Updated : 14/02/2023 18:51 IST

అక్కడ నెలకోసారి ‘ప్రేమికుల దినోత్సవం’..!

కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్‌ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. తమ మనసులోని ప్రేమను చాక్లెట్లు, బొమ్మలు, ఖరీదైన బహుమతులు.. చివరికి ఒక రోజా పువ్వుతోనైనా తెలియజేస్తుంటారు. ఇలా వేలంటైన్స్‌ డే రోజున ప్రేమను చాటిచెప్పడం కామన్‌ అయినా.. వేడుకలను జరుపుకొనే విధానం మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో విభిన్న పద్ధతుల్లో జరుపుకొనే వేలంటైన్స్‌ డే వేడుకల గురించి తెలుసుకుందామా..?

వివిధ దేశాల్లో విభిన్నంగా..

⚛ బల్గేరియాలో వేలంటైన్స్‌ డేను ‘వైన్‌ డే’ పేరుతో జరుపుకొంటారు. ఈరోజు జంటలు వైన్‌ను ఒకరికి ఒకరు ఇచ్చుపుచ్చుకుంటూ తమ ప్రేమను తెలియజేస్తుంటారు.

⚛ ఫిలిప్పీన్స్‌లో వేలంటైన్స్‌ డే రోజు సామూహిక వివాహాలు చేసుకుంటారు. వందల, వేల సంఖ్యలో జంటలు ఈరోజు వివాహ బంధంతో ఒక్కటవుతాయి. ఈ వివాహాలకు ఏకంగా అక్కడి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయడం మరో విశేషం.

⚛ 2007 నుంచి ‘ఘనా’ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 14ను ‘జాతీయ చాక్లెట్‌’ దినోత్సవంగా జరుపుతోంది. చాక్లెట్‌ తయారీకి ఉపయోగించే కోకో బీన్స్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన ఘనా తమ దేశంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ఈక్రమంలో ఫిబ్రవరి 14న ఆ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా చాక్లెట్‌ థీమ్‌ మెనూలు, ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తారు.

⚛ దక్షిణకొరియాలో ప్రేమికుల దినోత్సవ వేడుకలు భిన్నంగా జరుగుతాయి. ఇక్కడ ప్రతి నెల 14న ‘ప్రేమికుల దినోత్సవం’గా జరుపుకొంటారు. అయితే ఫిబ్రవరి14, మార్చి 14లకు మరింత ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 14న మగవాళ్లకు ఆడవాళ్లు చాక్లెట్లను బహుమతిగా ఇస్తారు. అయితే పురుషులు ఆ వెంటనే కాకుండా మార్చి 14న తమ ఇష్టసఖులకు చాక్లెట్లను తిరిగి బహుమతిగా ఇస్తారు. దీన్ని ‘వైట్ డే’గా పిలుచుకుంటారు. ఇక ఏప్రిల్‌ 14న ‘బ్లాక్‌ డే’ను నిర్వహిస్తారు. ఈరోజున గడిచిన రెండు నెలల్లో ఎలాంటి బహుమతులు అందుకోని వారందరూ (సింగిల్స్) ఒక చోట చేరి బ్లాక్‌ బీన్‌ సాస్‌ నూడుల్స్‌ తింటారు. భలే వింతగా ఉంది కదూ కొరియన్‌ వేలంటైన్స్‌ డే!

⚛ ఫిబ్రవరి 14న ప్రపంచమంతా ‘వేలంటైన్స్‌ డే’ సంబరాల్లో మునిగిపోతే.. ఉత్తర ఐరోపాలోని ఈస్టోనియా దేశంలో మాత్రం ఈరోజును ‘ఫ్రెండ్షిప్‌ డే’గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈరోజు స్నేహితులు ఒకరికొకరు గ్రీటింగ్‌ కార్డులు, బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. కేవలం స్నేహితులే కాకుండా బంధువులు కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

⚛ ఇంగ్లండ్‌తో సరిహద్దును పంచుకునే ‘వేల్స్‌’ దేశంలో వేలంటైన్స్‌ డేను పూర్తి విభిన్నంగా జరుపుకొంటారు. ఇక్కడ ప్రేమికుల దినోత్సవాన్ని జనవరి 25న ‘డే ఆఫ్‌ సాన్‌ డ్వైన్‌వెన్‌’ పేరుతో సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈరోజు చెక్కతో తయారు చేసిన విభిన్న ఆకారాల్లో ఉండే స్పూన్స్‌ను ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రత్యేకించి హృదయాకృతిలో ఉండే స్పూన్స్‌ను తమ మనసులోని ప్రేమను తెలియజేయడానికి ఇస్తుంటారు. ఇక్కడ ఈ ఆచారాన్ని 16వ శతాబ్దం నుంచి కొనసాగిస్తున్నారు.

⚛ మధ్య యూరప్‌లో ఉండే చెక్‌ రిపబ్లిక్‌ దేశంలో ప్రేమికుల దినోత్సవాన్ని మే 1న జరుపుకొంటారు. ఈరోజు ప్రేమికులంతా ఆ దేశానికి చెందిన ప్రముఖ కవి కరేల్‌ హైనెక్‌ మచా విగ్రహం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఉండే చెర్రీ చెట్ల కింద తమ ప్రేయసిని/ప్రియుడిని ప్రేమతో ముద్దాడతారు. ఇలా చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని వారి నమ్మకం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి