అందానికి అయిదు చిట్కాలు..!
రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచుకుని, అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..
ఒక్కోసారి శరీరంలోని కొన్ని వ్యవస్థలు గాడి తప్పితే ఆ ప్రభావం చర్మంపై కూడా ఉంటుంది. ప్రత్యేకించి రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే పలు రకాల చర్మ సమస్యలు ఉత్పన్నమవుతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటే శరీరంలో ఆక్సిజన్ సరఫరా శాతం క్రమంగా పెరుగుతుంది. శరీరంలోని హానికారక పదార్థాలు, విషతుల్యాలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం లోలోపలి నుంచే నిగారింపును సంతరించుకుంటుంది అని సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు.. మరి వారు సూచిస్తున్నట్లు రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచుకుని, అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..
వ్యాయామం చేయండి..
వ్యాయామాలు, వర్కవుట్లను జీవనశైలిలో భాగం చేసుకుంటే శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు. వ్యాయామాలు చేయడం వల్ల హృదయ స్పందనల రేటు పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. రన్నింగ్, యోగా, హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్.. లాంటి వ్యాయామాలను వారంలో 5 రోజుల చొప్పున కనీసం 30 నిమిషాల పాటు చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
హెల్దీ ఫుడ్స్..
చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను ఆహారంగా తీసుకోకపోవడం ఎంతో ఉత్తమం. వీటి స్థానంలో ఆకుపచ్చని కూరగాయలు, సిట్రస్ పండ్లను డైట్‌లో భాగం చేసుకుంటే బాగుంటుంది. ఇందులో సమృద్ధిగా ఉండే ఫైబర్ రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఫ్లూయిడ్స్ ఎక్కువగా..
ఎలాంటి రసాయన ఉత్పత్తులు వాడకుండా సహజమైన పద్ధతుల్లో అందంగా మెరిసిపోవాలంటే మంచినీటికి మించిన సాధనం మరొకటి లేదు. చర్మ సౌందర్య నిపుణులు కూడా ఎక్కువగా ఇదే మాట చెబుతుంటారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల విషతుల్యాలు, హానికారక పదార్థాలు పెరిగిపోతాయి. ఈ ప్రభావం కచ్చితంగా చర్మంపై పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శరీరంలో తగినంత నీటి స్థాయులు ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ క్రమంలో- మంచి నీటితో పాటు కొన్ని రకాల ఫ్రూట్‌జ్యూస్‌లను తీసుకున్నా మంచి ఫలితముంటుంది.
ఫేషియల్ మసాజ్..
కొన్ని రకాల ఫేషియల్ మసాజ్‌ల వల్ల కూడా చర్మం సహజంగా మెరుపును సంతరించుకుంటుంది. ఈ మసాజ్‌ల వల్ల ముఖం, చర్మంపై ఉండే లింఫ్ గ్రంథులపై మర్దన జరిగి ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలు, విషతుల్యాలు తొలగిపోతాయి. అంతేకాదు శరీరంలోని అన్ని భాగాలకు సక్రమంగా ఆక్సిజన్ అందుతుంది. ఫలితంగా చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది. రోజూ కనీసం 10-15 నిమిషాల పాటు ఇలా ఫేషియల్ మసాజ్ చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మసాజ్ కోసం జేడ్ రోలర్ వంటి పరికరాలను కూడా వాడచ్చు.
ఆ అలవాట్లను దూరం చేసుకోండి!
స్మోకింగ్, మద్యపానం లాంటి అలవాట్లు ఉన్నవారు వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండడం ఉత్తమం. ఇవి రక్త ప్రసరణ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ప్రత్యేకించి పొగాకు సంబంధిత పదార్థాలు రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. ఫలితంగా రక్తపోటు, గుండెపోటు లాంటి సమస్యలకు లోను కావడంతో పాటు చర్మం నిగారింపును కోల్పోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.