తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా?
భోజనం చేసిన వెంటనే ఓ కప్పు కాఫీ/టీ తాగడం.. నిద్ర పోవడం.. ఇలాంటి అలవాట్లు ఎంతోమందికి ఉంటాయి. మీరూ అంతేనా? అయితే ఈ అలవాట్లను ఎంత త్వరగా మానుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు నిపుణులు.
భోజనం చేసిన వెంటనే ఓ కప్పు కాఫీ/టీ తాగడం.. నిద్ర పోవడం.. ఇలాంటి అలవాట్లు ఎంతోమందికి ఉంటాయి. మీరూ అంతేనా? అయితే ఈ అలవాట్లను ఎంత త్వరగా మానుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు నిపుణులు. తెలిసో, తెలియకో చాలామంది చేసే ఈ పొరపాట్ల కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, తద్వారా కొంతమందిలో లేనిపోని అనారోగ్యాలకు ఇది దారి తీస్తుందని అంటున్నారు. మరైతే భోజనం చేసిన వెంటనే చేయకూడని ఆ పనులేంటో మనమూ తెలుసుకుందాం రండి..
స్నానం చేస్తున్నారా?
తిన్న వెంటనే స్నానం చేయడం కొంతమందికి అలవాటు. అలాంటి వారు ఈ అలవాటును మానుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి, పొట్టకు సరైన మొత్తంలో రక్తప్రసరణ అవసరం. అయితే స్నానం వల్ల ఆ రక్తం చర్మం వైపు ప్రసరించి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అందుకే భోంచేశాక 30 లేదా 40 నిమిషాల తర్వాతే షవర్ చేయమంటున్నారు.
గంట తర్వాతే ఇవి!
భోజనం చేసిన వెంటనే కొంతమందికి టీ/కాఫీ తాగే అలవాటుంటుంది. అయితే దీనివల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, ఐరన్.. వంటివి గ్రహించే శక్తి శరీరానికి క్రమంగా తగ్గుతుందని చెబుతోంది ఓ అధ్యయనం. ఇందుకు వీటిలోని ఫినోలిక్ సమ్మేళనాలే కారణమట! కాబట్టి తిన్న వెంటనే కాకుండా గంటయ్యాక అదీ తక్కువ మోతాదులో తాగితే ఎలాంటి సమస్యా ఉండదట!
ఇక తిన్న వెంటనే గడగడా నీళ్లు తాగేసే వారూ లేకపోలేదు. ఇలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి పొట్టలో ఉత్పత్తయ్యే ఎంజైమ్స్, జీర్ణ రసాలు.. తక్కువగా విడుదలవుతాయట! ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.. కాబట్టి భోజనం చేసిన వెంటనే కాకుండా గంటయ్యాక ఓ గ్లాసు నీళ్లు తాగమంటున్నారు నిపుణులు.
పండ్లు అప్పుడైతే మరీ మంచిదట!
తిన్న వెంటనే ఏదో ఒక పండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతుంటారు. ఇది నిజమే అయినా భోంచేశాక తీసుకునే కంటే అల్పాహార సమయంలో/పరగడుపున తీసుకున్నట్లయితే వాటిలోని పోషకాలను శరీరం మరింత సమర్థంగా గ్రహిస్తుందని చెబుతున్నారు మరికొంతమంది నిపుణులు. ఒకవేళ భోజనం తర్వాత తీసుకుంటే ఇతర పదార్థాలతో అది కలిసిపోయి వాటిలోని సంపూర్ణ పోషకాలు శరీరానికి అందవన్నది వారి అభిప్రాయం! కాబట్టి పండు తినాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌గా, మిడ్‌మీల్‌గా (అల్పాహారం, లంచ్‌కి మధ్యలో), అదీ కాదంటే సాయంత్రం స్నాక్‌గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
అయితే ఒక్కొక్కరి ఆరోగ్య స్థితి, శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది.. కాబట్టి ఈ సమస్యలన్నీ అందరిలో తలెత్తాలని లేదు. అందుకే ఈ అలవాట్ల కారణంగా మీ ఆరోగ్యంలో ఏదైనా అసౌకర్యం కలిగినట్లనిపిస్తే వెంటనే వాటిని ఆపేసి.. డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదన్నది నిపుణుల అభిప్రాయం!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.