స్విచ్‌ బోర్డులు.. ఇలా శుభ్రం చేయచ్చు!

మనం ఇంట్లో తరచూ శుభ్రం చేయని ప్రదేశాలు, వస్తువులు కొన్నుంటాయి. అందులో స్విచ్‌ బోర్డులు ఒకటి. పదే పదే వాటిని తాకడం వల్ల మన చేతులకున్న మురికి, తేమ వాటికి అంటుకొని.. కొన్నాళ్లకు అవి అపరిశుభ్రంగా తయారవుతాయి. ఇక కిచెన్‌లో ఉన్న స్విచ్‌ బోర్డులకు నూనె, జిడ్డు మరకలు....

Updated : 07 Sep 2022 20:18 IST

మనం ఇంట్లో తరచూ శుభ్రం చేయని ప్రదేశాలు, వస్తువులు కొన్నుంటాయి. అందులో స్విచ్‌ బోర్డులు ఒకటి. పదే పదే వాటిని తాకడం వల్ల మన చేతులకున్న మురికి, తేమ వాటికి అంటుకొని.. కొన్నాళ్లకు అవి అపరిశుభ్రంగా తయారవుతాయి. ఇక కిచెన్‌లో ఉన్న స్విచ్‌ బోర్డులకు నూనె, జిడ్డు మరకలు అవడం చూస్తుంటాం. ఇలాంటి వాటిని శుభ్రం చేయడానికి తెగ కష్టపడుతుంటాం. కానీ ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే మురికిగా మారిన స్విచ్‌ బోర్డులను తిరిగి మెరిపించచ్చంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

ఆఫ్‌ చేయండి!

స్విచ్‌ బోర్డులు శుభ్రం చేసే క్రమంలో ముందుగా ఇంటికి విద్యుత్తును సరఫరా చేసే మెయిన్‌ స్విచ్ను ఆఫ్‌ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే వీటిని క్లీన్‌ చేసే క్రమంలో మనం వివిధ రకాల పదార్థాలు వాడుతుంటాం.. అందులో కొన్ని ద్రావణాలు కూడా ఉండచ్చు. వీటి కారణంగా షాక్ కొట్టే ప్రమాదం ఎక్కువ. కాబట్టి మెయిన్‌ ఆఫ్‌ చేయాలి. అలాగే శుభ్రం చేసే క్రమంలోనూ చేతులకు గ్లౌజులు, కాళ్లకు స్లిప్పర్స్‌ వేసుకోవడం మరింత సురక్షితం. అంతేకాదు.. ఇంట్లో ఇతరులెవరూ మెయిన్‌ ఆన్‌ చేయకుండా చూసుకోవడమూ ముఖ్యమే! అలాగే శుభ్రం చేయడం పూర్తయ్యాక కూడా వెంటనే మెయిన్‌ ఆన్‌ చేయడం కాకుండా.. ఓ అరగంటో, గంటో ఆగడం మంచిది. తద్వారా బోర్డుపై ఉన్న తేమ పూర్తిగా ఆరిపోతుంది.

బోరాక్స్‌ పౌడర్‌తో..!

జిడ్డు మరకలు, మురికిని తొలగించడంలో బోరాక్స్‌ పౌడర్‌ సమర్థంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక బౌల్‌లో 3 టీస్పూన్ల బోరాక్స్‌ పౌడర్‌ వేసి.. అందులో 2 టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. అవసరమైతే నీళ్లు కలుపుతూ పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్విచ్‌ బోర్డుకు, స్విచ్‌లకు పూసి.. పది నిమిషాల తర్వాత టూత్‌ బ్రష్‌తో రుద్దాలి. ఆపై తడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది. ఇక్కడ నిమ్మరసానికి బదులుగా వెనిగర్‌ కూడా ఉపయోగించచ్చు.

వెనిగర్‌+నిమ్మరసం

వెనిగర్‌, నిమ్మరసం.. ఈ రెండింటినీ కలిపిన మిశ్రమంతోనూ స్విచ్‌ బోర్డులు తళతళా మెరిసిపోతాయి. ఇందుకోసం రెండు టీస్పూన్ల వెనిగర్‌, ఒక టీస్పూన్‌ నిమ్మరసం, ఒక కప్పు నీళ్లు.. ఈ మూడింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని కలుపుకోవాలి. ఇందులో టూత్‌బ్రష్‌ లేదా కాస్త గరుకుగా ఉన్న వస్త్రం ముంచి స్విచ్‌బోర్డు, స్విచ్‌లకు పూయాలి. పావుగంట తర్వాత బ్రష్‌తో రుద్దితే జిడ్డు సులభంగా వదిలిపోతుంది.. ఆఖర్లో తడి గుడ్డతో తుడిస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్‌ సోడాతో..!

ఇంట్లో ఎన్నో వస్తువుల్ని శుభ్రం చేయడానికి మనం బేకింగ్‌ సోడాను వాడుతుంటాం. అదే విధంగా స్విచ్‌ బోర్డుల్ని శుభ్రం చేయడానికీ దీన్ని ఉపయోగించచ్చు. ఇందుకోసం ఒక బౌల్‌లో కొద్దిగా బేకింగ్‌ సోడా తీసుకోవాలి. నిమ్మకాయను సగానికి కట్‌ చేసి.. దీన్ని బేకింగ్‌ సోడాలో అద్దుతూ స్విచ్‌ బోర్డుకు, స్విచ్‌లకు రుద్దాలి. తద్వారా వాటికి అంటుకున్న జిడ్డుదనం, మురికి సులభంగా వదిలిపోతాయి. చివరగా కాటన్‌ గుడ్డతో తుడిచేస్తే అవి తళతళా మెరిసిపోతాయి.

నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌..

నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ కూడా స్విచ్‌ బోర్డులపై ఉన్న జిడ్డును, మురికిని క్షణాల్లో వదిలించేస్తుంది. ఇందులోని ఎసిటోన్‌ అనే రసాయనమే ఇందుకు కారణం. ఈ క్రమంలో నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ను నేరుగా స్విచ్‌ బోర్డు, స్విచ్‌లపై పూయాలి. కాసేపటి తర్వాత తడి గుడ్డతో తుడిచేస్తే ఫలితం కనిపిస్తుంది.

టూత్‌పేస్ట్‌తో..!

దంతాల్ని మెరిపించడమే కాదు.. స్విచ్‌ బోర్డుపై పేరుకున్న జిడ్డును వదిలించడంలోనూ టూత్‌పేస్ట్‌ చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని సోడియం బైకార్బొనేట్‌ ఇందుకు కారణం. ఈ క్రమంలో కొద్దిగా టూత్‌పేస్ట్‌ను టూత్‌బ్రష్‌తో నేరుగా స్విచ్‌ బోర్డు, స్విచ్‌లపై అప్లై చేసి రుద్దాలి. ఈ క్రమంలో దానిపై పేరుకున్న నూనె మరకలు, జిడ్డుదనం, మురికి.. వంటివి వదిలిపోవడం మనం గమనించచ్చు. ఆఖర్లో తడి గుడ్డతో ఒకసారి తుడిచేస్తే టూత్‌పేస్ట్‌ అవశేషాలూ తొలగిపోతాయి.

గమనిక: ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. స్విచ్‌ బోర్డును శుభ్రం చేసేటప్పుడు ఆయా ద్రావణాలను ఎక్కువ మొత్తంలో ఉపయోగించకుండా చూసుకోవాలి. లేదంటే అవి బోర్డు, స్విచ్‌ల సందుల్లోకి, సాకెట్‌లోకి వెళ్లి.. తిరిగి పవర్‌ ఆన్‌ చేసినప్పుడు షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలా జరగకుండా జాగ్రత్తపడడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్