Published : 26/02/2023 10:04 IST

ఈ తప్పులు చేస్తే బాస్‌తో తిప్పలే!

సాధారణంగా ఆఫీస్ ఏదైనప్పటికీ చాలా సందర్భాల్లో అందరూ కలిసి కోరస్‌గా తిట్టుకునేది ఒకరి గురించే... ఆ ఒక్కరూ మరెవరో కాదు... బాసే! చాలామంది దృష్టిలో బాస్ అంటే పెద్ద భూతమే. కానీ వారి కోణంలోంచి చూస్తే మనవైపు నుంచి బోలెడన్ని తప్పులు కనిపించవచ్చు. మనల్ని మధ్యమధ్యలో కోప్పడనూవచ్చు. ఇటీవల చాలా సంస్థల్లో అన్-బాస్ సంస్కృతి క్రమంగా పెరుగుతున్నప్పటికీ మన పై అధికారులకు పని విషయంలో మనం జవాబుదారీగా ఉండక తప్పదు. ఈ క్రమంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులను సరిదిద్దుకుంటే వారితో కూడా రిలేషన్ బాగుండడానికి అవకాశం ఉంటుంది.

లేట్‌గా వెడుతున్నారా?

మీరు ఆఫీస్‌కి తరచుగా ఆలస్యంగా వెళ్తున్నారా? ఇలా చేస్తే ఏ బాస్‌కైనా కోపం వస్తుంది. అలా కాకుండా సమయానికి వచ్చి మీపని మీరు పూర్తి చేసుకుని వెళ్లిపోతే ఏ సమస్యా ఉండదు. ఆలస్యంగా రావడం వల్ల మీరెంత బాగా పనిచేసినప్పటికీ మీపై నెగెటివ్ ఇంప్రెషన్ అలాగే ఉండిపోతుంది. పని వాతావరణాన్ని మీరు దెబ్బతీస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మిమ్మల్ని చూసి మిగిలినవాళ్లు కూడా మీలా చేయడం మొదలుపెడతారు. కాబట్టి తప్పు మీవైపే ఉందని తెలుసుకోండి.

ముచ్చట్లు పెడుతుంటే..

ఆఫీస్‌కి రాగానే ముచ్చట్లు పెట్టుకోవడం చాలామందికి మామూలే. నోరు విప్పారంటే చాలు పక్కవారితో అలాగే మాట్లాడేస్తుంటారు. దీని వల్ల పని కాస్తా ఆగిపోతుంది. కంపెనీ ఉద్యోగమిచ్చింది కబుర్లు చెప్పుకోవడం కోసం కాదనే విషయం మనకు తెలిసిందే. మిమ్మల్ని పర్యవేక్షించే బాధ్యతను యాజమాన్యం నమ్మకంతో మీ బాస్‌కి అప్పగించింది. అలాంటప్పుడు పని మానేసి పక్కవారితో ముచ్చట్లు పెడుతుంటే బాస్‌కి కోపం రావడం కామనేగా!

సడన్‌గా సెలవు తీసుకోవడం...

అప్పుడప్పుడూ అనుకోని సంఘటనలు జరిగితే ఓకే. అలాకాకుండా ముందస్తు సమాచారం లేకుండా తరచుగా అప్పటికప్పుడు సెలవు తీసుకుంటే బాస్‌కి కోపం రావడం సహజమే. సడన్‌గా సెలవు తీసుకోవడం వల్ల మీరు పూర్తిచేయాల్సిన పని ఆగిపోతుంది. మీ బాస్‌పై వేరొక బాస్ ఉండవచ్చు. పని కానందుకు వాళ్లకు సమాధానం మీ బాసే చెప్పుకోవాల్సి వస్తుంది. అలా బాస్‌ని ఇబ్బంది పెట్టడం ఉత్తమ ఉద్యోగుల లక్షణం కాదు.

పని సరిగ్గా చేయకపోతే..

అప్పచెప్పిన పనిని సక్రమంగా పూర్తి చేయలేకపోతే ఎవరు మాత్రం హర్షిస్తారు? మీ పని శ్రద్ధగా పూర్తిచేసి, వేరే అసైన్‌మెంట్లు ఏవైనా ఉంటే వాటిని స్వీకరించడానికి మీరు సిద్ధమైనప్పుడే బాస్‌కి మీరంటే ఇష్టం ఏర్పడుతుంది. అలాగే పనికి సంబంధించి మీ ఆలోచనలూ పంచుకోవాలి. ఏవైనా విలువైన సూచనలు ఉంటే చెప్పాలి.

బ్రేక్‌లు, ఫోన్‌లో కబుర్లు!

కొంతమంది ఆఫీస్‌లో చేసే పని తక్కువ. తీసుకునే బ్రేక్‌లు ఎక్కువ. ఇక మరికొంతమందేమో ఫోన్‌లో మాట్లాడడమే మా ఉద్యోగం అన్నట్లుగా ఉంటారు. సీట్లో గట్టిగా గంట కూర్చోవడం వారికి తెలీదు. అలాంటివారిని చూడగానే బాస్‌కి కోపం రాకుండా ఉంటుందని ఎలా అనుకోగలం?

చేసిన తప్పులే మళ్లీమళ్లీ...

అప్పుడప్పుడు పనిలో తప్పులు జరగడం సహజమే. అలాకాకుండా తరచూ తప్పులు జరుగుతున్నాయంటే మనసు పెట్టకుండా పనిచేయడమే దీనికి కారణం. ప్రతిసారీ మీ తప్పులు గుర్తించి సరిచేయడం బాస్‌కి సాధ్యపడకపోవచ్చు. కొన్నిసార్లు అవి అలాగే పై అధికారుల వద్దకు వెళ్లచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీ తప్పుకి కూడా మీ బాసే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరికైనా తప్పు చేసిన వారిపైన కోపం రావడం సహజం. అందుకే సాధ్యమైనంత వరకు మీ ద్వారా పనిలో ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి.

బాధ్యతలు తీసుకోకపోవడం

ఏదైనా పనిని మీకు అప్పగించినప్పుడు దాన్ని మీరు చేయడానికి ముందుకు రాకపోతే బాస్‌కి మీరు దూరమైనట్టే. మీలాగే అందరూ వెనుకంజ వేస్తే ఆ పని అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలోనూ బాస్ కోపంలో అర్థవంతమైన కారణం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని