Published : 27/01/2023 20:38 IST

‘స్పా’ నూనెను ఇంట్లోనే తయారుచేద్దాం!

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి స్పా చేయించుకోవడం సహజమే. అయితే ఇందుకోసం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి స్పా సెంటర్లకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోనే.. అదీ మన స్వహస్తాలతో తయారుచేసిన నూనెతోనే శరీరాన్ని మర్దన చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ స్పా కోసం వాడే Infused Oilsని ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం రండి..

ఔషధ గుణాలు కలిగిన పూలు/ఆకులను మన శరీరతత్వానికి సరిపోయే నూనెలో కొంత కాలం పాటు నానబెట్టి ఉంచడం వల్ల.. నూనెలు ఆ పూలు లేదా ఆకులలోని సారాన్ని, వాటి సహజ పరిమళాన్ని, ఔషధ గుణాలని శోషించుకుంటాయి. ఇలాంటి నూనెలను ‘ఇన్‌ఫ్యూజ్‌డ్ ఆయిల్స్’ అంటారు.

కావాల్సినవి

బంతి పూలు, గులాబీలు, మల్లె పూలు, జాజి పూలు, లావెండర్.. వీటిలో మీకు నచ్చిన పూలు లేదా ఎండబెట్టిన పుదీనా, తులసి వంటి ఆకుల్ని తీసుకోవాలి. ఇవి శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం.

శుద్ధి చేయని సన్‌ఫ్లవర్ నూనె, ఆలివ్ నూనె, జొజోబా నూనె.. శుద్ధమైన కొబ్బరి నూనెలలో ఏదైనా ఒక నూనెను ఎంచుకోవాలి.

శుభ్రమైన గాజు జార్

వెడల్పాటి గిన్నెలో సగానికి నీరు నింపాలి.

తయారీ

ఎండిన బంతిపూలని (లేదా మరేవైనా పూలు లేక ఆకులను) శుభ్రమైన జార్‌లో సగం వరకు నింపాలి.

ఇప్పుడు మీరు ఎంచుకున్న నూనెను ఎండిన పూలు పూర్తిగా మునిగేలా, ఒక అంగుళం ఖాళీ ఉంచి గాజు జార్‌లో నింపాలి.

మూత గట్టిగా బిగించి జార్‌ని బాగా షేక్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ఇన్‌ఫ్యూజ్ చేయడానికి (శోషింపజేయడానికి) మూడు పద్ధతులు ఉన్నాయి.

1. ఈ గ్లాస్ జార్‌ను నాలుగు వారాల పాటు చీకటి ప్రాంతంలో ఉంచి ప్రతి రెండు రోజులకు ఒకసారి బాగా కలుపుతుండాలి. ఆపై నాలుగు వారాల తర్వాత నూనెను వడకట్టి వాడుకోవాలి.

2. ఈ గ్లాస్ జార్‌ను నాలుగు వారాల పాటు ప్రతిరోజూ ఎండలో ఉంచాలి. నాలుగు వారాలు పూర్తయిన తర్వాత నూనెను వడకట్టి ఉపయోగించాలి.

3. ఒక వెడల్పాటి గిన్నెలో నీటిని మరిగించి, అందులో ఈ మిశ్రమం కలిగిన జార్‌ని ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. చల్లారిన తర్వాత 24 గంటల పాటు ఉంచి తర్వాత వడగట్టి వాడుకోవాలి.

 నూనె వడకట్టిన తర్వాత మిగిలిన పిప్పిని మాయిశ్చరైజింగ్ స్క్రబ్‌గానూ ఉపయోగించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని