కలలకు వైకల్యం అడ్డుకాదంటూ..!

డాక్టరు కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంది. అయితే వైకల్యాన్ని కారణంగా చూపించి అర్హత లేదంటూ ఆమెను వెనక్కి పంపేశారు. అలాగని నిరాశతో అక్కడే ఆగిపోలేదామె. ఆయుర్వేదంలోకి అడుగుపెట్టి పలు పరిశోధనలు చేపట్టింది.

Updated : 09 Jul 2024 07:40 IST

డాక్టరు కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంది. అయితే వైకల్యాన్ని కారణంగా చూపించి అర్హత లేదంటూ ఆమెను వెనక్కి పంపేశారు. అలాగని నిరాశతో అక్కడే ఆగిపోలేదామె. ఆయుర్వేదంలోకి అడుగుపెట్టి పలు పరిశోధనలు చేపట్టింది. అవార్డులనూ అందుకుంది. ట్రస్టు స్థాపించి నిరుపేద క్యాన్సర్‌ రోగులకు ఉచిత వైద్యం అందేలా చేస్తోంది. వేదికలపై ప్రసంగిస్తూ తనలాంటివారిలో స్ఫూర్తిని నింపుతున్న డాక్టర్‌ నందా మనోగతమిది.

మాది కేరళలోని కొల్లం. నాన్న ఉద్యోగి. అమ్మ టీచర్‌. మాది మధ్యతరగతి కుటుంబం. నాకు ఆరు నెలల వయసున్నప్పుడు సెరిబ్రల్‌ పాల్సీ సమస్య బయటపడిందట. దీంతో చిన్నప్పటి నుంచి బలహీనంగానే ఉండేదాన్నట. నా వైద్యం కోసం అమ్మానాన్నలు తిరగని ఆసుపత్రి లేదు. నాలుగేళ్లు నిండేసరికి నాకు నడవడమే సమస్య అయ్యింది. దానివల్ల అంత చిన్న వయసులోనే నాకు మూడు నాలుగు సర్జరీలు కూడా చేశారు. నా తర్వాత చెల్లెలు నమిత పుట్టడం నా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే చెల్లితోపాటు నన్నూ ధైర్యంగా స్కూల్‌లో చేర్చారు. నాకన్నా చిన్నదే అయినా, తరగతిలో నమిత నన్ను కంటికి రెప్పలా చూసుకునేది. 

లక్ష్యంతో...

స్కూల్‌లో చదివేటప్పుడు క్రీడేతర పోటీలన్నింటిలో పాల్గొనేలా అమ్మ నన్ను ప్రోత్సహించేది. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పేది. వ్యాసరచన, ప్రసంగం వంటి పోటీల్లో విజేతగా నిలిచేదాన్ని. చదువులోనూ ముందుండేదాన్ని. అయితే మరోవైపు ఏదో ఒక అనారోగ్యంతో తరచూ ఆసుపత్రికి వెళ్లేదాన్ని. అక్కడ నాతోపాటు ఇతర రోగులను చూసినప్పుడు అమ్మ వాళ్ల గురించి చెప్పేది. పేదవాళ్లు కావడంతో కొందరు చికిత్స చేయించుకోలేకపోతున్నారని విన్నాక డాక్టరయ్యి పేదలకు వైద్యసేవలు అందించాలని కలలు కనేదాన్ని. అలా బాల్యం నుంచే డాక్టర్‌ కావాలనే లక్ష్యం ఉండేది. దాంతో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌లో చేరడానికి వెళ్లా. తీరా అడ్మిషన్‌ సమయంలో వైకల్యం ఉందని, అర్హత లేదని నిరాశపరిచారు. నిరుపేదలకు వైద్యసేవలు అందించాలనే నా కల నెరవేరదేమో అనిపించింది. ఉచిత సేవలు అందించాలంటే ఎంబీబీఎస్‌ చదివితేనే... అని కాదు కదా. దాంతో హోమియోపతిని ఎంచుకున్నా. తిరువనంతపురంలోని హోమియోపతి ప్రభుత్వ కాలేజీలో చేరా. చదువుతూనే, అక్కడికొచ్చే రోగులకు నావంతు సేవలు అందించేదాన్ని. కిడ్నీ, లివర్‌ క్యాన్సర్‌తో చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు. చికిత్స చేయించుకునే ఆర్థికస్థోమత లేనివారే ఎక్కువ. అందుకే నా 18వ ఏట ‘పింక్‌ హార్ట్‌ ఛారిటబుల్‌ ట్రస్టు’ స్థాపించాను.

పరిశోధనతో...

కొన్నిసార్లు నా అనారోగ్యం కారణంగా కాలేజీకి వెళ్లలేకపోయేదాన్ని. దాంతో డబ్బు వృథా చేస్తున్నానని, చదువు పూర్తిచేయడం నా వల్ల అవదని హేళన చేసేవారు. అయితే నా కుటుంబం, స్నేహితులు అందించిన చేయూత మరవలేను. పట్టుదలగా చదువు కొనసాగించా. అప్పుడే నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌లో భాగంగా థైరాయిడ్, నెలసరి సమస్యలపై పరిశోధనలూ చేపట్టా. ఈ ఏడాది దుబాయి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఆయుష్‌ కాన్ఫరెన్స్‌లో నా పరిశోధనాపత్రాలపై ప్రసంగించా. నా ప్రసంగానికి ప్రపంచదేశాల నుంచి వచ్చిన వారు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా. జాతీయస్థాయిలో అవార్డూ అందుకున్నా. అలాగే ‘ఈస్ట్రన్‌ భూమిక ఐకానిక్‌ వుమెన్‌’, ‘ప్రజాహిత ఫౌండేషన్‌ యంగ్‌ అచీవర్‌’ వంటి అవార్డులన్నీ గతంలో నాకెదురైన విమర్శలు, హేళనలను దాటి నన్ను నేను నిరూపించుకున్నాను అనిపించేలా చేశాయి. మా ట్రస్టు ద్వారా నిరుపేద రోగులకు ఆర్థిక చేయూత అందేలా చేయగలుగుతున్నా. స్ఫూర్తి ప్రసంగాలతో నాలాంటివారిని ప్రోత్సహిస్తున్నా. ‘ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ యాస్పిరెంట్స్‌ అసోసియేషన్‌’ ప్రారంభించి నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణను ఇప్పిస్తున్నా. లక్ష్యం, పట్టుదలతో విజయం సాధించడంలో నాకు వైకల్యం అడ్డుకాలేదు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్