First Woman: ఆ అడవికి.. ఇకపై ఆమే బాస్!

కజిరంగా నేషనల్‌ పార్క్‌.. 430 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతానికి 118 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వన్యప్రాణులు, ఖడ్గమృగాలు, వందలాది పక్షులు, క్షీరదాలు, చుట్టూ పచ్చదనంతో అలరారే ఈ జాతీయ ఉద్యానవన సంరక్షణ బాధ్యతలు ఇప్పటివరకు పురుషుల చేతుల్లోనే ఉన్నాయి.

Updated : 30 Aug 2023 18:53 IST

(Photo: Twitter)

కజిరంగా నేషనల్‌ పార్క్‌.. 430 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతానికి 118 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వన్యప్రాణులు, ఖడ్గమృగాలు, వందలాది పక్షులు, క్షీరదాలు, చుట్టూ పచ్చదనంతో అలరారే ఈ జాతీయ ఉద్యానవన సంరక్షణ బాధ్యతలు ఇప్పటివరకు పురుషుల చేతుల్లోనే ఉన్నాయి. కానీ తొలిసారిగా ఈ పగ్గాలందుకోనున్నారు భారత అటవీ శాఖ అధికారిణి డాక్టర్‌ సొనాలీ ఘోష్‌. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ నేషనల్‌ పార్క్‌కు ఫీల్డ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆమె.. ఈ ఘనత సాధించనున్న తొలి మహిళగా చరిత్రకెక్కనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

ఆమె ప్రమేయంతో..!

మన దేశంలోని సుప్రసిద్ధ జాతీయ ఉద్యానవనాల్లో కజిరంగా నేషనల్‌ పార్క్‌ ఒకటి. దేశంలోనే సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్న రెండో నేషనల్‌ పార్క్‌ ఇది. అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ జాతీయ పార్కు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు నెలవు. ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండు వంతుల ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఇక్కడ ఉన్నట్లు ఖడ్గ మృగాల జనగణన నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇది ఇప్పటి మాట.. ఒక్కసారి 118 ఏళ్ల వెనక్కి వెళ్తే.. 1904లో ఈ ఖడ్గ మృగాల సంఖ్య శూన్యం. అప్పటి భారత వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ భార్య మేరీ కర్జన్‌ ఆ సమయంలో కజిరంగాను సందర్శించడంతో.. వేటగాళ్ల వల్లే ఈ ఖడ్గ మృగాలు అంతరించిపోయాయన్న విషయం తెలుసుకున్నారు. దీంతో ఈ విషయాన్ని ఆమె తన భర్త లార్డ్‌ కర్జన్‌తో చెప్పడం.. ఆయన చొరవ తీసుకోవడంతో 1908లో దీన్ని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించారు. 1974లో జాతీయ ఉద్యానవనంగా హోదాను అందుకున్న కజిరంగాను.. 1985లో ‘ప్రపంచ వారసత్వ సంపద’గా యునెస్కో గుర్తించింది.

అడవులపై ప్రేమతో..!

ఇలా గత 118 ఏళ్లుగా ఒక్కో ఘనతను అందుకుంటూ వచ్చిన ఈ జాతీయ ఉద్యానవనానికి ఇన్నేళ్లుగా పురుషులే అటవీ అధికారులుగా ఉన్నారు. ఇకపై ఆ బాధ్యతల్ని ప్రముఖ మహిళా ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సొనాలీ ఘోష్‌ అందుకోనున్నారు. ప్రస్తుతం ఈ నేషనల్‌ పార్క్‌కి ఫీల్డ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జితేంద్ర శర్మ ఆగస్టు 31న పదవీ విరమణ పొందనున్నారు. దీంతో సెప్టెంబర్‌ 1 నుంచి ఈ స్థానాన్ని సొనాలీ భర్తీ చేయనున్నారు. తద్వారా ఈ జాతీయ ఉద్యానవనానికి తొలి మహిళా ఫీల్డ్‌ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించనున్నారామె.
ఆర్మీ కుటుంబంలో పుట్టి పెరిగిన సొనాలీ.. తన తండ్రి ఉద్యోగ రీత్యా చిన్నతనం నుంచి అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా గడిపారు. దీంతో ప్రకృతి, వన్యప్రాణి సంరక్షణపై ప్రేమను పెంచుకున్నారు. ఈ మక్కువతోనే వన్యప్రాణి సంరక్షణ, అటవీ శాఖలోనే తన కెరీర్‌ను వెతుక్కోవాలనుకున్న ఆమె.. ‘అటవీ, వన్యప్రాణి శాస్త్రం’ ప్రధాన సబ్జెక్టులుగా పీజీ పూర్తి చేశారు. ‘ఎన్విరాన్‌మెంటల్‌ లా’ విభాగంలో పీజీ డిప్లొమా చేశాక.. ఇండో-భూటాన్‌ భూభాగంలో విస్తరించి ఉన్న మానస్‌ నేషనల్‌ పార్క్‌లోని పులుల సంరక్షణకు రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందన్న అంశంపై పరిశోధనలు చేసి డాక్టరేట్‌ పొందారు. ఇక 2000-2003 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌ టాపర్‌గా నిలిచిన సొనాలీ.. అసోం రాష్ట్ర జూ డివిజన్‌, కజిరంగా నేషనల్‌ పార్క్‌ పరిధిలోని అడవులకు అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌గా తొలి బాధ్యతలు అందుకున్నారు.

వివిధ హోదాల్లో..!

తన 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో.. వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు సొనాలీ. ‘సెంట్రల్‌ జూ అథారిటీ’కి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ)గా, ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’కి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె.. దిల్లీలోని ‘నేషనల్‌ జూలాజికల్‌ పార్క్‌’ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం గువహటి ‘చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌’ హోదాలో కొనసాగుతోన్న ఆమె.. త్వరలో కజిరంగా నేషనల్‌ పార్క్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ క్రమంలో వన్యప్రాణి పర్యాటకానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం, వన్యప్రాణి సందర్శన, పర్యటకాన్ని ప్రోత్సహించడం, సందర్శకుల అనుమతులు.. వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. గత కొన్నేళ్లుగా అటవీ శాఖలో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం మంచి పరిణామం అంటున్నారామె.

అది మంచి పరిణామం!

‘2000లో నేను విధుల్లో చేరినప్పుడు మహిళా ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్ల సంఖ్య వంద కంటే తక్కువగా ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా ఈ రంగాన్ని ఎంచుకునే మహిళలు పెరుగుతున్నారు. అయితే ఈ రంగంలో మహిళలు ఇంటిని-పనిని సమన్వయం చేసుకోవడం కష్టమే! ఈ విషయంలో నేనూ పలు సవాళ్లను ఎదుర్కొన్నా. ఎందుకంటే అడవుల్లో పిల్లల కోసం వైద్య, విద్యా సదుపాయాలు ఉండవు. పసి పిల్లల్ని చూసుకోవడానికి క్రెచ్‌ లాంటి వసతులు కూడా తక్కువే! నేను విధుల్లో చేరిన కొత్తలో అయితే బాత్‌రూమ్స్‌/టాయిలెట్స్‌ సదుపాయాల్లేక పలు ఇబ్బందులు ఎదుర్కొన్నా. నిజానికి ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పులొస్తున్నాయి. కానీ వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరితే.. పురుషులతో సమానంగా మహిళలూ ఈ రంగంలో రాణించగలరు. అంతేకాదు.. అటవీ వాతావరణంలో పెరిగిన పిల్లలు జీవితానికి సంబంధించిన బోలెడన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. అవి వారికి వ్యక్తిగతంగానే కాదు.. కెరీర్‌లోనూ దూసుకుపోయేలా సహాయపడతాయి..’ అంటోన్న సొనాలీ.. ఎంచుకున్న రంగమేదైనా మనసు పెట్టి పనిచేస్తే ఎదురే ఉండదంటున్నారు. వన్యప్రాణి సంరక్షణ, అటవీ పరిరక్షణపై ఆయా వేదికలపై ప్రసంగాలు కూడా ఇస్తుంటారీ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని