Published : 27/02/2022 14:46 IST

Couple Goals : అతిగా ఆశించకండి!

మేఘనది ప్రేమ వివాహం. తాను కోరుకున్న లక్షణాలున్న వాడే భర్తగా లభించడంతో అమితానందంతో ఉందామె. అయితే తను నోరు తెరిచి అడిగితే తప్ప.. తన భర్త తన మనసు తెలుసుకొని మసలుకోడన్నది ఆమెకున్న అసంతృప్తి.

పొగడ్తలంటే మాలతికి చాలా ఇష్టం. ప్రతి విషయంలోనూ తన భర్త తనని ప్రశంసించాలని కోరుకుంటుంది. అయితే చాలా విషయాల్లో ఇది వర్కవుట్‌ కాక తనలో తానే మథనపడుతుంటుంది.

ఇలా చాలామంది భార్యలు తమ భర్తలు తమ విషయంలో అలా ఉండాలి, ఇలా చూసుకోవాలి.. ప్రేమంతా తమకే పంచాలి అని కోరుకోవడం సహజం. నిజానికి ఇలాంటి విషయాలన్నీ సిల్లీగా అనిపించినా.. కొన్నిసార్లు బంధానికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉందంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అందుకే భర్త నుంచి అతిగా ఆశించకుండా.. అవసరమైన వాటిపైనే దృష్టి పెట్టాలంటున్నారు. ఇంతకీ, చాలామంది భార్యలు తమ భర్త దగ్గర్నుంచి అతిగా ఆశించే ఆ విషయాలేంటి? అవి అనుబంధంలో మనస్పర్థలకు ఎలా కారణమవుతాయి? రండి.. తెలుసుకుందాం..!

నాకోసం మారచ్చుగా..!

ప్రతి ఒక్కరికీ తమకంటూ కొన్ని అభిరుచులు, అభిప్రాయాలు, అలవాట్లు ఉంటాయి. వీటిలో కొన్ని అవతలి వారికి నచ్చచ్చు.. నచ్చకపోవచ్చు. భార్యాభర్తల్లోనూ ఇది కామన్‌. అయితే కొంతమంది భార్యలు తమ భర్తలో నచ్చని అంశాలను పదే పదే ఎత్తి చూపుతుంటారు. ఉదాహరణకు.. మీ భర్తకు ఎరుపు రంగు అంటే ఇష్టం.. అందుకే తాను ఎంచుకునే దుస్తుల దగ్గర్నుంచి.. ఇంటి కోసం ఎంపిక చేసే వస్తువుల దాకా ఎక్కువగా అదే రంగులో ఉన్న వాటిని కొనుగోలు చేస్తుంటారు.. కానీ అది మీకు నచ్చకపోవచ్చు.. అలాంటప్పుడు తన ఇష్టాన్ని పక్కన పెట్టి.. మీకు నచ్చిన రంగునే ఎంచుకోమనడం, మీకు నచ్చిన పనులే చేయాలని పట్టుబట్టడం వల్ల ఇద్దరి మధ్యా మనస్పర్థలు తప్ప మరే ప్రయోజనం ఉండదు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. నిజంగానే మీ భర్తలో ఏవైనా చెడు అలవాట్లున్నా, ఏదైనా విషయం గురించి తెలిసో తెలియకో తప్పుగా ఆలోచిస్తున్నా.. ఇలాంటప్పుడు ఏది మంచో, ఏది చెడో వాళ్లతో చర్చించి తద్వారా వాళ్లను మార్చుకోవడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. ఇలా ఎవరి ఇష్టాయిష్టాలకు, అభిరుచులకు వాళ్లను వదిలేసి.. భాగస్వామి అభిప్రాయాల్ని గౌరవిస్తే దాంపత్య బంధం మరింత దృఢమవుతుంది. ఈ నియమం భార్యలకే కాదు.. భర్తలకూ వర్తిస్తుంది.

చెప్తే గానీ అర్థం చేసుకోడు!

తమ భర్త అడగకుండానే అన్నీ తేవాలని, తన మనసు తెలుసుకొని మసలుకోవాలని చాలామంది భార్యలు కోరుకోవడం సహజం. ముఖ్యంగా తనకు కావాల్సిన వస్తువులు, ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చే బహుమతులు.. వంటి విషయాల్లో తన మనసులో ఏముందో తెలుసుకొని మరీ తనను సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంటారు. అయితే భార్యగా తన భర్త దగ్గర్నుంచి ఇలా ఆశించడంలో తప్పులేదు.. కానీ ప్రతి పనిలో, ప్రతి సందర్భంలో.. చెప్పకుండానే తన మనసును అర్థం చేసుకోవాలంటే మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రహించకుండా.. ‘చెప్తే గానీ నా మనసులో ఏముందో తెలియదా?’ అంటూ పంతం పట్టుక్కూర్చుంటే జరిగేది గొడవే.. కోల్పోయేది మానసిక ప్రశాంతతే! కాబట్టి కొన్ని సందర్భాల్లో మీ మనసులోని మాటను/కోరికను వాళ్లు అర్థం చేసుకోకపోయినా మీరు చెప్పే ప్రయత్నం చేయండి.. ఈ సర్దుబాటే పోనుపోను ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని పెంచుతుంది.. తద్వారా మీరు చెప్పకుండానే మీ మనసులో ఏముందో మీ భాగస్వామి గ్రహించగలుగుతారు.

ప్రేమంతా నాకే సొంతం!

ఓ భార్యగా మీరు మీ భర్త ప్రేమను కోరుకోవడం, పొందడం తప్పు కాదు. అలాగని ఆయన మరెవరినీ ఆప్యాయంగా పలకరించకూడదని, ఎదుటివాళ్లతో మాట్లాడకూడదని నిబంధనలు పెట్టడం సరికాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ విషయంలో చాలామంది మహిళలు.. ‘నా భర్త నా కంటే వాళ్ల అమ్మానాన్నలనే ఎక్కువగా ప్రేమిస్తాడు.. తన పుట్టింటికే అధిక ప్రాధాన్యమిస్తాడు..’ అంటూ కంప్లైంట్‌ చేయడం చూస్తుంటాం. కానీ తను నిజంగానే అలా చేస్తున్నాడా? లేదంటే ఆయన ప్రేమంతా మీకే సొంతం కావాలన్న అత్యాశ మిమ్మల్ని ఇలా ఆలోచించేలా చేస్తుందా? అన్నది ఎవరికి వారే స్వీయ పరిశీలన చేసుకోవాలంటున్నారు నిపుణులు. తద్వారా నిజంగానే అతను మీకేమైనా లోటు చేస్తున్నట్లయితే దాని గురించి నెమ్మదిగా ఇద్దరూ కలిసి చర్చించుకొని పరిష్కరించుకోవచ్చు. ఇలా ఇద్దరి మధ్య ఉన్న సామరస్య ధోరణి అనుబంధాన్ని మరింత దృఢం చేస్తుంది.

ప్రశంసిస్తే పోయేదేముంది?!

భార్యాభర్తలిద్దరూ ఒకరి ప్రశంసలు/పొగడ్తలు మరొకరు అందుకోవాలని ఆశ పడడం సహజమే! అయితే ఈ విషయంలో భార్యలు నాలుగాకులు ఎక్కువే చదివారని చెప్పాలి. ఎందుకంటే చాలామంది భార్యలు ప్రతి విషయంలో తమ భర్త తమను ప్రశంసించాలని కోరుకుంటారు. అందులోనే బోలెడంత సంతోషాన్ని వెతుక్కుంటారు. అయితే ఒక్కోసారి ఇది వర్కవుట్‌ కాకపోవడంతో భాగస్వామితో వాదనకు దిగడానికీ వెనకాడరు. తద్వారా వాళ్ల ముందు పలుచనవడంతో పాటు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలూ తలెత్తుతాయి. అందుకే ఇంత చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకుండా కొన్నిసార్లు తేలిగ్గా వదిలేయమంటున్నారు నిపుణులు. అవతలి వాళ్ల అభిప్రాయాలతో పనిలేకుండా మీ మాటలు, చేతలు మిమ్మల్ని సంతృప్తి పరుస్తున్నాయా, లేదా అనేది ఆలోచించుకుంటే ఎలాంటి మానసిక ఒత్తిళ్లు దరిచేరవు. తద్వారా దాంపత్య బంధంలోనూ గొడవలకు తావుండదు.

వీటితో పాటు సమయమంతా నాకే కేటాయించాలని, ఎప్పుడూ నన్నే సంతోషపెట్టాలని, నా అంచనాల్ని అందుకోవాలని అనుకునే భార్యలూ లేకపోలేదు. చాలామంది భర్తలు కూడా తమ భార్యల విషయంలో ఇలానే ఎక్కువ అంచనాల్ని పెట్టుకుంటారు. అయితే భార్యైనా, భర్తైనా ఒకరి నుంచి మరొకరు అతిగా ఆశించకుండా, కొన్ని విషయాల్లో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తేనే ఇద్దరి మధ్య గొడవలకు తావుండదనేది నిపుణుల మాట. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయమేంటి? Contactus@vasundhara.net వేదికగా మాతో పంచుకోండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని