Makeup: ఈ షార్ట్‌కట్స్ వద్దు..!
ప్రస్తుతం మేకప్ ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమైపోయింది. అయితే ఈ విషయంలో కొంతమంది కొన్ని షార్ట్‌కట్స్ ఫాలో అయిపోతూ ఉంటారు. మరి, ఇవి మంచివో, కావో తెలుసుకుందాం రండి..
ప్రస్తుతం మేకప్ ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమైపోయింది. అయితే ఈ విషయంలో కొంతమంది కొన్ని షార్ట్‌కట్స్ ఫాలో అయిపోతూ ఉంటారు. మరి, ఇవి మంచివో, కావో తెలుసుకుందాం రండి..
మేకప్‌పై మేకప్ వద్దు..!
ఆఫీస్ పూర్తవగానే మీరు ఒక ఫంక్షన్‌కు వెళ్లాల్సి ఉంది. ఇంటికొచ్చి తయారై వెళ్లే సమయం లేదు. నేరుగా ఆఫీస్ నుంచే ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తే ఏం చేస్తారు? ఉదయం వేసుకున్న మేకప్‌పై నుంచే తిరిగి టచప్ ఇస్తుంటారు చాలామంది. కానీ అదే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే మేకప్ పైన వేసే మేకప్ సరిగా సెట్ అవ్వదు. పైగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. చర్మం బాగా ఎండిపోయినట్లు నిర్జీవంగా మారిపోవడమే కాకుండా మొటిమలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.
సన్‌స్క్రీన్ తప్పనిసరి..!
చాలామంది మేకప్ వేసుకున్నాం కదా.. ఇంక సన్‌స్క్రీన్ అవసరం ఉండదులే అనుకుంటారు. కానీ అది పొరపాటు. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించగలిగేది సన్‌స్క్రీన్ మాత్రమే. సన్‌స్క్రీన్ రాసుకున్న తర్వాత దాని మీద మామూలుగా మేకప్ వేసుకున్నా సెట్ అవుతుంది.
బ్రష్‌లు శుభ్రం చేస్తున్నారా..?
మీరు ఉపయోగించే మేకప్ బ్రష్‌లను శుభ్రం చేసి ఎన్ని రోజులైంది? ఇలా అడుగుతున్నారేంటని అనుకుంటున్నారా? ఎందుకంటే.. తరచూ శుభ్రం చేయని బ్రష్‌లపై బ్యాక్టీరియా చేరుతుంది.. వాటిని తిరిగి ఉపయోగిస్తే లేనిపోని చర్మ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే! అందుకే మేకప్‌కు ఉపయోగించే బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం తప్పనిసరి!
డ్రయర్‌తో తల ఆరబెడుతున్నారా??
పొద్దున్నే లేచి, తలస్నానం చేసే సరికే ఆఫీసు టైం దగ్గరపడుతుంది. ఇక తల ఆరబెట్టుకునే టైం ఎక్కడుంటుంది? అందుకే గబగబా హెయిర్ డ్రయర్‌తో ఆరబెట్టేసి, స్ట్రెయిట్‌నర్‌తో స్ట్రెయిట్ చేసేసి, నచ్చిన హెయిర్ స్త్టెల్ వేసేసుకుంటారు చాలామంది. కానీ దానివల్ల జుట్టు ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది. హెయిర్ డ్రయర్స్, స్ట్రెయిట్‌నర్స్, కర్లర్స్.. ఇవన్నీ ఎక్కువ వేడిని విడుదల చేస్తాయి. ఫలితంగా జుట్టులో ఉండే సహజ నూనెలు ఆవిరైపోతాయి. కాసేపటికే జుట్టు గరుకుగా, నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి తలస్నానం చేసిన తర్వాత జుట్టుని సహజంగా ఆరనిస్తేనే అన్ని విధాలా మంచిది. అలాగే తడిగా ఉన్న జుట్టును కూడా దువ్వకూడదు. ఆరకుండా జడ వేసుకోకూడదు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే జుట్టు ఎక్కువగా రాలిపోతుందని గుర్తుంచుకోండి.
నిద్రపోయే ముందు..
పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లొచ్చి బాగా అలసిపోయారు. ఇక, ఏ పనీ చేసే ఓపిక లేక అలాగే వెళ్లి మంచం ఎక్కేస్తారు. ఇలా చేస్తే మీ చర్మానికి మీరే హాని తలపెట్టినట్లవుతుంది. ఎందుకంటే ముందు మీ ముఖానికి ఉన్న మేకప్‌ను పూర్తిగా తొలగించుకోవాలి. లేదంటే మేకప్ అవశేషాలతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి మృతకణాలు, మొటిమల సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
గడువు తేదీ గమనిస్తున్నారా?
మేకప్ సామగ్రి కొన్న తర్వాత అవి ఎన్ని రోజులు ఇంట్లో అలానే ఉన్నా వాటిని ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ, వీటి గడువు తేదీ కూడా ఎప్పటికప్పుడు గమనించాలంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎక్స్‌పైరీ దాటిన ఉత్పత్తులను ఉపయోగిస్తే అలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువంటున్నారు. కాబట్టి గడువు తేదీని బట్టి ఏడాదికోసారి మేకప్ ఉత్పత్తులు మార్చడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.