Updated : 03/12/2022 17:58 IST

లైంగిక ఆరోగ్యం.. దాపరికాలు వద్దు!

లైంగిక ఆరోగ్యం గురించి మహిళల్లో ఎన్నో రకాల సందేహాలు, సందిగ్ధాలు. అయినా వాటిని తమలోనే దాచుకుంటారే తప్ప బయటికి చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఒకవేళ సమస్య ఎదురైనా నిపుణుల వద్ద నిజం చెప్పడానికి వెనకాడుతుంటారు. సిగ్గు, బిడియం, ఎవరేమనుకుంటారోనన్న భయమే ఇందుకు ప్రధాన కారణాలు! ఇదిగో ఇలాంటి అబద్ధాలే లైంగిక ఆరోగ్యానికి, సంతానోత్పత్తికి అవరోధాలుగా మారుతున్నాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ ఒక్క అబద్ధమే సమస్యకు సరైన చికిత్స పొందలేక తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే ప్రమాదమూ ఉందంటున్నారు. మరి, ఇంతకీ లైంగిక ఆరోగ్యం విషయంలో మహిళలు డాక్టర్ల వద్ద చెప్పే సాధారణ అబద్ధాలేంటి? వాటి కారణంగా ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో తెలుసుకుందాం రండి..

సురక్షితంగానే కలిశాం!

ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటోన్న అనారోగ్యాల్లో వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు ఒకటి. ఈ క్రమంలో జననేంద్రియాల్లో మంట, దురద, ఎరుపెక్కడం, వైట్‌ డిశ్చార్జ్‌, అసాధారణ రక్తస్రావం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే వీటి విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. సమస్య తీవ్రమైతే చూద్దాంలే అన్న ధోరణీ కొంతమందిలో కనిపిస్తుంటుంది. నిజానికి ఇలాంటి ఇన్ఫెక్షన్లు భాగస్వామి నుంచి సోకే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. తీరా వీటి చికిత్స కోసం వైద్యుల దగ్గరకు వెళ్లినప్పుడు కూడా.. అసురక్షితమైన లైంగిక చర్యలో పాల్గొన్నప్పటికీ ‘కలయిక సమయంలో మేం సురక్షితమైన గర్భనిరోధక పద్ధతుల్నే పాటించాం’ అంటూ అబద్ధం చెప్పేస్తుంటారట. దీనివల్ల సమస్య తీవ్రమై సంతానోత్పత్తి సమస్యలు, రోగనిరోధక శక్తి దెబ్బతిని ఇతర అనారోగ్యాలూ చుట్టుముడతాయి. అదే వైద్యుల దగ్గర నిజం చెప్పి సరైన సమయంలో సరైన చికిత్స పొందితే ఇలాంటి వ్యాధుల్ని సులభంగా నయం చేయచ్చంటున్నారు నిపుణులు.

మాత్రలు వేసుకున్నా గర్భం వచ్చింది!

అప్పుడే పిల్లలు వద్దనుకున్న దంపతుల కోసం ప్రస్తుతం ఎన్నో గర్భనిరోధక సాధనాలు/పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. గర్భనిరోధక మాత్రలు కూడా అందులో ఒకటి. నిపుణుల సలహా మేరకు వీటిని సరైన సమయంలో వాడితే అవాంఛిత గర్భం రాకుండా ఆపచ్చు. కానీ కొంతమంది మహిళలు సమయానికి వీటిని వేసుకోవడం మర్చిపోయి తీరా గర్భం వచ్చాక అబార్షన్‌ కోసం డాక్టర్‌ దగ్గరికి పరుగు పెడుతుంటారు. ఈ క్రమంలో చాలామంది చెప్పే అబద్ధం ఏంటంటే.. ‘మేం కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ వేసుకున్నాం.. అయినా గర్భం వచ్చింది’ అని! నిజానికి ఈ మాత్రలు వాడితే గర్భం వచ్చే అవకాశం ఒకే ఒక్క శాతం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి ఇక్కడ మీరు అబద్ధం చెబుతున్నారని మీ వైద్యులకు అర్థమైపోతుంది. అయితే అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే క్రమంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో అనారోగ్యాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే మీరు ముందే అసలు నిజం చెప్పేస్తే చికిత్స సులభమవుతుంది.. అన్ని విధాలా వైద్యులు మీకు అండగా నిలబడే అవకాశం దొరుకుతుంది.

అబ్బే.. అలాంటిదేమీ లేదు!

కలయికలో పాల్గొనేటప్పుడు కొంతమందిలో విపరీతమైన నొప్పి రావడం, మంట, రక్తస్రావం కావడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. దీనివల్ల లైంగిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ఫలితంగా దీని ప్రభావం శరీరం, మనసు.. రెండింటిపై పడుతుంది. అయితే అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకొనే క్రమంలో డాక్టర్‌ని సంప్రదించినప్పుడు.. తమలో కనిపించే లక్షణాలను దాచిపెట్టి.. మా లైంగిక జీవితం బాగానే సాగుతోందంటూ అబద్ధం చెబుతుంటారు. దీనివల్ల చికిత్స ఆలస్యమవుతుంది.. సమస్యా తీవ్రమవుతుంది. అదే ముందే నిజం చెప్పి సరైన చికిత్స తీసుకుంటే తదనంతర సమస్యలేవీ ఉండవు.

పెళ్లికి ముందే కలయికా?

అవాంఛిత గర్భధారణ, టీన్‌ ప్రెగ్నెన్సీ, పదే పదే అబార్షన్లు చేయించుకోవడం, సుఖ వ్యాధులు, లైంగిక సంక్రమణ వ్యాధులు.. ఇలాంటివన్నీ డాక్టర్ల వద్ద దాచిపెడుతుంటారు చాలామంది మహిళలు. ఫలితంగా ఇవి తీవ్ర సంతానోత్పత్తి సమస్యలకు దారితీసి పిల్లలు కావాలనుకున్నప్పుడు ప్రతికూలతలుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వీటి గురించి, వీటివల్ల శారీరకంగా, మానసికంగా మీరు ఎదుర్కొనే సమస్యల గురించి డాక్టర్లతో ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అలాగే పెళ్లికి ముందు కలయికలో పాల్గొనడం, ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధం కలిగి ఉండడం వంటి విషయాల గురించి కూడా వైద్యులతో నిర్మొహమాటంగా చెప్పాలి. తద్వారా ఇతరుల నుంచి మీకు లైంగిక సంక్రమణ వ్యాధులు, ఇతర సుఖ వ్యాధులేమైనా సంక్రమించాయేమో వైద్యులు పరీక్షలు చేసి గుర్తిస్తారు. తద్వారా ఆదిలోనే సమస్యను గుర్తించి చికిత్స తీసుకొని వాటి నుంచి బయటపడచ్చు. ఫలితంగా ఆపై లైంగిక జీవితాన్నీ పూర్తిగా ఆస్వాదించచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని