మీ ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటున్నారు?
స్నేహితులతో ఉన్నప్పుడు చేయకూడని పొరపాట్లేంటో, దానికి మన ఆలోచనల్లో, అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పులేంటో తెలుసుకుందామా..
కొంతమంది చిన్న చిన్న విషయాలకే స్నేహితులతో గొడవలు పడటం.. దాన్ని తెగే దాకా లాగడం.. ఆ తర్వాత అనవసరంగా గొడవ పెట్టుకుని తనకు దూరమయ్యామేమో అని బాధపడటం.. వంటివి చేస్తుంటారు. ఇలాంటి విషయాల్లో తర్వాత బాధపడే కంటే ముందుగానే కాస్త ఆలోచనతో వ్యవహరిస్తే జరిగిపోయిన సంఘటన గురించి పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మరి, అలా స్నేహితులతో ఉన్నప్పుడు చేయకూడని పొరపాట్లేంటో, దానికి మన ఆలోచనల్లో, అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పులేంటో తెలుసుకుందామా..
గొప్పలు పోతున్నారా?
కొంతమంది వారి స్నేహితుల దగ్గర తమ గురించి గొప్పలు చెప్పుకుంటుంటారు. అయితే అది చెప్పే వారికి బాగానే అనిపించినా ఎదుటివారికి మీరు అభద్రతా భావంతో ఉన్నారని తెలుపుతుంది. పదేపదే ఇలా చేయటం వల్ల మీపై మీ స్నేహితులకు నెగెటివ్ అభిప్రాయం ఏర్పడి వారు మీకు క్రమంగా దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అలవాటు మీకు ఉన్నట్లయితే దాన్ని ఎంత త్వరగా తగ్గించుకుంటే మీ స్నేహానికి అంత మంచిది.
పొగరు పనికిరాదు..
స్నేహంలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే తేడా ఉండదు. కానీ కొంతమంది డబ్బు లేదా ఉద్యోగంలో తాము ఎక్కువ అని భావిస్తారు. తమ ప్రాణ స్నేహితులతో కూడా పొగరుగా ప్రవర్తిస్తుంటారు. వారి పట్ల దురుసుగా ప్రవర్తించినా.. 'ఆ.. తనకేంటి నేను క్షమాపణ చెప్పేది.. అనుకొని ఆ విషయాన్ని దాటవేస్తుంటారు. కానీ అటు పక్కవాళ్లు మాత్రం మనసులో ఎంత బాధపడినా మీపై కోపగించుకోకుండా ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి భేషజాలకు తావివ్వకూడదు. ఒకవేళ మీరు తప్పు చేస్తే ఎదుటి వారిని మన్నించమని కోరాలి. దీంతో వారి దగ్గర మీ విలువ పెరగడంతో పాటు స్నేహబంధం కూడా దృఢమవుతుంది.
నాకు నచ్చిందే..!
కొంతమంది వారి స్నేహితులతో ఉన్నా తమ ఇష్టాలకే ప్రాధాన్యమిస్తారు. ఎదుటివారి ఇష్టాయిష్టాల గురించి అస్సలు పట్టించుకోరు. ఇలాంటి ప్రవర్తన వల్ల వారు క్రమంగా విసుగు చెందే అవకాశం ఉంటుంది. ఇది రాన్రాను మీ స్నేహబంధానికి ముప్పు తెచ్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి మీ ఇష్టాయిష్టాలతో పాటు, వారికి నచ్చినవి కూడా తెలుసుకొని, ఒకసారి తను చెప్పినట్లు, మరోసారి మీకు నచ్చినట్టు చేస్తే బాగుంటుంది. అంతేకాదు ఇలా ఇద్దరికీ ఇష్టమైన దాన్ని ఎంచుకుని ముందుకు సాగితే ఇద్దరి మధ్యా స్నేహం మరింత దృఢమవుతుంది.
సహాయం చేసుకోవాలి..
బాధను ఇతరులతో పంచుకుంటేనే ఆ భారం కాస్త తగ్గుతుందంటుంటారు చాలామంది. అయితే దాన్ని పంచుకోవడానికి ముందు వరుసలో నిలిచేది స్నేహితులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొంతమంది మాత్రం వారికి బాధ కలిగించే విషయాలను స్నేహితులతో పంచుకుంటుంటారు. కానీ స్నేహితులు బాధపడుతున్నప్పుడు మాత్రం అస్సలు పట్టించుకోరు. దాంతో మీ స్నేహితులు తమ బాధను పంచుకునే తోడులేక ఒంటరిగా ఫీలవుతారు. ఇది సరైనది కాదు. కాబట్టి మీరు ఎలాగైతే మీ కష్టాలు వారితో చెప్పి మీ గుండె భారాన్ని తగ్గించుకోవాలనుకుంటారో.. అలాగే వారు చెప్పేది కూడా శ్రద్ధగా విని వీలైతే వారికి సహాయపడడం మంచిది.
ఇబ్బంది పెట్టద్దు..
ఎంత స్నేహితులైనా ప్రతి ఒక్కరికీ కొన్ని వ్యక్తిగత విషయాలు, అభిప్రాయాలుండడం సహజం. అయితే అందరూ వాటిని ఫ్రెండ్స్‌తో పంచుకోవాలనుకోరు. కాబట్టి వాళ్ల మనోభావాలను అర్థం చేసుకొని మీరు ప్రవర్తించాలే తప్ప 'చెప్పు.. చెప్పు..' అంటూ వారిని విసిగించకూడదు. నిజంగా మీతో చెప్పాలనుకుంటే మీరు అడగకుండానే వారు చెప్పేస్తారు. అందువల్ల స్నేహితులకు సంబంధించిన ఇలాంటి వ్యక్తిగత విషయాలలో వారిని ఇబ్బంది పెట్టకపోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.