Published : 01/02/2023 20:40 IST

చేతులు కోమలంగా.. ఇలా..!

ఇంటి పని, వంట పని, గిన్నెలు తోమడం, బట్టలుతకడం.. వంటి రోజువారీ పనుల కారణంగా పదే పదే చేతులు నీళ్లలో నాని మరింత పొడిగా తయారవుతాయి. ఫలితంగా దురద, మంట పుట్టడం, అలర్జీలు.. వంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. మరి, వీటి నుంచి బయటపడాలంటే ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో స్క్రబ్స్ తయారుచేసుకొని వాడితే ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, చేతుల్ని తేమగా, కోమలంగా మార్చే ఆ న్యాచురల్ స్క్రబ్స్ ఏంటో తెలుసుకొని, మనమూ ట్రై చేసేద్దామా..!

ఓట్‌మీల్‌ పొడితో...

టేబుల్‌స్పూన్‌ ఓట్‌మీల్‌ పొడి, అర టేబుల్‌స్పూన్‌ కొబ్బరి నూనె.. ఈ రెండింటినీ బాగా కలుపుకొని చేతులు, మణికట్టుపై మాస్క్‌లా అప్లై చేసుకోవాలి. పావు గంట పాటు అలాగే ఉంచుకొని ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఓట్‌మీల్‌ చర్మానికి తేమనందించి కోమలంగా మార్చుతుంది. ఈ ప్యాక్‌ను రోజూ ప్రయత్నించవచ్చు.

ఓట్‌మీల్‌ పొడిని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక టొమాటోను మధ్యలోకి రెండు ముక్కలు చేసి.. ఒక ముక్కను ఓట్‌మీల్‌ పొడిలో అద్దాలి. దాంతో ఒక చేతిపై, మణికట్టుపై పదిహేను నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆపై మరో టొమాటో ముక్కను ఇంతకుముందులాగే ఓట్‌మీల్‌ పొడిలో ముంచి మరో చేతిపై రుద్దుకోవాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి.

రెండు టేబుల్‌స్పూన్ల చక్కెరలో ఐదారు చుక్కల విటమిన్‌ ‘ఇ’ నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని చేతులు, మణికట్టుపై అప్లై చేసి రెండు నిమిషాల పాటు మృదువుగా రుద్దుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. విటమిన్‌ ‘ఇ’ డ్యామేజ్‌ అయిన చర్మాన్ని రిపేర్‌ చేసి తిరిగి ప్రకాశవంతంగా మార్చుతుంది.

టేబుల్‌స్పూన్‌ కొబ్బరి నూనె, టేబుల్‌స్పూన్‌ తేనె, పావు కప్పు చక్కెర, పావు కప్పు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం.. వీటన్నింటినీ ఒక గిన్నెలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన స్క్రబ్‌ని గాలి చొరబడని జార్‌లో నిల్వ చేసుకోవచ్చు. రోజూ కొద్దిగా ఈ స్క్రబ్‌ మిశ్రమాన్ని తీసుకొని చేతులకు, మణికట్టుపై నిమిషం పాటు రుద్దుకొని, గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

ఇంట్లో లభించే పండ్లతోనే అప్పటికప్పుడు స్క్రబ్స్‌ తయారుచేసుకొని ఉపయోగించచ్చు. ఉదాహరణకు ఇంట్లో ఉండే అరటిపండ్ల ముక్కలు, మామిడి పండు ముక్కలు లేదంటే దాని తొక్కను కూడా ఉపయోగించచ్చు. ఇలా వీటిని చక్కెరలో అద్ది.. దాంతో చేతుల్ని స్క్రబ్‌ చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని