స్కిప్పింగ్ ఎందుకు చేయాలంటే??

శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మీరెప్పుడైనా 'స్కిప్పింగ్' ట్రై చేశారా? ఎందుకంటే దీనివల్ల శరీరంలోని బరువు తగ్గి మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు.

Published : 07 Sep 2021 20:52 IST

శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మీరెప్పుడైనా 'స్కిప్పింగ్' ట్రై చేశారా? ఎందుకంటే దీనివల్ల శరీరంలోని బరువు తగ్గి మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు. అలాగే పొట్ట భాగంలో పేరుకు పోయిన కొవ్వును కూడా ఎలాంటి డైటింగ్ లేకుండా.. స్కిప్పింగ్ చేయడం వల్ల కరిగించవచ్చంటున్నారు నిపుణులు. మరి స్కిప్పింగ్ చేయడం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.

అసలెలా చేయాలి??

స్కిప్పింగ్ ఎలా చేయాలి?? ఆ మాత్రం తెలీదా అనుకుంటున్నారా? తెలిస్తే మంచిదే. కానీ స్కిప్పింగ్ చేయడంలోనూ కొన్ని మెలకువలున్నాయి. ముందుగా మీరు ఉపయోగించే స్కిప్పింగ్ తాడును మీ పాదాలతో అదిమి పట్టుకుని, దాని రెండు అంచులు మీ ఎత్తుకు సమానంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత తాడు చివర్లను చేతులతో పట్టుకుని ఎగురుకుంటూ 'ముందు నుంచి వెనక్కు మళ్లీ ముందుకు..' ఇలా చేయాలి.

ప్రయోజనాలు ఇవీ!

* ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం.. ఇలా మీరు చేసే వ్యాయామంలో స్కిప్పింగ్‌ను కూడా భాగం చేసుకోండి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగిపోయి క్రమంగా నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల చక్కటి ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. ప్రతిరోజూ ఓ గంటపాటు ఈ రకమైన వ్యాయామం చేస్తే 1300 క్యాలరీలు ఖర్చవుతాయి.

* ఈ వ్యాయామం వల్ల భుజాలు తిప్పడం, పాదాలతో ఎగరడం.. వంటి వాటి వల్ల ఆయా భాగాలు దృఢంగా, సులభంగా వంగేలా తయారవడంతో పాటు మిగతా శరీర భాగాల్లో కూడా కదలికలు ఏర్పడతాయి. ఫలితంగా శరీర భాగాలన్నీ సులభంగా వంగేలా తయారవుతాయి.

* తాడాట వల్ల మనం జంపింగ్ కూడా చేస్తాం. కాబట్టి ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల ఒక మైలు పరిగెత్తిన దాంతో సమానమని నిపుణుల అభిప్రాయం.

* దీనివల్ల శరీరంలో ఎముకలు దృఢమవుతాయి. ఫలితంగా ఆస్టియోపొరోసిస్ సమస్యను అరికట్టే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంపై ఉండే ముడతలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది.

* ఈ వ్యాయామం ప్రారంభించిన మొదట్లో కొంతమందిలో కాళ్లు నొప్పులు పుట్టడం, పాదాలు కమిలిపోవడం.. లాంటివి జరుగుతుంటాయి. అలాగని ఆపకూడదు. ప్రతిరోజూ చేయడం వల్ల కొన్ని రోజులకు అలవాటు పడిపోయి.. కాలి కండరాలు, తొడలు దృఢంగా తయారవుతాయి.

* ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల మానసికంగా కూడా దృఢంగా తయారుకావచ్చు. మొదట్లో జంపింగ్ చేయడంలో తడబడినా.. చేస్తూ చేస్తూ ఉంటే మెదడు సరైన విధంగా స్పందించి తాడు కాళ్ల దగ్గరకు వచ్చినప్పుడు యాదృచ్ఛికంగానే జంప్ చేసేస్తాం. ఇది మీరందరూ గమనించే ఉంటారు కదూ! కాబట్టి ఈ వ్యాయామం వల్ల మానసికంగా చాలా చురుగ్గా తయారుకావచ్చు.

* ఈ ఆట వల్ల శరీరంలోని అవయవాల కదలిక, జీవక్రియలు వేగవంతం అవడంతో పాటు అవయవాల మధ్య సమన్వయం పెరుగుతుంది.

* స్కిప్పింగ్ చేసిన తర్వాత శ్వాస తీసుకోవడం వేగవంతం అవుతుంది. దీనివల్ల వూపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ క్రమంలో ఉదరం లోపలికి వెళ్తూ, బయటకు వస్తూ ఉంటుంది. ఫలితంగా అక్కడ ఉండే కొవ్వు కరుగుతుంది.

* స్కిప్పింగ్ చేసిన వెంటనే దాహం వేస్తుందని నీరు తాగడం, ఏదైనా తినడం లాంటివి చేయకూడదు. అరగంట తర్వాత మొలకెత్తిన గింజలు, పండ్లు.. వంటి తేలికగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* స్కిప్పింగ్ కోసం మీరు తీసుకునే తాడు చిన్నదైతే భుజాలు నొప్పులు పుడతాయి. కాబట్టి మీ ఎత్తుకు సరిపోయే తాడును ఎంచుకోవడం మంచిది.

* త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో వేగంగా స్కిప్పింగ్ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల గుండె వేగం, బీపీ పెరుగుతాయి. ఫలితంగా కొన్ని సందర్భాల్లో గుండె పోటు వచ్చే ప్రమాదమూ ఉంది.

* స్కిప్పింగ్ చేసే క్రమంలో నిటారుగా నిల్చుని ప్రశాంతంగా చేయాలి. ఎలాంటి తొందరపాటు అవసరం లేదు. ముందుగా రెండు నిమిషాల పాటు చేసిన తర్వాత కాసేపు కూర్చోండి. దీనివల్ల కాళ్లకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

* స్కిప్ చేసే క్రమంలో నిటారుగా నిల్చుని ప్రశాంతంగా చేయాలి. ఎలాంటి తొందరపాటు అవసరం లేదు. ముందుగా రెండు నిమిషాల పాటు చేసిన తర్వాత కాసేపు కూర్చోండి. దీనివల్ల కాళ్లకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

గుర్తుంచుకోవాల్సినవి..

* గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటుతో బాధపడే వారు ఈ వ్యాయామం చేయకపోవడం మంచిది.

* అలాగే మహిళలు డెలివరీ కోసం లేదా ఏ ఇతర కారణాల వల్లనైనా ఆపరేషన్ చేయించుకుంటే.. వెంటనే ఈ వ్యాయామం చేయడం అస్సలు మంచిది కాదు. కావాలంటే మూడు నెలల తర్వాత డాక్టర్ సలహా మేరకు మాత్రమే దీన్ని తిరిగి ప్రారంభించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్