Published : 13/07/2022 18:07 IST

అందుకే నచ్చిన ఉద్యోగం రాకపోయినా.. ఓకే!

ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. దాన్నే ఉపాధిగా మలచుకుని డబ్బు సంపాదిస్తే.. అదే డ్రీమ్‌ జాబ్‌. కానీ చాలామందికి డ్రీమ్‌ ఒకటుంటే చేసే ఉద్యోగం మరొకటి ఉంటుంది. ఈక్రమంలో జీవితమంతా ఏదో ఉదాసీనతతో ఉంటుంటారు. అయితే నిజంగా ఇలా డ్రీమ్‌ జాబ్‌ దొరక్కపోతే బాధపడాలా ? డ్రీమ్‌ జాబ్‌ సంపాదించిన వారంతా చాలా సంతోషంగా ఉంటున్నారా ? అంటే... చాలావరకు కాదు అనే సమాధానం వస్తుంటుంది. ఎందుకంటే డ్రీమ్‌ జాబ్ సంపాదించినప్పటికీ  కొందరు ఆ ఉద్యోగంలో టార్గెట్స్‌ చేరుకోలేక ఒత్తిడికి గురవుతుంటారు. ఇక డ్రీమ్‌ జాబ్‌ రాకపోయినా ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి పొందుతున్న వారు ఎందరో ఉంటారు. అందుకే మీ జీవితంలో డ్రీమ్‌ జాబ్‌ గురించి ఉండే కొన్ని అపోహలను తొలగించుకోండి అంటున్నారు నిపుణులు.

కోరుకున్న ఉద్యోగం లభించకపోతే ఆనందంగా ఉండలేం..

ఇలా భావించేవాళ్లు ఎంతోమంది కనిపిస్తారు. వాస్తవానికి ఒక్క ఉద్యోగమనే కాదు.. ఏ విషయంలోనైనా సరే.. అనుకున్నది జరగకపోతే బాధగానే ఉంటుంది. అయితే అనుకున్న ప్రతీదీ జరుగుతుందన్న గ్యారంటీ లేదు. అలాంటప్పుడు కోరుకున్న ఉద్యోగం కాకుండా మరో ఉద్యోగం చేస్తున్నందుకు బాధ ఎందుకు? ఇది కాస్త తత్వంతో కూడుకున్నదైనా ఆలోచిస్తే అర్థం ఉందంటున్నారు నిపుణులు. ఇలా బాధపడటానికి ముఖ్య కారణం చిన్నతనం నుంచి ఈ రకమైన అపోహలో ఉండడమేనట. డ్రీమ్‌ జాబ్‌ అయినా.. మరేదైనా.. సంతోషమనేది వచ్చిన దానిని స్వీకరించే తత్వాన్ని బట్టి ఉంటుంది కానీ, పోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వచ్చేది కాదంటున్నారు. మరి ఇకనుంచైనా ఈ అపోహను వీడతారు కదూ!

డ్రీమ్‌ జాబ్ లభిస్తే కష్టపడి పని చేయక్కర్లేదు!

ఇది కోరుకున్న ఉద్యోగం లభించిన కొంతమందిలో ఉండే అపోహ. అసలు ఈ లోకంలో కష్టమనేది లేకుండా ఏ పని జరుగుతుంది చెప్పండి! కలలు కనే ఉద్యోగం లభించగానే కలిగే ఉత్సాహం నుంచి ఈ అపోహ పుట్టుకొస్తుందంటున్నారు నిపుణులు. ‘డ్రీమ్‌ జాబ్‌ వస్తే కష్టపడనక్కర్లేదు’ అనే వారిని కొంత కాలం తర్వాత ఉద్యోగం ఎలా ఉంది? అనే ప్రశ్న అడిగితే, మళ్లీ వచ్చే సమాధానం వేరుగా ఉంటుందట. ఎంత ఇష్టపడి చేసే ఉద్యోగం అయినా తోటి కొలీగ్స్‌తో పోటీ పడకపోతే ఉన్నతి సాధ్యం కాదు. అలాంటప్పుడు వారి కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. కొత్త కొత్త అప్‌డేట్స్‌ కోసం పరితపించాల్సి ఉంటుంది. గతంలో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. మరిదంతా కష్టపడకుండా జరుగుతుందా ?అందుకే ఇది కేవలం అపోహ మాత్రమే.

ఉద్యోగాలు మారక్కర్లేదు..

ఇది కూడా అపోహే అంటున్నారు నిపుణులు. జీవితంలో ఎవరైనా కూడా ఒక సంస్థలో సుదీర్ఘకాలం పాటు పని చేయవచ్చేమో కానీ ఒకే సంస్థలో జీవితాంతం పనిచేయడం సాధారణంగా జరగదు. అలాంటప్పుడు కోరుకున్న ఉద్యోగం లభించినా ఎప్పటికీ అక్కడే పనిచేయడం సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది విషయంలో ఏవైనా మినహాయింపులు ఉంటే ఉండచ్చు కానీ, అందరి విషయంలోనూ, అన్ని సందర్భాలలోనూ ఇది సాధ్యం కాకపోవచ్చంటున్నారు నిపుణులు.

చూశారుగా... కోరుకున్న ఉద్యోగం దొరికితే ఆనందంగా ఉండచ్చేమో కానీ.. అంతమాత్రాన అసలు కష్టపడకుండా, పని చేయకుండానే అందులో ఉన్నతిని సాధిస్తామని మాత్రం కాదు. ఎక్కడైనా సరే ‘కష్టే ఫలి’ అన్నదే నిజం! కాబట్టి ఒకవేళ ‘డ్రీమ్‌ జాబ్’ దొరక్కపోయినా దాని గురించి బాధపడకుండా, దొరికిన ఉద్యోగంలోనే కష్టపడి మరింత పైకెళ్లడానికి కృషి చేయాలి.. ఏమంటారు?


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని