ఈ మార్నింగ్ స్మూతీతో.. ఆరోగ్యంగా..!

ఆరోగ్యంగా ఉండడంలో వ్యాయామాలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో- ప్రత్యేకించి ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం మాత్రమే తీసుకోవాలి.

Published : 29 Jun 2024 21:12 IST

ఆరోగ్యంగా ఉండడంలో వ్యాయామాలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో- ప్రత్యేకించి ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ హెల్దీ స్మూతీ సరిగ్గా ఇలాంటిదే..! దీనిని ఎలా తయారు చేయాలో, దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం రండి..

కావాల్సినవి

⚛ లెట్యూస్‌ (క్యాబేజీని పోలి ఉండే ఒక రకం ఆకుకూర) - అరకప్పు

⚛ పాలకూర - అరకప్పు

⚛ వాము ఆకులు - అరకప్పు

⚛ అవిసె గింజలు - 2 టీస్పూన్లు

⚛ ఒమేగా మీల్‌ మిక్స్‌ (ఆరోగ్యకరమైన గింజలన్నీ కలిపి తీసుకోవాలి) - 2 టేబుల్‌ స్పూన్లు

⚛ సబ్జా గింజలు - 2 టీస్పూన్లు

⚛ అరటిపండు ముక్కలు - అరకప్పు

⚛ కొబ్బరి నీళ్లు - కప్పు

తయారీ

⚛ ముందుగా గింజలన్నింటినీ కొబ్బరి నీళ్లలో 10 నిమిషాల పాటు నానబెట్టాలి.

⚛ ఈ లోపు ఆకుకూరలన్నీ శుభ్రం చేసి పెట్టుకోవాలి.

⚛ ఇప్పుడు మిక్సీ జార్‌ తీసుకొని పై పదార్థాలన్నీ వేసి, అరటిపండు ముక్కల్ని కూడా అందులో వేసేయాలి. దీన్ని స్మూతీలా మిక్సీ పట్టుకోవాలి. కావాలనుకుంటే ఇందులో వైద్యులు సూచించిన ప్రొటీన్‌ పౌడర్ కూడా కలుపుకోవచ్చు.


ఎంతో ఆరోగ్యకరం!

ఈ మార్నింగ్‌ స్మూతీలో ఉపయోగించే పదార్థాలన్నింటిలో బోలెడన్ని పోషక విలువలు దాగున్నాయి.

⚛ ఎక్కువ పోషకాలు, తక్కువ క్యాలరీలు కలిగిన లెట్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్ల శాతం కూడా ఎక్కువే! ‘ఎ’, ‘కె’ విటమిన్లు అధికంగా లభించే ఈ ఆకులు గుండె ఆరోగ్యానికి, బీపీని అదుపులో ఉంచడానికి, బరువు తగ్గడానికి.. ఇలా పలు రకాలుగా దోహదపడతాయి.

⚛ పాలకూర కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందుకు ఈ ఆకుకూరలోని ‘ఎ’, ‘సి’, ‘కె’.. విటమిన్లే కారణం.

⚛ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే వాము ఆకులు జీర్ణశక్తిని పెంచడానికి, వాపును తగ్గించడానికి దోహదం చేస్తాయి.

⚛ అవిసె గింజల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తాయి.

⚛ సబ్జా గింజల్లో అధికంగా ఉండే ప్రొటీన్‌, పీచు పదార్థం బరువు తగ్గడంలో సహకరిస్తాయి.

⚛ గ్యాస్ట్రిక్‌ సమస్యల్ని దూరం చేసి జీర్ణశక్తిని పెంచడంలో అరటిపండుకు మరేదీ సాటి రాదు. అలాగే ఇందులో ఉండే మాంగనీస్ చర్మ ఆరోగ్యానికీ మంచిదే. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో అరటిపండు సహకరిస్తుంది.

⚛ వ్యాయామం వల్ల శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి అందించడంలో కొబ్బరి నీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా చూసుకోవడానికీ ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్