ప్రాచీన హస్తకళలకు.. కొత్త రూపు తెస్తోంది!

ప్రతి దాంట్లోనూ కొత్తదనం కోరుకుంటోంది నవతరం.. దీని ప్రభావం ప్రాచీన హస్తకళల పైనా పడుతోంది. ఫలితంగా ఆయా కళాకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ పరిస్థితి ముంబయికి చెందిన డాక్టర్‌ మేఘా ఫన్సల్కర్‌కు మింగుడు పడలేదు. అందుకే ప్రాచీన కళలకు ఆధునిక హంగులద్దుతూ ఎన్నో సృజనాత్మక డిజైన్లను....

Updated : 26 Sep 2022 21:26 IST

(Photos: Instagram)

ప్రతి దాంట్లోనూ కొత్తదనం కోరుకుంటోంది నవతరం.. దీని ప్రభావం ప్రాచీన హస్తకళల పైనా పడుతోంది. ఫలితంగా ఆయా కళాకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ పరిస్థితి ముంబయికి చెందిన డాక్టర్‌ మేఘా ఫన్సల్కర్‌కు మింగుడు పడలేదు. అందుకే ప్రాచీన కళలకు ఆధునిక హంగులద్దుతూ ఎన్నో సృజనాత్మక డిజైన్లను మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు కళాకారుల పొట్ట నింపుతున్నారామె. ఇందుకోసం ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థనే నెలకొల్పి దేశ, విదేశాలకు ఇక్కడి కళా సంస్కృతుల్ని పరిచయం చేస్తున్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోన్న తన సంస్థ గురించి మేఘ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

ముంబయిలో పుట్టి పెరిగిన మేఘ అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్సిటీలో ప్లానింగ్ (అర్బన్‌/రీజనల్‌ ప్లానింగ్‌) విభాగంలో మాస్టర్స్‌ పూర్తిచేశారు. ఈ రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం గడించిన ఆమె.. 2007 నుంచి ప్రపంచ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో నీరు, పారిశుద్ధ్యానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో భాగమవుతుంటారామె.

మహిళాభివృద్ధే ధ్యేయంగా..!

అయితే తన వృత్తిలో భాగంగా ఆయా రాష్ట్రాలను సందర్శించిన ఆమె సమాజ అభివృద్ధికి అడ్డుపడుతోన్న మరో సమస్యను గుర్తించింది. అదే ప్రాచీన హస్తకళలకు, వాటిని తయారుచేసే కళాకారులకు సరైన ఆదరణ లేకపోవడం. అలాగే వారి చేతుల్లో రూపుదిద్దుకుంటోన్న వస్తువుల్ని మార్కెటింగ్‌ చేయడంలోనూ పలు లోపాలున్నాయని తెలుసుకుందామె. దీనివల్ల దేశంలోని ప్రాచీన కళలు అంతరించిపోవడంతో పాటు ఆయా కళాకారులకూ పూట గడవడం కష్టంగానే ఉందన్న విషయం గుర్తించింది. ఈ పరిస్థితిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలనుకుంది. ఈ ఆలోచనతోనే Tisser Artisan Trust పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది మేఘ. గ్రామీణ మహిళా స్వయం సహాయక బృందాలు, ఇతర కళాకారులు రూపొందించే ఆయా ఉత్పత్తులకు ఈ కాలానికి తగినట్లుగా సృజనాత్మక డిజైన్లను జోడించడంతో పాటు మార్కెటింగ్‌ అంశాల్లో మద్దతుగా నిలవడం ఈ ట్రస్ట్‌ ముఖ్యోద్దేశం. తద్వారా మహిళాభివృద్ధికి కృషి చేయడంతో పాటు.. పరోక్షంగా ఇలా చేకూరిన డబ్బుతో వారి కూతుళ్ల విద్యాభివృద్ధికీ తోడ్పడుతోంది మేఘ.

ఈ కళలకు చేయూత!

దక్షిణాసియా మొత్తం మీద సుమారు వంద కళారూపాలకు కొత్తదనం జోడిస్తోన్న ఈ సంస్థ నెట్‌వర్క్‌లో.. సుమారు పది వేల మంది కళాకారులు, స్వయం సహాయక బృందాలు భాగమయ్యారు. ఇక మన దేశంలో సుమారు 18 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా స్వయం సహాయక బృందాలు ఈ సంస్థతో అనుసంధానమై పనిచేస్తున్నాయి. ఈ సంస్థ చేయూతనిస్తోన్న కళల్లో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చీరాల చేనేత- కలంకారీ ఉత్పత్తులతో పాటు కాంజీవరం (తమిళనాడు), చెన్నపట్నం బొమ్మలు (కర్ణాటక), వర్లి-వెదురు ఉత్పత్తులు (మహారాష్ట్ర), ఎంబ్రాయిడరీ-టై అండ్‌ డై (రాజస్థాన్‌), మధుబనీ పెయింటింగ్స్‌ (బిహార్‌), టస్సర్‌ (ఛత్తీస్‌గఢ్‌), పట్టచిత్ర (ఒడిశా).. వంటివి కొన్ని!

సాంకేతికతే ఊతంగా..!

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజంలో ఉన్న పేదరికం చాలావరకు అంతమొందుతుందంటారు మేఘ. ‘మహిళల ఆర్థిక స్వావలంబనకు, దేశాభివృద్ధికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అందుకే ఈ తరం అమ్మాయిలకు కొత్త నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నది నా లక్ష్యం. ప్రాచీన కళలకు కొత్త రూపమివ్వడమే కాదు.. వ్యక్తిగత అభిరుచులను బట్టి కొత్త వస్తువులు ఉత్పత్తి చేయడం పైనా దృష్టి పెట్టాం. ఇక మా ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో ఆదరణ పెంచడానికి సాంకేతికతను వేదికగా చేసుకున్నాం. ఈ క్రమంలో సొంతంగా వెబ్‌సైట్‌, ఆయా ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ-కామర్స్‌ పోర్టల్‌, ప్రాంతీయ భాషల్లో కమ్యూనిటీ యాప్స్‌.. వంటివెన్నో అందుబాటులోకి తెచ్చాం..’ అంటూ తన సంస్థ కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చారామె. సమాజాభివృద్ధి కోసం ఆమె చేస్తోన్న కృషికి గుర్తింపుగా 2021లో ‘విమెన్‌ పవర్‌ సమిట్‌ అవార్డు’తో పాటు పలు పురస్కారాలూ అందుకున్నారు మేఘ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్