Published : 19/10/2022 21:05 IST

నోటి ఆరోగ్యం కోసం..!

ఉదయాన్నే లేచి బ్రష్‌ చేసుకున్న తర్వాత మౌత్‌వాష్‌తో నోరు పుక్కిలించడం మనలో చాలామంది చేసేదే. దంతాలు-చిగుళ్ల ఆరోగ్యానికి, నోటి దుర్వాసనను దూరం చేయడానికి ఈ ప్రక్రియ బాగా తోడ్పడుతుంది. అయితే సాధారణంగా బయట దొరికే మౌత్‌వాష్‌లలో ఉండే రసాయనాల గాఢత నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే మన వంటింట్లో ఉండే కొన్ని రకాల నూనెలతో నోటిని పుక్కిలించడం వల్ల నోరు శుభ్రపడడమే కాదు.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయని వారు సూచిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార అనుష్కా శర్మ లాంటి వాళ్లు సైతం రోజూ ఉదయాన్నే పరగడుపున ఆయిల్ పుల్లింగ్ చేయనిదే తమ రోజు ప్రారంభం కాదని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మరి, ఈ ప్రక్రియ వల్ల చేకూరే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..?

ఆరోగ్యానికి.. ‘ఆయిల్‌ పుల్లింగ్’!

ఆయిల్‌ పుల్లింగ్‌ ప్రక్రియ ద్వారా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.

✬ మన నోట్లో వందల సంఖ్యలో సూక్ష్మక్రిములు ఉంటాయట. అందులో కొన్ని హానికరమైనవి కూడా ఉంటాయి. అవి పంటి నొప్పి, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు, నోటి దుర్వాసనకు కారణమవుతాయి. అయితే ఆయిల్‌ పుల్లింగ్‌ ప్రక్రియ ఇలాంటి బ్యాక్టీరియాను సమూలంగా నాశనం చేసినట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

✬ నోటిని చక్కగా శుభ్రపరచుకోకపోవడం, నోటి ఇన్ఫెక్షన్లు, చిగుళ్లలో సమస్యల వల్ల నోటి దుర్వాసన రావడం కామన్‌. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే బయట దొరికే మౌత్‌వాష్‌ల కంటే మన వంటింట్లో ఉండే నూనెలే సమర్థంగా పనిచేస్తున్నట్లు మరో పరిశోధనలో తేలింది.

✬ చక్కెర, చక్కెర సంబంధిత పదార్థాలు అధికంగా తీసుకోవడం, దంతాల మధ్య చిక్కుకున్న పదార్థాల అవశేషాలను తొలగించుకోకపోవడం వల్ల పళ్లు పుచ్చిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి నిపుణులు సూచించే అద్భుతమైన చిట్కా ఆయిల్‌ పుల్లింగ్‌. రోజూ ఉదయాన్నే బ్రష్‌ చేసుకున్న తర్వాత ఆయిల్‌ పుల్లింగ్‌ చేయడం వల్ల రంధ్రాలకు కారణమయ్యే బ్యాక్టీరియా నశిస్తుంది.

✬ చిగుళ్లలో వాపు, రక్తస్రావం.. వంటి సమస్యలు కొంతమందిలో తలెత్తుతాయి. అలాంటి వారు ఆయిల్‌ పుల్లింగ్‌తో ఉపశమనం పొందచ్చు.

✬ దంతాలపై పేరుకున్న పాచి, పసుపుదనాన్ని తొలగించి.. పళ్లను మెరిపించడంలోనూ ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది.

✬ ఆయిల్‌ పుల్లింగ్‌ ప్రక్రియ ద్వారా దవడ, మెడ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. తద్వారా ఆయా భాగాల్లో ఏదైనా నొప్పి ఉంటే తగ్గిపోతుంది.

ఎలా చేయాలంటే?

నోటి ఆరోగ్యానికి దోహదం చేసే ఆయిల్‌ పుల్లింగ్‌ ప్రక్రియను పాటించడానికీ ఓ పద్ధతుందంటున్నారు దంత వైద్య నిపుణులు. ఈ క్రమంలో ముచ్చటగా ఈ మూడు చిట్కాల్ని పాటించాలని సూచిస్తున్నారు.

✬ ఆయిల్‌ పుల్లింగ్‌కి కొబ్బరి/ఆలివ్‌/నువ్వుల నూనెలు చక్కటి ఎంపిక. వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని టేబుల్‌స్పూన్‌ నూనెను నోట్లోకి తీసుకోవాలి.

✬ ఆపై ఇరవై నిమిషాల పాటు ఆ నూనె నోట్లోని మూలమూలకు వెళ్లేలా పుక్కిలిస్తూ ఉండాలి. ఈ క్రమంలో దీన్ని మింగకుండా జాగ్రత్తపడాలి. పని పూర్తయ్యాక ఉమ్మివేయాలి.

✬ ఇక ఏదైనా తినేముందు లేదా తాగే ముందు నోటిని శుభ్రపరచుకొని ఆ తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని