ఆత్మవిశ్వాసంతోనే ఆ కోరిక పెరుగుతుందట!

ఏ పనైనా నిండైన ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే పూర్తిచేయగలం.. దాని ఫలితాన్ని ఆస్వాదించగలం. శృంగారం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే వివిధ కారణాల రీత్యా ఆత్మవిశ్వాసం కొరవడి, సిగ్గు-బిడియంతో కలయికను ఆస్వాదించలేకపోతున్నామంటూ చాలా జంటలు తమవద్దకొస్తున్నాయని....

Published : 14 Apr 2023 14:08 IST

ఏ పనైనా నిండైన ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే పూర్తిచేయగలం.. దాని ఫలితాన్ని ఆస్వాదించగలం. శృంగారం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే వివిధ కారణాల రీత్యా ఆత్మవిశ్వాసం కొరవడి, సిగ్గు-బిడియంతో కలయికను ఆస్వాదించలేకపోతున్నామంటూ చాలా జంటలు తమవద్దకొస్తున్నాయని కౌన్సెలింగ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇదే వారిద్దరూ ఒకరిపై మరొకరికి నమ్మకం కోల్పోయేలా చేస్తుందని, తద్వారా వారి మధ్య అనుబంధం క్రమంగా బలహీనపడడానికి దారితీస్తుందని అంటున్నారు. అందుకే తెగే దాకా లాగకుండా.. చిన్న చిన్న చిట్కాలతో దంపతులిద్దరూ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు.

‘మనిషిక్కడ.. మనసెక్కడో..’ వద్దు!

పని చేస్తున్నంత సేపూ దాని పైనే పూర్తి దృష్టి పెడతాం.. కానీ శృంగారం దగ్గరికొచ్చే సరికి మాత్రం ‘మనిషిక్కడ.. మనసెక్కడో..’ అన్నట్లుగా చాలామంది దంపతులు వ్యవహరిస్తారంటున్నారు నిపుణులు. ఇందుకు కారణం.. సిగ్గు, బిడియం, నెర్వస్‌నెస్‌. శరీరాకృతి, బరువు, చర్మ ఛాయ, అందం.. వంటి విషయాల్లో తాను తన భాగస్వామికి నచ్చుతానో, లేదోనన్న భయంతో కొందరు అడుగు ముందుకు వేయరు. ఇలా మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు క్రమంగా మీ భాగస్వామికీ దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు స్వీకరించడం, అంగీకరించడం ముఖ్యం. ఈ స్వీయ ప్రేమే ఇద్దరి మధ్య రొమాన్స్‌ని కలకాలం కొనసాగేలా చేస్తుంది.

ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా..!

మనసు పెట్టి చేసినప్పుడే అన్ని పనుల్లాగే శృంగారాన్నీ ఆస్వాదించగలం. అయితే పని ఒత్తిడి, వ్యక్తిగత-వృత్తిపరమైన, ఇతర అనారోగ్య కారణాల వల్ల ఒక్కోసారి దానిపై ఆసక్తి ఉండకపోవచ్చు. మరి, ఆ విషయం మీ మనసులోనే ఉంచుకుంటే మీ భాగస్వామికి ఎలా తెలుస్తుంది? పైగా ఇలా అయిష్టంగా, అవతలి వారి ఒత్తిడితో అడుగు ముందుకేస్తే.. దాని వల్ల మీరు శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది క్రమంగా మీ ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీస్తుంది. కాబట్టి మీకు ఆసక్తి లేనప్పుడు.. నిర్మొహమాటంగా ఈ విషయాన్ని మీ భాగస్వామితో చెప్పడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. అలాగే దాని వెనకున్న కారణాన్ని వారికి వివరిస్తే తప్పకుండా వారు అర్థం చేసుకుంటారు. ఫలితంగా ఇద్దరి మధ్య ఎలాంటి అనుమానాలకూ తావుండదు. ఇలా ఈ విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకొని మసలుకుంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. కొంతమంది ఆసక్తి లేదంటూ పదే పదే భాగస్వామిని దూరం పెడుతుంటారు. ఇది కరక్ట్‌ కాదు. కాబట్టి మీ సమస్యను నిపుణుల దగ్గర పరిష్కరించుకుంటే శృంగార జీవితాన్ని ఆస్వాదించచ్చు.

నవ్వు.. దివ్యౌషధం!

‘నవ్వు నాలుగు విధాలుగా మేలం’టారు పెద్దలు. ఇదే నవ్వు దంపతుల్లో శృంగార సామర్థ్యాన్నీ పెంచుతుందంటున్నాయి పలు అధ్యయనాలు. ఏ జంటలైతే సంతోషంగా ఉంటారో, వారి మధ్య చనువు పెరుగుతుందని, ఇది క్రమంగా లైంగిక కోరికల్నీ పెంపొందిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. అదెలాగంటే.. ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉండే వ్యక్తి.. తమ భాగస్వామినీ ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉంచుతారట! తద్వారా వారిలో సానుకూల దృక్పథం పెరిగి.. ఇద్దరూ త్వరగా దగ్గరవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు భార్యాభర్తలిద్దరిలో ఆత్మవిశ్వాసం మరింత పెరగడమే తప్ప కోల్పోయే పరిస్థితి ఎదురవదు. ఫలితంగా లైంగిక జీవితాన్నే కాదు.. వారి జీవితంలోని ప్రతి సందర్భాన్నీ ఎంజాయ్‌ చేయగలుగుతారు.

కలిసే వ్యాయామమూ..!

భార్యాభర్తలిద్దరూ కలిసి ఎన్నో పనులు చేస్తుంటారు.. ఇంటి పనులు, ఉద్యోగం దగ్గర్నుంచి పిల్లల పెంపకం దాకా.. ఇలా రోజులో కలిసి నిర్వర్తించే ఎన్నో పనులుంటాయి. కానీ వ్యాయామం దగ్గరికొచ్చే సరికి మాత్రం.. సమయం లేదనో, ఆసక్తి లేదనో తప్పించుకుంటుంటారు. నిజానికి భార్యాభర్తలిద్దరూ కలిసి వ్యాయామం చేయడం వల్ల ఇద్దరిలోనూ లైంగిక సామర్థ్యం, ఆసక్తి పెరుగుతాయని ఓ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన చెబుతోంది. అందులోనూ ముఖ్యంగా బరువులెత్తడం, కార్డియో వ్యాయామాలు చేయడం మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. లైంగిక జీవితాన్నీ పూర్తిగా ఆస్వాదించగలుగుతారని చెబుతున్నారు.

ఇలా చేసి చూడండి!

శృంగార సమయంలో కొంతమందికి వెలుతురు ఉంటే నచ్చుతుంది.. మరికొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. ఇలాంటి అభిప్రాయ భేదాల వల్ల ఇద్దరూ ఇబ్బంది పడే బదులు తక్కువ లైటింగ్‌ ఉండేలా ఏర్పాటుచేసుకోవచ్చు. ఈ క్రమంలో సెంటెడ్‌ క్యాండిల్స్‌ని ఎంచుకుంటే.. మానసికంగానూ ఉల్లాసంగా అనిపిస్తుంది.

ఒత్తిడిని దూరం చేయడమే కాదు.. శృంగారం విషయంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సంగీతానిది ప్రత్యేక స్థానం అంటున్నారు నిపుణులు. దీనివల్ల శరీరం, మనసు.. రెండూ ఉత్తేజితమవుతాయి.

అలాగే శృంగారం విషయంలో మీ మనసులో ఉన్న ఆలోచనల్ని మీ భాగస్వామితో పంచుకుంటూనే.. వారి మనసులో ఏముందో తెలుసుకొని మసలుకోవడం అన్ని విధాలా మేలు చేస్తుంది.

ఇక వీటన్నింటితో పాటు శృంగారం విషయంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలన్నా, ఇద్దరి మధ్య అనుబంధం పెంచుకోవాలన్నా.. కౌన్సెలింగ్‌ నిపుణుల సలహాలూ మేలు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని