Couple Exercises : కలిసి చేయండి.. బరువు తగ్గండి!

భార్యాభర్తలిద్దరూ కలిసి చేసే కొన్ని పనులు వారికి ఆనందాన్ని అందిస్తాయి.. ఇద్దరి మధ్య అనుబంధాన్నీ పెంపొందిస్తాయి. వ్యాయామమూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే సమయం లేకో, ఇద్దరి పనివేళలు వేరుగా ఉండడం వల్లో కలిసి వర్కవుట్లు....

Published : 27 May 2023 17:35 IST

భార్యాభర్తలిద్దరూ కలిసి చేసే కొన్ని పనులు వారికి ఆనందాన్ని అందిస్తాయి.. ఇద్దరి మధ్య అనుబంధాన్నీ పెంపొందిస్తాయి. వ్యాయామమూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే సమయం లేకో, ఇద్దరి పనివేళలు వేరుగా ఉండడం వల్లో కలిసి వర్కవుట్లు చేసే వీలు దొరక్కపోవచ్చు. కానీ వీలు చిక్కినప్పుడే ఓ పావుగంట సమయం కేటాయించి ఈ చిన్నపాటి వ్యాయామాలు సరదాగా ఇద్దరూ కలిసి సాధన చేస్తే.. అటు బరువు తగ్గడంతో పాటు ఇటు దాంపత్య బంధాన్నీ దృఢం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటా కపుల్‌ ఎక్సర్‌సైజెస్‌? రండి.. మనమూ తెలుసుకుందాం..!

భార్యాభర్తలిద్దరూ ఎదురెదురుగా ప్లాంక్‌ పొజిషన్‌లో ఉండాలి. ఇప్పుడు తమ శరీర భారాన్ని కుడి చేతిపై మోపి.. ఇరువురి ఎడమ చేతుల్ని కలుపుతూ చప్పట్లు కొట్టాలి. ఆపై ఎడమ చేతిపై శరీర భారాన్ని మోపుతూ.. కుడి చేతులతో చప్పట్లు కొట్టాలి. ఇలా చేతులు మార్చుతూ పావు గంట పాటు ఈ ‘ప్లాంక్‌ విత్‌ ఎ క్లాప్‌’ వ్యాయామాన్ని కొనసాగించాలి.

దంపతుల్లో ఒకరు నేలపై వెల్లకిలా పడుకోవాలి. మరొకరు వీరి తల వద్ద నిటారుగా నిల్చొని చేతులు ముందుకు చాపాలి. ఇప్పుడు పడుకున్న వారు కాళ్లను నిటారుగా పైకి లేపుతూ.. చేతుల్ని తాకించాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్‌ చేశాక.. ఇద్దరూ తమ తమ స్థానాల్ని మార్చుకొని.. ఈ ‘లెగ్‌ లిఫ్ట్‌’ వ్యాయామాన్ని ఇలాగే సాధన చేయాలి.

భార్యాభర్తల్లో ఒకరు ప్లాంక్‌ పొజిషన్‌లో ఉండి.. మరొకరు వీరి కాళ్ల వద్ద నిల్చొని పాదాల్ని పైకి లేపి పట్టుకోవాలి. ఇప్పుడు ప్లాంక్‌ పొజిషన్‌లో ఉన్న వారు తమ శరీరాన్ని పైకి, కిందికి కదిలిస్తూ పుషప్స్‌ చేయాలి. ఆపై ఇద్దరూ పొజిషన్స్‌ మార్చి మరోసారి ఈ ‘పుషప్స్‌’ వర్కవుట్‌ రిపీట్‌ చేయాలి.

దంపతులిద్దరూ ఒకరి వీపు మరొకరికి తగిలేలా కూర్చోవాలి. ఆపై మోకాళ్లు మడుస్తూ పాదాల్ని నేలకు ఆనించాలి. ఇప్పుడు కాస్త చిన్న సైజులో ఉన్న జిమ్‌ బాల్‌ను ఒకరికొకరు అందించుకోవాలి. ఓసారి కుడి వైపు నుంచి, మరోసారి ఎడమ వైపు నుంచి అందించుకుంటూ వ్యాయామం చేయాలి. ‘రష్యన్‌ ట్విస్ట్‌’గా పిలిచే ఈ వ్యాయామంలో భాగంగా శరీర భాగాలు కదలకుండా, కేవలం చేతులు మాత్రమే కదిలిస్తూ వర్కవుట్‌ చేయాలి. తద్వారా ఆయా శరీర భాగాలపై ఒత్తిడి పడి.. అక్కడి కొవ్వు కరిగిపోతుంది. అలాగే ఈ వ్యాయామం ఎదురెదురుగా కూర్చొని, ఒక కాలుపై నిల్చొని.. ఇలా విభిన్న భంగిమల్లో చేయచ్చు.

ఇద్దరూ ఎదురెదురుగా నిల్చొని కాస్త వంగుతూ చేతులు పట్టుకోవాలి. ఆపై గుంజీలు తీయాలి. ఇలా పలుమార్లు రిపీట్‌ చేయడం వల్ల ఇద్దరికీ ఏకకాలంలో వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. దీన్ని ‘హ్యాండ్‌ హోల్డింగ్‌ స్క్వాట్స్‌’గా పిలుస్తారు.

ఒకరు సిటప్‌ పొజిషన్‌లో కూర్చోవాలి. మరొకరు ఎదురుగా కూర్చొని వీరి పాదాలు పట్టుకోవాలి. ఇప్పుడు సిటప్‌ భంగిమలో ఉన్న వారు.. చేతుల్ని మడుస్తూ తల వెనక భాగంలో ఉంచి.. వెనక్కి పడుకుంటూ, లేస్తూ సిటప్స్‌ చేయాలి. ‘క్రంచెస్‌’గా పిలిచే ఈ వ్యాయామాన్ని పలుమార్లు రిపీట్‌ చేశాక.. భాగస్వామికి ఈ అవకాశమివ్వాలి.

భార్యాభర్తలిద్దరిలో ఒకరు గోడకుర్చీ వేయాలి. మరొకరు వీరి ముందు గోడకుర్చీ వేసినట్లుగా నిల్చొని.. వీరి మోకాళ్లపై చేతులు ఆనించి గుంజీలు తీయాలి. ‘ట్రైసెప్‌ డిప్‌’గా పిలిచే ఈ వ్యాయామం కొన్నిసార్లు రిపీట్‌ చేశాక.. ఇద్దరూ పొజిషన్స్‌ మార్చుకొని ఈ స్టెప్స్‌ పునరావృతం చేయాలి.

దంపతులిద్దరూ ఒకరి వెనుక మరొకరు నిల్చోవాలి. ముందు నిల్చున్న వారి నడుముకు ఎక్సర్‌సైజ్‌ బ్యాండ్‌ అమర్చుకొని.. వెనక ఉన్న వారు దీన్ని పట్టుకోవాలి.. ముందున్న వారు దీన్ని వీలైనంత సాగదీస్తూ ముందుకు జంప్‌ చేయచ్చు.. లేదంటే పరిగెత్తచ్చు. ఈ ‘బ్యాండ్‌ జంప్‌’ వ్యాయామాన్ని కొన్నిసార్లు రిపీట్‌ చేశాక.. ఆపై ఇద్దరూ పొజిషన్స్‌ మార్చుకొని తిరిగి పునరావృతం చేయాలి.

ఇద్దరూ మోచేతులపై శరీర భారాన్ని మోపుతూ నేలపై వెల్లకిలా పడుకోవాలి. ఆపై ఇద్దరూ హృదయాకృతి వచ్చేలా కాళ్లను కలుపుతుండాలి. ‘హై సి-కర్వ్‌ హార్ట్‌’గా పిలిచే ఈ వ్యాయామాన్ని ఇద్దరూ ఒకేసారి రెండు కాళ్లతోనైనా చేయచ్చు.. లేదంటే ఒక్కో కాలితో చేసి.. ఆపై సైడ్స్‌ మార్చుకొని మరో కాలితోనూ రిపీట్‌ చేయచ్చు.

ఇద్దరూ ఎదురెదురుగా నిల్చొని కలిసి ‘స్కిప్పింగ్‌’ సాధన చేయాలి. లేదంటే విడివిడిగానైనా ఈ వ్యాయామం చేయచ్చు.

ఈ తరహా వ్యాయామాలు చేయడానికి సింపుల్‌గా ఉన్నా.. ఆయా శరీర భాగాలపై ఒత్తిడి కలగజేస్తాయి. తద్వారా బరువు తగ్గచ్చు. మరోవైపు.. ఇద్దరూ కలిసి సరదాగా వీటిని సాధన చేయడం వల్ల కష్టంగానూ అనిపించదు.. ఫలితంగా ఇద్దరి మధ్య అనుబంధమూ దృఢమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్