పిల్లలు ఎత్తు పెరగాలంటే ఇలా చేయండి!

తమ పిల్లలు ఎత్తుగా ఉండాలి.. ఎత్తుకు తగ్గ బరువుండాలి.. అని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే కొంతమంది చిన్నారుల్లో పెరుగుదల మందకొడిగా సాగడం, ఒక వయసొచ్చాక ఆగిపోవడం వల్ల సరైన ఎత్తు పెరగక పొట్టిగా....

Updated : 01 Jun 2023 19:45 IST

తమ పిల్లలు ఎత్తుగా ఉండాలి.. ఎత్తుకు తగ్గ బరువుండాలి.. అని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే కొంతమంది చిన్నారుల్లో పెరుగుదల మందకొడిగా సాగడం, ఒక వయసొచ్చాక ఆగిపోవడం వల్ల సరైన ఎత్తు పెరగక పొట్టిగా కనిపిస్తుంటారు. తల్లిదండ్రుల జీన్స్‌ ఒక్కటే దీనికి కారణం అనుకుంటే పొరపాటే! ఎందుకంటే పోషకాహార లోపం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, వారుండే వాతావరణం.. వంటివీ చిన్నారుల ఎత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే పిల్లలు ఎత్తు పెరగడానికి కొన్ని వ్యాయామాలు దోహదం చేస్తాయంటున్నారు. మరి, ఏంటా వర్కవుట్లు? మనమూ తెలుసుకుందాం రండి..

స్ట్రెచింగ్ వ్యాయామాలు..

స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడానికి సులభంగా ఉండడంతో పాటు, పిల్లలు ఎత్తు పెరగడానికి ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నిటారుగా నిల్చొని కిందికి వంగుతూ కాలి వేళ్లను అందుకోవడం, కాళ్లు ముందుకు చాపి కూర్చొని చేతి వేళ్లతో కాళ్లను అందుకోవడం, శరీర పైభాగాన్ని ఇరువైపులా వంచుతూ చేసే వ్యాయామాలు.. ఇలాంటి వర్కవుట్లు వెన్నెముకకు ఫ్లెక్సిబులిటీని అందిస్తాయి. అది సులభంగా సాగేలా చేస్తాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగడం సులువవుతుంది.

వేలాడితే మంచిదే!

పిల్లలు ఎత్తు పెరగడానికి చాలామంది నిపుణులు సూచించే వ్యాయామాలివి. బార్‌ హ్యాంగింగ్స్‌, హ్యాంగింగ్‌ రాడ్‌, పులప్స్‌, చిన్‌-అప్స్‌.. వంటి ఎక్సర్‌సైజెస్‌ వెన్నెముకను సులభంగా సాగేలా చేస్తాయి. తద్వారా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగచ్చు. అలాగే ఈ వ్యాయామాలు వెన్ను, భుజాల కండరాలకు దృఢత్వాన్ని అందించి ఫిట్‌గా మార్చుతాయి.

ఈ యోగాసనాలతో..!

కొన్ని రకాల యోగాసనాలు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాదు.. పిల్లలు ఎత్తు పెరగడానికీ దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరమంతటికీ చక్కటి వ్యాయామం అందుతుంది. అలాగే భుజాలు, వీపు, కాళ్లలోని కండరాలను బలంగా మార్చి సులభంగా సాగేలా చేస్తుంది. ఇక చక్రాసనం వల్ల భుజాలు, పాదాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా అక్కడి కండరాలు దృఢమవడంతో పాటు సాగుతాయి. ఫలితంగా ఎత్తు పెరిగే ప్రక్రియ వేగవంతమవుతుంది.

స్కిప్పింగ్‌-స్విమ్మింగ్

స్కిప్పింగ్‌ ఆడడమంటే ఆడపిల్లలకు భలే సరదా. ఎంతో సరదాగా చేసే ఈ వ్యాయామం వారి శరీరానికి దృఢత్వాన్ని అందించడమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. అలాగే ఈ వర్కవుట్‌లో భాగంగా ఎగిరి దూకే క్రమంలో వెన్నెముక, భుజాలు, కాళ్లలోని కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.. సులభంగా సాగేలా తయారవుతాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరగడం ఈజీ అవుతుంది.

ఇక ఈత కొట్టే క్రమంలో కూడా శరీరాన్ని ముందుకు సాగదీస్తాం. తద్వారా వెన్నెముకకు చక్కటి వ్యాయామం అందుతుంది. ఇది కూడా ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది.


ఇవి కూడా!

మన శరీరంలో HGH (Human Growth Hormone) అనే పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్‌ ఉంటుంది. ఇది పిల్లల్లో నిద్రపోయినప్పుడు మాత్రమే విడుదలవుతుందట! అందుకే చిన్నారులు ఎంత చక్కగా నిద్రపోతే అంతగా పెరుగుతారంటారు.

విటమిన్‌ ‘డి’ సైతం చిన్నారులు ఎత్తు పెరిగేందుకు ప్రేరేపిస్తుందంటున్నారు నిపుణులు. ఇది కండరాలు, ఎముకల సామర్థ్యం పెరిగేలా చేసి.. పరోక్షంగా ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది. ఇందుకోసం రోజూ కాసేపు ఎండలో నిలబడడం.. చేపలు, పుట్టగొడుగులు, గుడ్లు.. వంటి విటమిన్‌ ‘డి’ అధికంగా ఉండే ఆహార పదార్థాలు వారి డైట్‌లో భాగం చేయడం మంచిది.

పిల్లలకు అందించే ఆహారంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు.. ఇలా అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం సీజనల్‌ పండ్లు, అన్ని రకాల కాయగూరలు-దుంపలు, ఆకుకూరలు.. వంటివన్నీ వారి ఆహారంలో చేర్చాలి. ఇవే వారిని బలంగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తాయి.

అయితే పిల్లలు ఎత్తు పెరిగేందుకు దోహదం చేసే ఈ వ్యాయామాలన్నీ వారికి చిన్నతనం నుంచే అలవాటు చేయడం మరీ మంచిది. ఒకవేళ ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటోన్న వారైతే.. నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయించడం వల్ల వాటిని సరైన రీతిలో చేయగలుగుతారు. సత్వర ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వారితో చేయించే వ్యాయామాలు, వారికి అందించే పోషకాహారం విషయంలో ఏవైనా సందేహాలుంటే నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్