Digital Marketing: ఉద్యోగం.. వ్యాపారం.. రెంటికీ ఈ నైపుణ్యాలు!

ఆన్‌లైన్ అనేది జీవితంలో భాగమైపోయింది. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ఉండే ఆన్‌లైన్లోనే చాలా పనులను పూర్తి చేస్తున్నారు. కూరగాయల దగ్గర్నుంచి వేసుకునే బట్టలు, ఉపయోగించే వస్తువులు అన్నీ ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. ఆఖరికి మందులు కూడా......

Published : 27 Jun 2022 18:02 IST

ఆన్‌లైన్ అనేది జీవితంలో భాగమైపోయింది. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో ఉండే ఆన్‌లైన్లోనే చాలా పనులను పూర్తి చేస్తున్నారు. కూరగాయల దగ్గర్నుంచి వేసుకునే బట్టలు, ఉపయోగించే వస్తువులు అన్నీ ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. ఆఖరికి మందులు కూడా ఆన్‌లైన్‌లోనే కొంటున్నారు. దీనికి తగ్గట్టుగానే వ్యాపారులు కొత్త పోకడలను అనుసరిస్తున్నారు. వారి ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ‘డిజిటల్‌ మార్కెటింగ్‌’ని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది మహిళలు సైతం ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. కొంతమంది ఇందులోని ఉపాధి అవకాశాలను వెతుక్కొంటుంటే.. మరికొంతమంది వ్యాపారవేత్తలుగా మారి తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ‘డిజిటల్ మార్కెటింగ్‌’ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ‘డిజిటల్‌ మార్కెటింగ్‌’కు కావాల్సిన కొన్ని నైపుణ్యాల గురించి తెలుసుకుందామా...

సామాజిక మాధ్యమాల్లో...

మన దేశంలో ప్రతి ఒక్కరూ సగటున రెండున్నర గంటల పాటు సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అందుకే వ్యాపారం చేసేవారు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వీటికి సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవాలి. అయితే సామాజిక మాధ్యమాల్లో నిత్యం వేల పోస్టులు వస్తుంటాయి. కాబట్టి పోస్టులు వినూత్నంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు వచ్చే కొత్త పద్ధతులను తెలుసుకోవాలి. సామాజిక మాధ్యమాలపై పట్టున్న వారిని కొన్ని సంస్థలు ఉద్యోగులుగానూ నియమించుకుంటున్నాయి.

కంటెంట్ కొత్తగా ఉందా?

డిజిటల్ మార్కెటింగ్‌లో వెబ్‌సెట్లు ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. అందుకే వ్యాపారం చేసేవారిలో చాలామంది తమ ఉత్పత్తులకు సంబంధించి రకరకాల వెబ్‌సైట్లను రూపొందించుకుంటున్నారు. అయితే ఈ వెబ్‌సైట్లు జన బాహుళ్యంలో ప్రాచుర్యం పొందాలంటే దానికి కంటెంట్‌ ప్రధానం. కాబట్టి, వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని వినూత్నంగా రూపొందించుకోవాలి. ఆన్‌లైన్‌లో ఎంతో సమాచారం ఉంటుంది. అందులో ఉత్పత్తులు ఎక్కువమంది వినియోగదారులకు చేరాలంటే ఆ సమాచారం నాణ్యమైనదిగా ఉండడంతో పాటు వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉండాలి.

మీ సమాచారమే కనిపిస్తోందా?

ఎలాంటి సమాచారం కావాలన్నా ముందుగా గూగుల్‌ని ఆశ్రయిస్తుంటారు. ఒక్క పదంతో గూగుల్‌ చేయగానే లక్షల కొద్దీ పేజీలు దర్శనమిస్తుంటాయి. వ్యాపారంలో నెగ్గుకురావాలంటే ఇందులో మొదటి పేజీల్లో మీ వ్యాపారానికి సంబంధించిన ఉత్పత్తుల సమాచారం వచ్చేలాగా చూసుకోవాలి. ఇందుకోసం సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్ (ఎస్‌ఈవో) ఎంతో ఉపయోగపడుతుంది. మీ ఉత్పత్తికి సంబంధించిన కీలకమైన పదాలను దానికి సంబంధించిన సమాచారంలో ఒక క్రమ పద్ధతిలో పేర్కొనడం ద్వారా దీనిని ఉపయోగించుకోవచ్చు. డిజిటల్‌ మార్కెటింగ్‌లో సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. కాబట్టి, దీనికి సంబంధించిన నైపుణ్యాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.

వీడియో, ఆడియోల ద్వారా...

ఆన్‌లైన్‌ అంటే కేవలం కంటెంట్‌ మాత్రమే కాదు.. ఆడియో, వీడియోలు కూడా ఉంటాయి. యూట్యూబ్‌ వంటి వీడియో మాధ్యమాలే కాకుండా ఇన్‌స్టాగ్రామ్, వంటి సామాజిక మాధ్యమాల్లో సైతం షార్ట్‌ వీడియోలకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. అలాగే కొన్ని మ్యూజిక్‌ యాప్స్‌ని కూడా చాలామంది వినియోగిస్తుంటారు. కాబట్టి, వీటిల్లో ఆడియో, వీడియో ద్వారా మార్కెటింగ్‌ చేస్తే ఎంతోమంది వినియోగదారులను సొంతం చేసుకోవచ్చు. వీటిల్లో నైపుణ్యాలను సాధించడం ద్వారా బిజినెస్‌లో మెరుగ్గా రాణించవచ్చు.

మొబైల్‌తో...

చాలామంది ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లతోనే గడుపుతుంటారు. కాబట్టి, మొబైల్‌ మార్కెటింగ్‌ ద్వారా వినియోగదారులను నేరుగా ఆకర్షించవచ్చు. ఈ క్రమంలో ఎస్‌ఎంఎస్‌ మార్కెటింగ్, ఇన్‌-యాప్‌ మార్కెటింగ్ మొదలైనవి కీలక పాత్ర పోషిస్తుంటాయి. కాబట్టి, వీటికి సంబంధించిన నైపుణ్యాలు కూడా డిజిటల్‌ మార్కెటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్