వార్డ్‌రోబ్ సర్దుతున్నారా?

ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే హడావిడిలో వార్డ్‌రోబ్‌లో చేతికందిన డ్రస్సు తీసుకుని ధరించడం, తిరిగి వాటిని ఉతికిన తర్వాత మడతపెట్టకుండానే అందులో పడేయడం.. మనలో చాలామందికి అలవాటే! అయితే ఇది మొదట్లో బాగానే ఉన్నా.. నాలుగైదు రోజులు పోయాక అల్మరా....

Published : 18 Oct 2022 20:54 IST

ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే హడావిడిలో వార్డ్‌రోబ్‌లో చేతికందిన డ్రస్సు తీసుకుని ధరించడం, తిరిగి వాటిని ఉతికిన తర్వాత మడతపెట్టకుండానే అందులో పడేయడం.. మనలో చాలామందికి అలవాటే! అయితే ఇది మొదట్లో బాగానే ఉన్నా.. నాలుగైదు రోజులు పోయాక అల్మరా అంతా చిందరవందరగా మారిపోతుంది. దాంతో ఏ డ్రస్సు ఎక్కడుందో అర్థం కాక దాన్ని వెతుక్కోవడానికి మరింత టైమ్‌ వేస్ట్‌! ఇంకొంతమందైతే ఉపయోగించని దుస్తుల్ని కూడా అందులోనే పడేస్తుంటారు. మరి, ఇలా కాకుండా ఉపయోగించే దుస్తులతోనే వార్డ్‌రోబ్‌ని పొందికగా సర్దుకోవాలంటే ఈ చిన్నపాటి టిప్స్‌ పాటిస్తే సరి!

వేటికవే అమర్చండి!

కొంతమంది సమయం లేక డ్రస్సులు, చీరలు, జీన్సులు.. ఇలా అన్నీ ఒకే చోట అమర్చుతుంటారు. తద్వారా ఒకటికొకటి సరిగ్గా దొరకదు. అందుకే మడతపెట్టేటప్పుడే వేటికవే జతగా ఉంచి.. వాటిని విడివిడిగా అల్మరాలో అమర్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు చీరలన్నీ ఒక వరుసలో అమర్చుకోవచ్చు.. ఇక దానికి మ్యాచింగ్‌ బ్లౌజ్‌, పెటీకోట్స్‌.. వంటివి ఆ పక్కనే మరో వరుసలో అమర్చచ్చు.. లేదంటే చీరలోనే దానికి సంబంధించిన బ్లౌజ్‌, పెటీకోట్స్‌ని పెట్టి.. ఆ మొత్తాన్ని వార్డ్‌రోబ్‌లో సర్దుకుంటే వెతికే పనిలేకుండా కావాల్సినవి సులభంగా దొరుకుతాయి. ఇతర డ్రస్సులు, జీన్స్‌-టాప్స్‌.. వంటివాటికీ ఈ నియమం వర్తిస్తుంది. అలాగే మీరు రోజూ ఉపయోగించుకునే దుస్తులు ముందు వరుసలో అమర్చుకొని.. కాస్త అరుదుగా ఉపయోగించే వాటిని వెనకవైపు అమర్చుకోవడం మంచిది.

వారినీ భాగం చేయండి!

ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి దుస్తులూ ఒకే అల్మరాలో.. అది కూడా ఒకే షెల్ఫ్‌లో అమర్చే వారూ లేకపోలేదు. తద్వారా మీరెంత నీట్‌గా సర్దినా.. ఎదుటివారు చిందరవందరగా పడేసే అవకాశముంది.. పైగా ఇలా అందరి దుస్తులూ ఒకే ర్యాక్‌లో పెడితే అంత సులభంగా దొరకవు కూడా! కాబట్టి ఎవరు వేసుకునే దుస్తులు వారికి అందుబాటులో ఉండేలా వేర్వేరు ర్యాక్స్‌లో అమర్చాలి. అయినా కూడా ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు పదే పదే అల్మరాను చిందరవందరగా పడేస్తే.. వాటిని సర్దడానికి మీకు సమయం ఉండకపోవచ్చు. అందుకే వార్డ్‌రోబ్‌లో ఎవరి షెల్ఫ్‌ను వారు నీట్‌గా ఉంచుకోవాలన్న విషయం వారికి చెప్పి.. ముందునుంచే వారితో ఈ అలవాటు చేయించాలి. తద్వారా మీకు అదనపు పనీ తప్పుతుంది. దుస్తుల అల్మరా నీట్‌గానూ ఉంటుంది.

చిన్నదైనా ఇలా పొందికగా..!

చాలామంది వార్డ్‌రోబ్‌ విశాలంగా, పెద్దగా ఉంటేనే దాన్ని అందంగా సర్దుకోవచ్చు అన్న భావనలో ఉంటారు. కానీ చిన్నగా ఉండే అల్మరాలను కూడా నీట్‌గా అమర్చుకోవచ్చు. అయితే అందుకోసం హ్యాంగర్స్‌ ఉపయోగిస్తే స్థలం వృథా కాకుండా జాగ్రత్తపడచ్చు. ప్యాంట్స్‌-షర్ట్స్‌, చీరలు.. వంటి దుస్తుల్ని హ్యాంగర్స్‌కి తగిలించి అందులోని రాడ్‌కి వేలాడదీయచ్చు. అలాగే టర్కీ టవల్స్‌ వంటి కొన్ని దుస్తులు మడతపెట్టినా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అలాంటప్పుడు వాటిని మిగతా వాటితో కలిపి అమర్చితే అందులోని స్థలమంతా వృథా అవుతుంది. అందుకే వాటిని సెపరేట్‌గా ఒక పక్కకు పెట్టేయాలి.. లేదంటే వార్డ్‌రోబ్‌ బాస్కెట్స్‌ కూడా దొరుకుతాయి.. అందులో వాటిని పెట్టి అల్మరా పైన కూడా అమర్చుకోవచ్చు. ఇలా వార్డ్‌రోబ్‌ యాక్సెసరీస్‌తో చిన్న వార్డ్‌రోబ్‌ని పొందికగా సర్దుకుంటే ఇటు నీట్‌గా కనిపించడంతో పాటు అటు సౌకర్యవంతంగానూ ఉంటుంది.

సీజన్‌ను బట్టి..

వార్డ్‌రోబ్‌ చిందరవందరగా కనిపించకుండా నీట్‌గా ఉండాలంటే సీజన్‌ను బట్టి దాన్ని సర్దుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో సింథటిక్‌, సిల్క్‌.. వంటి తేలికపాటి దుస్తులైతే వర్షంలో తడిసినా త్వరగా ఆరిపోతాయి. కాబట్టి వాటిని హ్యాండీగా పెట్టుకొని.. మిగతా వాటిని అరుదుగా తెరిచే షెల్ఫ్‌లో పెట్టుకోవాలి. తద్వారా మనం రోజూ ఉపయోగించే షెల్ఫ్‌ని సర్దుకుంటే సరిపోతుంది. అలాగే కొంతమంది పాతబడిపోయిన స్వెట్టర్లు, శాలువాలను కూడా ఎప్పుడైనా ఉపయోగపడకపోతాయా అన్న ఉద్దేశంతో వార్డ్‌రోబ్‌లోనే ఉంచేస్తారు. తద్వారా పాత దుస్తులు, కొత్త దుస్తులతో వార్డ్‌రోబ్‌ అంతా కిక్కిరిసినట్లు కనిపిస్తుంది. కాబట్టి మీకు వద్దనుకున్న వాటిని ఎప్పటికప్పుడు వేరు చేసి అవసరార్థులకు అందించచ్చు.

కనీసం వారానికోసారైనా..!

అల్మరాలో నుంచి కావాల్సిన బట్టలు ఉపయోగించుకొని తిరిగి వాటిని మడతపెట్టి అందులో పెట్టినా ఒక్కోసారి అంతా చిందరవందరగా కనిపిస్తుంటుంది. అంతేకాదు.. రోజూ అందులో బట్టల్ని సర్దే ఓపిక, తీరిక మనకు ఉండకపోవచ్చు. అందుకే కనీసం వారానికోసారైనా లేదంటే పదిహేను రోజులకోసారైనా ఒక గంట సమయం కేటాయించి అందులో అవసరం లేని దుస్తుల్ని బయటికి తీసి, అవసరం ఉన్న వాటిని పొందికగా సర్దితే అటు నీట్‌గా కనిపిస్తుంది.. ఇటు సర్దడమూ సులువవుతుంది.
ఇక వీటితో పాటు రోజూ ఉపయోగించే బ్యాగ్స్‌, జ్యుయలరీ, యాక్సెసరీస్‌.. వంటివన్నీ వేటికవే అల్మరాలో ఆయా ర్యాక్స్‌లో అమర్చుకుంటే నీట్‌గా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్