పిల్లల కోసం స్పెషల్ బిస్కట్లు.. టర్నోవర్‌ 33 లక్షలు!

పిల్లలకు చాక్లెట్స్‌, బిస్కట్స్‌ అంటే ప్రాణం. అలాగని వాటిని రోజూ తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు తప్పవు! మరి, తినకుండా వారిని నిలువరించగలమా? అంటే.. అది సాధ్యమయ్యే పని కాదు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ వినూత్నమైన ఆలోచన చేశారు మహారాష్ట్రకు చెందిన దంత వైద్య నిపుణురాలు డాక్టర్‌ మినాల్‌ కబ్రా.

Updated : 01 Sep 2021 18:50 IST

(Photo: kivu.in)

పిల్లలకు చాక్లెట్స్‌, బిస్కట్స్‌ అంటే ప్రాణం. అలాగని వాటిని రోజూ తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు తప్పవు! మరి, తినకుండా వారిని నిలువరించగలమా? అంటే.. అది సాధ్యమయ్యే పని కాదు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ వినూత్నమైన ఆలోచన చేశారు మహారాష్ట్రకు చెందిన దంత వైద్య నిపుణురాలు డాక్టర్‌ మినాల్‌ కబ్రా. బిస్కట్లలోని చక్కెరలు, ఇతర ప్రిజర్వేటివ్స్‌.. చిన్నారుల దంతాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గ్రహించిన ఆమె.. అవి లేకుండా, కరెంట్‌ వాడకుండా ఆరోగ్యకరమైన, పర్యావరణహితమైన బిస్కట్లను తయారుచేస్తున్నారు. రుచి, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా రెండేళ్లుగా తన స్టార్టప్‌ను విజయవంతంగా నడుపుతోన్న ఆమె.. ఇటు చిన్నారులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూనే.. అటు లక్షల కొద్దీ టర్నోవర్‌ను అందుకుంటున్నారు. పిల్లల ఆరోగ్యం, మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ వ్యాపారం ప్రారంభించానంటోన్న మినాల్‌ తయారుచేస్తోన్న ఈ ఎకో-ఫ్రెండ్లీ బిస్కట్స్‌ గురించి తెలుసుకుందాం రండి..

డాక్టర్‌ మినాల్‌ కబ్రా.. మహారాష్ట్ర జల్నా జిల్లాలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నారామె. చిన్నతనం నుంచే బేకింగ్‌ అంటే ఇష్టపడే ఆమె.. సోలార్‌ ఒవెన్‌ని ఉపయోగించి వివిధ రకాల బేకింగ్‌ ఐటమ్స్‌ తయారుచేసేవారు. ఇక తన వృత్తిలో భాగంగా ఎంతోమంది పిల్లలు దంత-చిగుళ్ల సమస్యలతో తన వద్దకు రావడం గమనించారామె. వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని, ఈ విషయంలో వాళ్ల తల్లుల్లో అవగాహన లేకపోవడం, ఆర్థిక సమస్యలతో వారికి సరైన వైద్యం కూడా చేయించలేకపోతున్నారన్న విషయాలు గ్రహించారు మినాల్.

‘KIVU’ అలా పుట్టింది!

అయితే సమస్య వచ్చాక తగ్గించుకోవడం కంటే రాకుండా నివారించడమే అత్యుత్తమమైన పద్ధతి అని నమ్మే ఆమె.. 2019లో ‘KIVU’ పేరుతో ఆరోగ్యకరమైన బిస్కట్లు/కుకీస్‌ స్టార్టప్‌ని ప్రారంభించారు. కరెంట్‌తో పనిలేకుండా సూర్యకాంతిని వినియోగించుకొని నడిచే సోలార్‌ కుక్కర్‌తో బిస్కట్స్‌ని తయారుచేయడమే మా స్టార్టప్‌ ప్రత్యేకత అంటారు మినాల్.

‘పిల్లలకు పంటి నొప్పి అని ఎంతోమంది తల్లులు చికిత్స కోసం నా దగ్గరికి వచ్చే వారు. వారిలో గ్రామీణ ప్రాంతాల వారే ఎక్కువ. ఈ క్రమంలో డబ్బు లేక చిన్నారులకు సరైన చికిత్స చేయించలేకపోతున్నామని చెప్పేవారు. ఇలాంటప్పుడు నేను వారికి ఉచితంగా చికిత్స చేయచ్చు.. అయితే దానికంటే సమస్య మూలాల గురించే నేను ఎక్కువగా ఆలోచించాను. పిల్లల్లో క్యావిటీలు రావడానికి కారణం బయట దొరికే బిస్కట్లలోని అధిక చక్కెరలే! కాబట్టి అవే లేకుండా వాటిని తయారుచేస్తే మంచిదనిపించింది. పైగా నాకు బేకింగ్‌ అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం! అందుకే నా అభిరుచికి ఈ ఆలోచనను జోడించి 2019లో వైభవ్‌ దుగర్‌తో కలిసి KIVU పేరుతో ఎకో-ఫ్రెండ్లీ సోలార్‌ బిస్కట్ల వ్యాపారానికి నాంది పలికా.. అయితే అంతకంటే ముందు ఓ ఏడాది పాటు టెస్టింగ్‌లో భాగంగా వీటిని తయారుచేశా..’ అంటూ తన స్టార్టప్‌ గురించి చెప్పుకొచ్చారామె.

ఆరోగ్యమే మా లక్ష్యం!

చక్కెర, పాలు, పాల పదార్థాలు ఉపయోగించకుండా రుచికరమైన బిస్కట్స్‌/కుకీస్ని తయారుచేయడమే తమ స్టార్టప్‌ ముఖ్యోద్దేశం అంటున్నారు మినాల్‌. ‘నిజానికి ఈ సోలార్‌ కుకింగ్‌ సంప్రదాయం మా కుటుంబంలో ఎప్పట్నుంచో ఉంది.. ఏదైనా ఫంక్షన్లు, ప్రత్యేక సందర్భాల్లోనూ నేను ఈ పద్ధతిలోనే విభిన్న వంటకాలు తయారుచేసేదాన్ని. అయితే ఇప్పుడు ఈ కుకీస్‌ కోసం నేను ఉపయోగిస్తోన్న కుక్కర్‌/ఒవెన్‌ మాత్రం ఇంకాస్త అడ్వాన్‌్ుడ్‌ టెక్నాలజీతో కూడుకున్నది. దీన్ని మా వారు వివేక్‌ కబ్రా తయారుచేశారు. గ్లాస్‌ ట్యూబ్‌, కుకింగ్‌ ట్రేతో పాటు అధిక ఉష్ణోగ్రతను అందించే పారాబోలిక్‌ రిఫ్లెక్టర్‌ దీనిలో ఉంటాయి. చక్కెర, మైదా, పాలు, పాల పదార్థాలు వాడకుండా.. రాగులు, జొన్నలు, సజ్జలు, ఓట్స్, అవిసె గింజలు, రాజ్‌గిరా, మునగ గింజలు, దాల్చిన చెక్క, అల్లం, నిమ్మరసం, కొబ్బరి.. వంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో టేస్టీ బిస్కట్స్‌ తయారుచేస్తున్నాం. ఇక వీటిలో తీపి కోసం బెల్లాన్ని వాడుతున్నాం. ఇలా పూర్తిస్థాయిలో వీగన్‌ బిస్కట్స్‌ని పిల్లలకు, పెద్దలకు అందుబాటులో ఉంచుతున్నాం..’ అని చెబుతున్నారామె.

ఉద్యోగం ఇవ్వలేదు.. ఉపాధి కల్పిస్తున్నా!

తన వ్యాపారం ద్వారా పిల్లల ఆరోగ్యానికే కాదు.. మహిళల ఉపాధికి, తద్వారా వారి సాధికారతకు పెద్ద పీట వేస్తున్నారు మినాల్‌. ‘ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నా. అయితే నా స్టార్టప్‌లో వారికి ఉద్యోగం ఇవ్వచ్చు.. కానీ ఇవ్వను.. ఎందుకంటే వాళ్లు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు, నలుగురికీ స్ఫూర్తిగా నిలిచేందుకు ఉపాధి కల్పించడమే నాకు సరైందని అనిపించింది. అందుకే కొందరు మహిళలకు సోలార్‌ కుక్కర్స్‌ అందించి.. వారే స్వయంగా కుకీస్‌ తయారుచేసేలా వారికి శిక్షణ ఇచ్చాను. ఇలా వారు తయారుచేసిన కుకీస్‌ని కొని.. వాటిని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో అమ్ముతున్నా. అలా ప్రస్తుతం మా ఉత్పత్తులు దాదాపు 18 రాష్ట్రాల్లో, సుమారు 72కి పైగా స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించాలన్న ఆలోచన ఉంది..’ అంటూ చెప్పుకొచ్చారు మినాల్.

ఇలా తన సోలార్‌ కుకీస్‌ స్టార్టప్‌ ప్రారంభించిన ఈ రెండేళ్లలో రుచి, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడని మినాల్‌.. తన వ్యాపారాన్ని ఇంతింతై అన్నట్లుగా అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఆరు లక్షల పెట్టుబడితో మొదలైన ఈ వ్యాపారం.. ఇప్పుడు ఏడాదికి 33 లక్షల టర్నోవర్‌ని అందుకుంటోంది.

ఇలా తనకున్న నైపుణ్యాలతో ఎంతోమంది చిన్నారులకు ఆరోగ్యాన్ని చేరువ చేస్తోన్న మినాల్‌.. మరెంతోమంది మహిళల జీవితాల్లో ఉపాధి వెలుగులు నింపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్