SAD: నలుగురిలోకి వెళ్లాలంటే భయమా?

ఇలా నలుగురిలోకి వెళ్లడానికి, నలుగురితో మాట్లాడడానికి భయపడే స్థితిని ‘సోషల్‌ యాంగ్జైటీ డిజార్డర్‌ (SAD)’/‘సోషల్‌ ఫోబియా’ అంటారు. టీనేజ్‌ వయసు నుంచి ప్రారంభమయ్యే ఈ మానసిక సమస్య కారణంగా.. మన రోజువారీ జీవనశైలి, పనులపై ప్రతికూల....

Published : 01 Sep 2022 14:20 IST

ప్రణతి ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది.. కానీ ప్రతిసారీ గ్రూప్‌ డిస్కషన్‌ రౌండ్‌లోనే వెనుతిరగాల్సి వస్తోందామె. కారణం.. భయంతో నలుగురిలో మాట్లాడలేకపోవడం.

శ్రీనిధి ఎలాగోలా ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించినా.. తన ఆలోచనల్ని బృందంతో కలిసి పంచుకోవడానికి బిడియపడుతుంటుంది. దాంతో కెరీర్‌లో ఎదగలేకపోతోంది.

ఇలా నలుగురిలోకి వెళ్లడానికి, నలుగురితో మాట్లాడడానికి భయపడే స్థితిని ‘సోషల్‌ యాంగ్జైటీ డిజార్డర్‌ (SAD)’/‘సోషల్‌ ఫోబియా’ అంటారు. టీనేజ్‌ వయసు నుంచి ప్రారంభమయ్యే ఈ మానసిక సమస్య కారణంగా.. మన రోజువారీ జీవనశైలి, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో అవకాశాల్ని మిస్సవుతామంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని ఆదిలోనే పరిష్కరించుకుంటే భవిష్యత్తులో సమస్య ఉండదంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

నలుగురిలోకి వెళ్లడానికి భయపడడం, అసౌకర్యంగా ఫీలవడం వల్ల బృందంతో కలిసి చేయాల్సిన పనులు, ఎంజాయ్‌మెంట్‌ని మిస్సవుతామంటున్నారు నిపుణులు. అంతేకాదు.. స్కూల్‌/కాలేజీ/పని ప్రదేశం/ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. అటు సత్సంబంధాలనూ పెంచుకోలేం.. ఇటు బోలెడన్ని అనుభవాల్నీ పొందలేం. తద్వారా ఒక రకమైన ఒంటరితనం ఆవహిస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, నలుగురూ తమను ఏ విధంగా జడ్జ్‌ చేస్తారోనన్న భయం.. ఇలా మనసంతా వీటి చుట్టూనే తిరుగుతూ ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టలేం.

అసలెందుకిలా?!

సోషల్‌ ఫోబియాకు ఇదీ కచ్చితమైన కారణం అని చెప్పలేమంటున్నారు నిపుణులు. అయితే మన జీవితంలో జరిగే కొన్ని చెడు సంఘటనలు.. ఉదాహరణకు - శారీరక, మానసిక వేధింపులు, అత్యాచారానికి గురవడం, ఇంట్లో ఎప్పుడూ గొడవలతో కూడిన వాతావరణం ఉండడం, కొంతమందిలో వంశపారంపర్యంగానూ ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాదు.. పిల్లల్ని అతిగా అదుపులో పెట్టడం, అతి సురక్షితంగా పెంచడం వల్ల కూడా వారిలో ఈ తరహా సమస్య వస్తుందట! ఇక దీని తాలూకు లక్షణాలు 13 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఒక్కొక్కటిగా మొదలవుతాయంటున్నారు నిపుణులు. వాటినెలా పసిగట్టాలంటే..!

అరచేతులు, అరికాళ్లలో విపరీతమైన చెమటలు పుట్టడం..

భయంతో వణుకు పుట్టడం, మాటలు తడబడడం..

గుండె కొట్టుకునే వేగం పెరగడం..

ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు.. వారం, పది రోజుల ముందు నుంచే దాని గురించి ఆందోళన చెందడం..

ఒకవేళ కార్యక్రమంలో పాల్గొన్నా.. వెనకవెనకే ఉండిపోవడం.. ఈ క్రమంలో తమను ఇతరులు కనిపెడతారేమోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది.

భయం, నెర్వస్‌నెస్‌తో.. ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోవడం, నలుగురిలో తినలేకపోవడం, షాపింగ్‌కి వెళ్లలేకపోవడం, ఆఖరికి పబ్లిక్‌ టాయిలెట్స్‌/విశ్రాంతి గదుల్ని వాడుకోవడానికీ వెనకాడడం..

ఈ చిట్కాలతో ఫలితం..!

అయితే ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే మాత్రం సోషల్‌ ఫోబియాగా అనుమానించి.. వెంటనే మానసిక వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారు చేయించే కొన్ని రకాల థెరపీలు, కౌన్సెలింగ్‌తో పాటు మన జీవనశైలిలోనూ పలు మార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు.

యాంగ్జైటీని ప్రేరేపించే కెఫీన్‌ సంబంధిత పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ క్రమంలో కాఫీ, చాక్లెట్‌, సోడా.. వంటి వాటిని తీసుకోకూడదు.

సోషల్‌ ఫోబియా వల్ల ఒక దశలో నిద్ర కరువవుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ నిద్రలేమి వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందంటున్నారు. కాబట్టి టెన్షన్స్‌ ఏవీ లేకుండా హాయిగా నిద్ర పట్టాలంటే.. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు దూరంగా ఉండడం, వ్యాయామాలు చేయడం.. వంటి చిన్న చిన్న చిట్కాల్ని పాటించాలి.

టెన్షన్‌ పడితే గత చేదు జ్ఞాపకాలన్నీ మెదడును తొలిచేస్తుంటాయి. కాబట్టి ఒత్తిడిగా, భయంగా అనిపించినప్పుడు కాసేపు ధ్యానంపై ధ్యాస పెట్టండి. శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి.. తద్వారా ఫలితం ఉంటుంది.

నలుగురితో కలవడానికి భయపడితే జీవితంలో ఏదీ సాధించలేం. కాబట్టి దీన్ని క్రమంగా అధిగమించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మన ఫ్రెండ్స్‌ సర్కిల్‌ని పెంచుకుంటూ పోవాలి. మనసులోని నెగెటివ్‌ ఆలోచనల్ని పక్కన పెట్టి.. మనకు తెలిసిన వారు, బంధువులు, ఇరుగుపొరుగు వారు.. ఇలా ఒక్కొక్కరితో కమ్యూనికేషన్‌ని పెంచుకుంటూ పోతే.. క్రమంగా మార్పు కనిపిస్తుంది.

స్వీయ ప్రేమతో మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా అధిగమించచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మనలోని లోపాల్ని పక్కన పెట్టి.. ప్రత్యేకతల్ని గుర్తించాల్సి ఉంటుంది. తద్వారా మనకు ఏది ఇష్టమో దానిపైకి మనసు మళ్లుతుంది. ఇది క్రమంగా సోషల్‌ ఫోబియానూ దూరం చేస్తుందట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని