Published : 01/01/2023 20:13 IST

మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా?

కొంతమందికి తమ కంటికి ఏది నచ్చకపోయినా ఏదో ఒకటి కామెంట్‌ చేయడం అలవాటు. ఆ అమ్మాయి బాగా లావుగా ఉందనో, రంగు తక్కువనో.. ఇలా ఎదుటివారి శరీరాకృతి, అందం గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. ఇక ఇలాంటి విమర్శలకు గురైన అమ్మాయిలు బాధపడడం, తమ శరీరాన్ని అసహ్యించుకోవడం మొదలుపెడుతుంటారు. ఆ ధోరణే వద్దంటున్నారు మానసిక నిపుణులు. ఇలాంటి ప్రతికూల ఆలోచనల్ని దూరం చేసుకోవాలంటే ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవడం కంటే మంచి మందు లేదంటున్నారు. బాడీ షేమింగ్‌ను బాడీ పాజిటివిటీగా మార్చుకోమంటున్నారు. ‘ఎవరేమనుకుంటే నాకేంటి.. ఇది నా శరీరం.. నాకు నచ్చినట్లుగా నేనుంటా..’ అన్న ధోరణిని అలవర్చుకోమంటున్నారు. అందుకోసం కొన్ని చిట్కాల్ని సైతం సూచిస్తున్నారు. కొత్త ఆశలు-ఆశయాలతో కొత్త ఏడాదిలోకి అడుగిడిన ఈ శుభ సందర్భంలో బాడీ పాజిటివిటీని పెంచుకోవడమెలాగో తెలుసుకుందాం రండి..!

వ్యాయామంతో ‘ప్రేమ’ పెరుగుతుంది!

ఎంత అడ్వాన్స్డ్‌గా ఆలోచిస్తున్నా ఇప్పటికీ బాడీ షేమింగ్‌ వల్ల సుమారు 91 శాతం మంది మహిళలు తమ శరీరం పట్ల సంతృప్తిగా లేరని చెబుతోంది ఓ అధ్యయనం. అంతేకాదు.. ఇతరుల మాటలు పట్టుకొని కాస్మెటిక్‌ సర్జరీ ద్వారా తమ అందానికి మెరుగులు దిద్దుకునే వారూ పెరుగుతున్నారట. నిజానికి ఇలాంటి ప్రతికూల ఆలోచనల వల్ల నష్టపోయేది మనమే! అందుకే వీటి నుంచి బయటపడి సానుకూల దృక్పథం వైపు అడుగేయాలన్నా, మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలన్నా, అందుకు వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

అసలు వ్యాయామానికి, బాడీ పాజిటివిటీకి సంబంధం ఏంటి.. అనుకుంటున్నారా? చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎలాగంటే.. వ్యాయామం చేసే క్రమంలో మన శరీరంలో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) విడుదలవుతాయి. ఇవి మనలోని ప్రతికూల ఆలోచనల్ని తరిమికొట్టి మనసును సంతోషం వైపు నడిపిస్తాయి. తద్వారా హ్యాపీగా ఉండచ్చు.. చక్కటి శరీరాకృతీ సొంతమవుతుంది. అయితే ఇందుకోసం ఏదో వర్కవుట్‌ చేయాలి కాబట్టి చేస్తున్నాం అనుకోకుండా.. మీరు చేసే వ్యాయామాలను పూర్తిగా ఆస్వాదించాలి.. అందుకోసం మీకు నచ్చిన, మీరు సులభంగా చేస్తాం అనుకున్న ఎక్సర్‌సైజ్‌ని ఎంచుకుంటే సరి!

వార్డ్‌రోబ్‌ మార్చేయండి!

‘మొన్నటిదాకా పట్టిన టీషర్ట్‌ ఇప్పుడు పట్టట్లేదంటే అంత లావయ్యానన్నమాట! అందుకే ఈ మధ్య నా ఫ్రెండ్సంతా నన్ను ఏడిపిస్తున్నారు.. నన్ను నేను చూసుకోవాలంటేనే ఇబ్బందిగా ఉంది’ అనుకునే బదులు ‘నా శరీరాకృతికి తగ్గట్లుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ఎంచుకుంటే సరిపోతుంది కదా’ అన్న ఆలోచనలు మనసులోకి రావాలంటున్నారు నిపుణులు. తద్వారా ఇటు మీకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు.. అటు హ్యాపీగా ఉండచ్చు. అందుకే వార్డ్‌రోబ్‌లో మీ శరీరాకృతికి తగ్గ దుస్తుల్ని, సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా కనిపించే అవుట్‌ఫిట్స్‌ని ఎప్పటికప్పుడు చేర్చుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి.

పోలికలొద్దు!

ఒకరకంగా పోలికలు మనలో ఉన్న అభద్రతా భావాన్ని బహిర్గతం చేస్తాయంటారు నిపుణులు. అందుకే శరీరం రంగు, ఎత్తు, బరువు వంటి విషయాల్లో ఇతరులతో పోల్చుకుని బాధపడిపోకుండా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నామా లేదా అన్నదే పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇదీ ఓ రకంగా తమ శరీరాన్ని తాము ప్రేమించుకోవడమే అవుతుందట!

మీకోసం మీరు కాక ఇంకెవరు?!

చాలామంది మహిళలు ఇంట్లో ఉన్న వారందరి గురించి పట్టించుకుంటూ, వారి పనులన్నీ చేసిపెడుతుంటారు కానీ వాళ్ల గురించి వాళ్లు పట్టించుకోరు. ఇలా తమ గురించి తాము సమయం కేటాయించుకోకపోవడం వల్ల కొన్నాళ్లకు ‘నా గురించి నేను పట్టించుకునే సమయమే దొరకట్లేదు.. ఛీ.. నా జీవితం ఎప్పుడూ ఇంతే..!’ అన్న ప్రతికూల ఆలోచనల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఎంత బిజీగా ఉన్నా కాసేపు మీతో మీరు సమయం గడిపేలా ప్రణాళిక వేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో రిలాక్సవడానికి స్పాలకు వెళ్లడం, మీ అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంట్లోనే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలను పాటించడం, నచ్చిన పనులు చేసుకోవడం, మనసుకు నచ్చిన వారితో సమయం గడపడం.. వంటివి ఇందులో కొన్ని! ఇలాంటి పనుల వల్ల మీపై మీకు ప్రేమ క్రమంగా పెరుగుతుంది.. మనసుకూ ఆహ్లాదకరంగా ఉంటుంది. కావాలంటే ఓసారి ప్రయత్నించి చూడండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి