‘మీ చిట్కాల వల్లే ఆ యాక్సిడెంట్ నుంచి బతికి బయటపడ్డా..’ అని చెప్పాడు!

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తృటిలో ఎలా స్పందించాలో, బాధితులకు ఎలా సహాయపడాలో ఒక్కోసారి అర్థం కాదు.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినా.. అది వచ్చే లోపు జరగరాని నష్టం జరిగిపోవచ్చు.. బాధితుల శరీరం నుంచి అధిక రక్తస్రావం కావచ్చు..

Updated : 03 Jun 2024 16:13 IST

(Photos: Facebook)

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తృటిలో ఎలా స్పందించాలో, బాధితులకు ఎలా సహాయపడాలో ఒక్కోసారి అర్థం కాదు.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినా.. అది వచ్చే లోపు జరగరాని నష్టం జరిగిపోవచ్చు.. బాధితుల శరీరం నుంచి అధిక రక్తస్రావం కావచ్చు.. ఇది ప్రాణాలకే ప్రమాదం! దీన్ని నివారించాలంటే.. సకాలంలో స్పందించడంతో పాటు వారిని సరైన పద్ధతిలో ఆస్పత్రికి తరలించడం కూడా ముఖ్యమేనంటున్నారు డాక్టర్‌ మాయా టాండన్‌. అప్పుడే వారి ప్రాణాలు కాపాడచ్చంటున్నారు. తన వైద్య కెరీర్‌లో భాగంగా మత్తు వైద్య నిపుణురాలిగా సేవలందించిన ఆమె.. పదవీ విరమణ పొందినప్పట్నుంచీ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ స్వచ్ఛంద సంస్థనే నెలకొల్పారు. ఈ వేదికగా లక్షలాది మందికి రోడ్డు ప్రమాద పాఠాలు నేర్పుతూ.. ఎంతోమందికి ప్రాణ దానం చేశారు. ‘ఒకరి ప్రాణం నిలపడంలో ఉన్న సంతోషం, సంతృప్తి మరెందులోనూ దొరకదం’టోన్న మాయ.. తన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా అందుకున్నారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పుట్టిపెరిగారు మాయ. ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా ఆమె మనసులో ఎప్పుడూ సమాజ సేవ చేయాలన్న ఆలోచనే ఉండేది. ఆమె తల్లిదండ్రులు కూడా మాయ ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిచ్చి ఆమెను ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే వైద్య వృత్తిని ఎంచుకోవాలనుకున్న ఆమె.. ఇంటర్‌ పూర్తయ్యాక అజ్మీర్‌ మెడికల్‌ స్కూల్‌లో సీటు సంపాదించారు.

లెక్చరర్‌గా మొదలుపెట్టి..!

‘అజ్మీర్‌ మెడికల్‌ స్కూల్‌లో చదువుకునే సమయంలోనే నాకు వివాహమైంది. ఆపై నా భర్తతో కలిసి జైపూర్‌లో స్థిరపడ్డాం. మెడిసిన్‌ పూర్తయ్యే లోపు మాకు బాబు పుట్టాడు. ఆపై అనస్థీషియాలజీలో డిప్లమా చేశా. ఓవైపు ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే.. మరోవైపు కోర్సు పూర్తి చేశా. ఆలోపే మరో బిడ్డకు తల్లినయ్యా. చదువు పూర్తయ్యాక ఇక్కడే ఓ మెడికల్‌ కాలేజీలో అనస్థీషియా లెక్చరర్‌గా కొన్నాళ్లు పనిచేశాను. ఈ సమయంలోనే లండన్‌లో పిడియాట్రిక్‌ అనస్థీషియా కోర్సు చేసేందుకు ఫెలోషిప్‌ లభించింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మద్దతుతో అదీ పూర్తి చేశా. ఇండియాకు తిరిగొచ్చాక జైపూర్‌లోని ‘సవాయ్‌ మాన్‌ సింగ్‌ ఆస్పత్రి’లో మత్తు వైద్య నిపుణురాలిగా చేరాను. ఆపై సూపరింటెండెంట్‌, అనస్థీషియా విభాగానికి హెడ్‌గా పనిచేసి.. 1985లో పదవీ విరమణ పొందాను..’ అంటూ తన కెరీర్‌ బాధ్యతల గురించి చెప్పుకొచ్చారు మాయ.

అలా నా ఆశయం నెరవేరింది!

పదవీ విరమణకు దగ్గరగా ఉన్న సమయంలోనే ‘రోడ్డు భద్రత’పై అవగాహన కల్పించాలంటూ రాజస్థాన్‌ పోలీస్‌ అకాడమీ నుంచి పిలుపు అందుకున్నారు మాయ. అయితే పదవీ విరమణ తర్వాత తన కెరీర్‌ను ఇదే మలుపు తిప్పిందంటున్నారామె.

‘రాజస్థాన్‌ పోలీస్‌ అకాడమీ పిలుపు మేరకు ‘రోడ్డు భద్రత – ప్రాణ రక్ష’ అనే అంశంపై మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అయితే నాకు చిన్న వయసు నుంచే సమాజ సేవ చేయాలన్న సంకల్పం ఉండేది. పదవీ విరమణ తర్వాత ఈ దిశగా ఎలా అడుగు ముందుకేయాలా అని ఆలోచిస్తుండేదాన్ని. ఈ అవగాహన కార్యక్రమమే నాకు మార్గనిర్దేశనం చేసింది. ఈ ప్రోగ్రామ్‌ సక్సెసయ్యాక జైపూర్‌లోనే మరో అవగాహన కార్యక్రమంలో పాల్గొని రోడ్డు ప్రమాదాలపై పాఠాలు చెప్పా.

అయితే ఈ ప్రోగ్రామ్‌లో నా ఫొటోలు తీసిన ఓ ఫొటోగ్రాఫర్‌ కొన్ని నెలల తర్వాత నాకు ఫోన్‌ చేశాడు. ‘ఆ రోజు ఆ అవగాహన కార్యక్రమంలో మీరిచ్చిన భద్రతా చిట్కాల వల్లే నేను ఓ భయంకరమైన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడగలిగా.. అధిక రక్తస్రావం జరగకుండా నన్ను నేను కాపాడుకోగలిగా..’ అంటూ తన ప్రమాద పరిస్థితిని వివరించాడు. అప్పుడర్థమైంది.. ఇలాంటి కోర్సులు/చిట్కాలు అందరికీ ఎంత అవసరమో! ఇదే 1995లో ‘డా. ఎం.ఎన్‌.టాండన్‌ మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (సహాయత ట్రస్ట్‌)’ ప్రారంభించేలా చేసింది..’ అంటారు మాయ.

కోర్సులు-సెమినార్లతో అవగాహన!

రోడ్డు ప్రమాదాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే వేదిక ఇది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు CPR ఎలా చేయాలి?, అధిక రక్తస్రావం కాకుండా వాళ్లను కూర్చోబెట్టే/పడుకోబెట్టే భంగిమలు, చుట్టూ ఉన్న వారు వెనువెంటనే ఎలా స్పందించాలి, అంబులెన్స్‌ వచ్చే లోపు అందుబాటులో ఉన్న సదుపాయాలతో ప్రాథమిక చికిత్స అందించడం, ప్రమాదాల్ని ఎదుర్కోవడానికి సంబంధించిన ప్రొటోకాల్స్‌, పోలీసు విచారణ నుంచి ప్రాణాల్ని రక్షించే వివిధ రకాల చట్టాలు.. వంటి ఎన్నో అంశాలపై అవగాహన పెంచుతున్నారామె.
‘అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (AHA)’, ‘యూరోపియన్‌ రిససిటేషన్‌ కౌన్సిల్‌ (ERC) మార్గదర్శకాల్ని అనుసరించి ‘బేసిక్‌ లైఫ్‌ సేవింగ్‌ కోర్సు’ను కూడా రూపొందించారు మాయ. ఇలా ఇప్పటివరకు తన ఎన్జీవో వేదికగా ఉచితంగా కోర్సులు, సెమినార్లు, అవగాహన సదస్సులు.. వంటివెన్నో నిర్వహించిన ఆమె.. 1.3 లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాద భద్రతపై అవగాహన కల్పించారు. తద్వారా లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగారు.

‘పద్మశ్రీ’ సత్కారం!

‘పోలీసు విచారణకు భయపడి కొంతమంది గాయపడిన వారికి సహాయం చేయలేకపోతున్నారు. మరికొందరు సీపీఆర్‌ చేసే సమయంలో నోట్లో గాలి ఊదడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి వారందరిలో ఉన్న భయాల్ని, అపోహల్ని తొలగించడానికి మేం నిర్వహించే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ సెషన్స్‌ దోహదం చేస్తున్నాయి. అలాగే ప్రమాద బాధితులకు వెనువెంటనే సహాయం అందించడానికి దేశవ్యాప్తంగా కొంతమంది ఔత్సాహిక యువతకు శిక్షణ అందిస్తున్నాం. ఒకరి ప్రాణం నిలపడంలో ఉన్న సంతోషం, సంతృప్తి మరెందులోనూ దొరకదు..’ అంటున్నారు మాయ. 2016-18 వరకు ‘జాతీయ రోడ్డు భద్రతా మండలి’ సభ్యురాలిగా ఉన్న ఆమె.. ప్రస్తుతం 87 ఏళ్ల వయసులోనూ రోడ్డు ప్రమాదాల్ని నివారించడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. ఇలా తన సుదీర్ఘ సమాజ సేవకు గుర్తింపుగా 2004లో ‘4వ జాతీయ రోడ్డు భద్రతా మండలి అవార్డు’, 2006లో ‘IRTE Prince Michael Road Safety Award’, అదే ఏడాది రాజస్థాన్‌ ప్రభుత్వం నుంచి ‘జిల్లా రోడ్డు భద్రతా అవార్డు’, 2013లో ‘జీవితకాల సాఫల్యతా పురస్కారం’.. వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలతో పాటు ఈ ఏడాది ‘పద్మశ్రీ’ కూడా ఆమెను వరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్