నీళ్లు సరిగా తాగుతున్నారా?

ఆరోగ్య పరిరక్షణలో తగినంత నీరు తాగడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం తెలిసినా సరే-  శరీరానికి అవసరమైన నీరు తాగడంలో చాలామంది మహిళలు శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఫలితంగా వివిధ సమస్యలకు లోను కావాల్సి వస్తోంది. ఈ క్రమంలో నీరు తాగకపోవడం వల్ల కలిగే సమస్యలు.....

Published : 09 Mar 2022 20:44 IST

ఆరోగ్య పరిరక్షణలో తగినంత నీరు తాగడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం తెలిసినా సరే-  శరీరానికి అవసరమైన నీరు తాగడంలో చాలామంది మహిళలు శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఫలితంగా వివిధ సమస్యలకు లోను కావాల్సి వస్తోంది. ఈ క్రమంలో నీరు తాగకపోవడం వల్ల కలిగే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం.

నీళ్లు తాగకపోతే..

* కిడ్నీ సంబంధిత సమస్యలు

* రక్తప్రసరణ సమస్య

* శరీర ఉష్ణోగ్రత పెరగడం

* జీర్ణ సంబంధమైన సమస్యలు

* శరీరం తాజాదనాన్ని కోల్పోవడం

* అధిక బరువు

* మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మొదలైన సమస్యలు ఎదురవుతాయి.

దగ్గరే ఉండాలి...

ఆఫీస్‌లో పని ఒత్తిడి వల్ల నీరు తాగడం తగ్గించుకోకూడదు. మరిచిపోకుండా ఉండేందుకు వీలైతే మీకు కనపడేటట్లు నీళ్ల బాటిల్‌ను దగ్గరగా పెట్టుకోండి. అవసరమైతే ఫోన్లో రిమైండర్లు పెట్టుకోండి. వీలైతే నిమ్మ, ద్రాక్ష లాంటి పండ్ల రసాలు అందుబాటులో ఉంచుకోవడం మంచిది.

అవసరమైనంత మేర..

పరగడుపునే రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల సమస్త రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి నీరు మంచి ఔషధం. అలాగని రోజులో ఒకేసారి ఎక్కువ నీరు తాగడం మంచిది కాదు. దీనివల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది.

అదుపులో రక్తపోటు

సాధారణంగా రక్తపోటు సమస్యతో బాధపడేవారికి ఎక్కువ నీరసంతో పాటు కళ్లు తిరగడం, తలనొప్పి లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగితే ఒత్తిడిని క్రమంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా అధిక బరువు సమస్యను కూడా నివారించవచ్చు.

మేని మెరుపు

ఒత్తిడిలో ఉన్నప్పుడు రెండు గ్లాసుల నీరు తాగి.. రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన ఆలోచనలపై కూడా ఇది బాగా ప్రభావం చూపుతుంది. తగినంత నీరు తాగడం వల్ల శరీరం మెరుపును సంతరించుకోవడమే కాక.. ముడతలు పడకుండా ఉంటుంది.

సమయానుసారం..

* పరగడుపున నీరు తాగితే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుంది.

* స్నానానికి అయిదు నిమిషాల ముందు తాగితే రక్తపోటు తగ్గుతుంది.

* మధ్యాహ్నం భోజనం చేయడానికి అరగంట ముందు, భోజనానంతరం గంట తర్వాత నీళ్లు తాగితే జీర్ణ సంబంధమైన సమస్యలను నివారించవచ్చు.

* రాత్రిపూట నిద్రపోవడానికి అయిదు నిమిషాల ముందు నీళ్లు తాగితే గుండె సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తెలిసిందిగా.. నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో. అందుకే ప్రతిరోజూ అవసరమైన పరిమాణంలో నీటిని తాగండి. ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్