న్‌ని తయారుచేసుకుని తీసుకెళ్తే మెత్తగా అయిపోతాయి కదా! మరెలా అనుకుంటున్నారా? మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ.. నిమిషాల్లో పాప్‌కార్న్‌ని సిద్ధం చేసుకోవడానికి వీలుగా ఈ ‘స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ స్టర్రింగ్‌ పాప్‌కార్న్‌ మేకర్‌’ని రూపొందించారు డిజైనర్లు. ఫొటోలో చూపించిన ఈ పాప్‌కార్న్‌ మేకర్‌ని చూస్తే ‘ఆదిత్య 369’ చిత్రంలోని టైం మెషీన్‌ గుర్తుకురాక మానదు. దీనిపై ఉన్న గ్లాస్‌ బౌల్‌ని సెపరేట్‌ చేసి లోపల ఉన్న ప్లేట్‌పై ఓ స్పూన్‌ లేదా అంతకంటే ఎక్కువ నూనె లేదా కరిగించిన బటర్‌ని వేయాలి. ఇప్పుడు ఈ ప్లేట్‌లో కార్న్‌ వేసి మూత పెట్టేయాలి. ఆపై సాకెట్‌కి ప్లగ్‌ని కనెక్ట్‌ చేసి స్విచ్‌ ఆన్‌ చేయాలి. ఈ ప్లేట్‌పై ఉండే తీగ ద్వారా కరెంట్‌ పాస్ అవుతుంది. ఈ తీగ తిరుగుతూ కార్న్‌ను పాప్‌కార్న్‌లా మారుస్తుంది. ఇలా రెండుమూడు నిమిషాల్లోనే రుచికరమైన పాప్‌కార్న్‌ సిద్ధమవుతుంది. ఇలా పాప్‌కార్న్‌ సిద్ధమయ్యాక మూతలా పెట్టిన గ్లాస్‌ బౌల్‌లోనే పాప్‌కార్న్‌ సర్వ్‌ చేసేయచ్చు.


డక్‌ ఫేస్‌ ఎలక్ట్రిల్‌ పాప్‌కార్న్‌ మేకర్‌

ఎంత రుచిగా స్నాక్స్‌ తయారుచేసినా కొందరు పిల్లలు తిననంటూ మారాం చేస్తుంటారు. అదే.. వారికిష్టమైన బొమ్మల రూపంలో ఉండే బౌల్స్‌లలో వాటిని తయారుచేయడం, వడ్డించడం.. వంటివి చేస్తే పోటీపడి మరీ తినేస్తుంటారు. ‘డక్‌ ఫేస్‌ ఎలక్ట్రికల్‌ పాప్‌కార్న్‌ మేకర్‌’ కూడా అలాంటిదే! ఫొటోలో చూపించినట్లుగా అచ్చం నోరు తెరిచిన బాతులా ఉంటుందీ మేకర్‌. ఇప్పుడు బొమ్మకు పైనుండే రెడ్‌ క్యాప్‌ను ఓపెన్‌ చేసి.. అందులో కార్న్‌, కరిగించిన బటర్‌ లేదా నూనె జత చేసి మూత పెట్టేయాలి. ఆపై ప్లగ్‌ను సాకెట్‌కు కనెక్ట్‌ చేసి.. స్విచ్‌ ఆన్‌ చేయాలి. అంతే రెండు మూడు నిమిషాల్లో బాతు నోటి నుంచి పాప్‌కార్న్‌ బౌల్‌లో పడతాయి. ఎంతో ఈజీగా ఉంది కదూ.. ఈ మెషీన్‌లో పాప్‌కార్న్‌ తయారుచేసుకోవడం! ఇలాంటి మేకర్‌లో పాప్‌కార్న్‌ తయారుచేస్తే పిల్లలూ యమ్మీగా లాగించేస్తారు. కావాలంటే మీరూ ఓసారి ట్రైచేయకూడదూ!!


మల్టీఫంక్షన్‌ ఎలక్ట్రిక్‌ పాప్‌కార్న్‌ మేకర్‌

పాప్‌కార్న్‌తో పాటు మరికొన్ని స్నాక్స్‌ ప్రిపేర్‌ చేసుకునే గ్యాడ్జెట్‌ ఉంటే బాగుంటుందనుకుంటున్నారా? అలాంటిదే ఈ ‘మల్టీఫంక్షన్‌ ఎలక్ట్రిక్‌ పాప్‌కార్న్‌ మేకర్‌’. ఇది చూడడానికి అచ్చం చిన్న ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌లా ఉంటుంది. దీనిలో ఉన్న ప్లేట్‌పై బటర్‌ లేదా నూనె వేసి.. అందులో కార్న్‌ వేయాలి. ఆపై మూత పెట్టేసి సాకెట్‌కు ప్లగ్‌ని కనెక్ట్‌ చేసి.. స్విచ్‌ ఆన్‌ చేసి ఈ మెషీన్‌ ముందు భాగంలో ఉండే బటన్‌ని ప్రెస్‌ చేయాలి. అంతే.. రెండు మూడు నిమిషాల్లో రుచికరమైన పాప్‌కార్న్‌ సిద్ధమవుతుంది. ఇలా ఈ మెషీన్‌లో పాప్‌కార్న్‌ని తయారుచేసుకోవడంతో పాటు.. గుడ్లను ఉడకబెట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా ఎగ్‌ ట్రే లాంటి ఒక ప్లేట్‌ని కూడా అందిస్తున్నారు డిజైనర్లు. అలాగే ఆమ్లెట్‌, ప్యాటీస్‌, ఫ్రైడ్‌ మోమోస్‌.. వంటివి కూడా ఈ మేకర్‌లో వండేయచ్చు. వావ్‌ ఎన్ని ఉపయోగాలో కదూ ఈ మల్టీఫంక్షన్‌ పాప్‌కార్న్‌ మేకర్‌తో!


హెల్దీ స్నాక్‌ మేట్‌

ఇక అటు పాప్‌కార్న్‌తో పాటు.. ఇటు కరకరలాడే అప్పడాలు, వడియాలు కూడా వేయించుకునేందుకు వీలుగా ఉండే మేకర్‌ కావాలనుకుంటే ‘హెల్దీ స్నాక్‌ మేట్‌’ను మీ కిచెన్‌లో చేర్చుకోవాల్సిందే! పైగా తక్కువ నూనెతోనే ఈ స్నాక్స్‌ను మీకు తయారుచేసి పెడుతుందీ గ్యాడ్జెట్‌. చిత్రంలో చూపించిన విధంగా చిన్న బాక్స్‌లా ఉంటుందీ పాప్‌కార్న్‌ మేకర్‌. ఇందులో పైన ఉండే చిన్న ఓపెన్‌లో నుంచి కార్న్‌ వేసి.. కావాలనుకుంటే బటర్‌ లేదా నూనెను కూడా వేసుకోవచ్చు. ఆపై దీనితో పాటు వచ్చిన చిన్న స్పూన్‌తో ఆ హోల్‌ని మూసేసి.. ప్లగ్‌ని సాకెట్‌కు కనెక్ట్‌ చేసి స్విచ్‌ ఆన్‌ చేయాలి. ఇప్పుడు మెషీన్‌కున్న బటన్‌ని నొక్కాలి. లోపలున్న మెషీన్‌ గుండ్రంగా తిరుగుతూ రెండు మూడు నిమిషాల్లోనే పాప్‌కార్న్‌ తయారై ఫొటోలో చూపించినట్లుగా ముందున్న ఓపెన్‌లో నుంచి బయట ఉన్న బౌల్‌లో పడతాయి. ఇదే తరహాలో అప్పడాలు, వడియాలను కూడా తయారుచేసుకోవచ్చు. వీటికి అవసరమైతే నూనె లేదా బటర్‌ వేసుకోవచ్చు.. లేదంటే ఆయిల్‌-ఫ్రీగానే చేసుకోవచ్చు. ఇలా పేరుకు తగ్గట్లే నూనె లేకుండా ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని క్షణాల్లో తయారుచేసి అందిస్తుందీ మేకర్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్