Updated : 10/08/2021 15:34 IST

పాదాల నుంచి దుర్వాసన వస్తోందా? 

ఈ వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం. బ్యాగులో గొడుగు పెట్టుకోవడం మర్చిపోయినప్పుడు, రెయిన్‌ కోట్‌/ రెయిన్‌ షూస్‌ వేసుకోకుండా బయటికి వెళ్లినప్పుడు.. వానకు తడిసి ముద్దైన అనుభవాలు మనకు కొత్తేమీ కాదు. ఇక దీనికి తోడు రోజూ ఇంటి పనులు, వంట పనుల రీత్యా మన పాదాలు ఎక్కువ సమయం నీళ్లలోనే నానుతుంటాయి. ఫలితంగా పాదాల్లో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు తలెత్తి.. దుర్వాసన రావడం, అసౌకర్యానికి గురవడం.. చాలామందికి అనుభవమే! ఇదనే కాదు.. ఈ కాలంలో అధికంగా ఉండే హ్యుమిడిటీ, పాదాల పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం వహించడం కూడా ఈ సమస్యకు కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. మరి, వీటిని దూరం చేసుకొని ఆరోగ్యకరమైన, అందమైన పాదాలను సొంతం చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలని చెబుతున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

నిర్లక్ష్యం వద్దు!

స్నానం చేసేటప్పుడు పాదాలను శుభ్రపరచుకునే విషయంలో చాలామంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంటారు. అంటీ ముట్టనట్టుగా వాటిని శుభ్రం చేసుకుంటుంటారు. కానీ పదే పదే వర్షపు నీటితో/పనుల రీత్యా సాధారణ నీటితో తడిసిన పాదాలు త్వరగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు గురవుతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే తరచూ వాటిని శుభ్రం చేసుకోవడం ముఖ్యమంటున్నారు. ఈ క్రమంలో ఒంటిని ఎలాగైతే రుద్దుకొని శుభ్రం చేసుకుంటామో.. పాదాల్ని సైతం యాంటీ బ్యాక్టీరియల్‌ సబ్బుతో రుద్దుకొని క్లీన్‌ చేసుకోవాలి. ముఖ్యంగా కాలి వేళ్ల మధ్యలో పేరుకున్న క్రిముల్ని పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. ఆపై పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా పాదాల్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడచ్చు.. రాకుండానూ నివారించుకోవచ్చు.

నానబెట్టండి..!

పాదాలపై చేరిన దుమ్ము-ధూళి, బురద.. వంటివి సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా ఈ కాలంలో పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు ఇంట్లో చేసుకునే పెడిక్యూర్‌ ఈ సమస్యకు సత్వరమే చెక్‌ పెడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక పెడిక్యూర్‌ టబ్‌లో సగం వరకు గోరువెచ్చటి నీళ్లు తీసుకొని.. అందులో కొన్ని గులాబీ రేకలు, స్లైసుల్లా కట్‌ చేసిన నిమ్మకాయ ముక్కలు, కొద్దిగా ఎప్సం సాల్ట్‌, కొన్ని చుక్కల రోజ్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో పాదాలను 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆపై శుభ్రమైన నీటితో రుద్ది కడిగి పూర్తిగా ఆరనివ్వాలి. ఇదే విధంగా వెనిగర్‌, అత్యవసర నూనెలతో కూడా పాదాలకు పెడిక్యూర్‌ ట్రీట్‌మెంట్‌ చేయచ్చు. ఫలితంగా పాదాల్లో దుర్వాసన తొలగిపోవడమే కాదు.. సువాసన వెదజల్లుతాయి.

డీటాక్స్‌ చేయాల్సిందే!

డీటాక్సిఫికేషన్‌ (విషతుల్యాలను తొలగించడం) శరీరానికి/చర్మానికే కాదు.. పాదాలకూ అవసరమే అంటున్నారు నిపుణులు. ఇది కూడా ఇంట్లోనే వారానికోసారి చేసుకోవడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో పెడిక్యూర్‌ చేసుకున్న తర్వాత పాదాల్ని పొడిగా ఆరనిచ్చి.. కొన్ని సహజసిద్ధమైన ప్యాక్స్‌/మాస్క్‌లు వేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముల్తానీ మట్టి, యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌, ఎప్సం సాల్ట్‌.. వంటి పదార్థాలతో మాస్కులు తయారుచేసుకొని పాదాలకు పైన, అడుగున, వేళ్ల మధ్యలో అప్లై చేసుకోవాలి. ఇలాగే ఓ అరగంట పాటు రిలాక్సై.. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని పాదాల్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా కాకపోతే.. సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన డీటాక్సింగ్‌ ప్యాడ్స్‌ కూడా బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల పాదాల్లో దుర్వాసన తొలగిపోవడంతో పాటు పరిమళభరింతగానూ మారతాయి.

పౌడర్‌తో ఫలితం!

పాదాలు నీటిలో తడిసినా/తడవకపోయినా.. చెమట/అధిక హ్యుమిడిటీ కారణంగా కూడా పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇందుకు ప్రధాన కారణం.. షూస్‌ ధరించడమే అంటున్నారు నిపుణులు. అయితే ఓపెన్‌ ఫుట్‌వేర్‌ ధరించే అవకాశం లేని వారు నిరంతరాయంగా షూస్‌ ధరించడం తప్పనిసరి. అలాంటివారు ముందుగా పాదాల్ని పొడిగా ఆరబెట్టుకొని యాంటీ ఫంగల్‌ టాల్కమ్‌ పౌడర్‌ వేసుకోవాలి.. ఆపై షూస్‌ ధరించాలి.. ఇక చిన్నసైజు పౌడర్‌ డబ్బాను ఎప్పుడూ బ్యాగ్‌లో వెంటే ఉంచుకొని అప్పుడప్పుడూ పాదాలకు రాసుకోవడం వల్ల సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. కచ్చితంగా షూసే ధరించాలన్న నియమం లేని వారు.. ఈ కాలంలో ఓపెన్‌ ఫుట్‌వేర్‌ ఎంచుకుంటే ఫలితం ఉంటుంది.

ఇవీ ముఖ్యమే!

* పాదాలు పదే పదే వర్షపు నీటితో తడవడం వల్ల అలర్జీలు రాకుండా ఉండాలంటే పాదాల్ని మాయిశ్చరైజ్‌ చేయడమూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఫుట్‌ క్రీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. స్నానం చేశాక, పడుకునే ముందు.. ఇలా రోజుకు రెండుసార్లు పాదాలకు క్రీమ్‌ రాసుకోవాలి.

* కాలి వేళ్ల గోళ్లు ఎప్పటికప్పుడు ట్రిమ్‌ చేసుకోవడం ముఖ్యం. తద్వారా అందులోకి మురికి చేరి దుర్వాసన రాకుండా, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

* పాదాలకు కాటన్‌ లేదా ఊల్‌ సాక్స్‌ వాడాలి.. అది కూడా రోజూ వాటిని మారుస్తూ ఉండాలి.

* క్లోజ్‌డ్‌ షూస్‌ ధరించే వారు.. వాటి నుంచి దుర్వాసన రాకుండా, తద్వారా పాదాలు ఇన్ఫెక్షన్‌కి గురవకుండా ఉండాలంటే.. ఆ షూస్‌లో టీబ్యాగ్స్‌ అమర్చుకోవచ్చు. అదీ కాదంటే సెంటెడ్‌ షూ ఇన్సర్ట్స్‌, మెడికేటెడ్‌ ఇన్‌సోల్స్‌.. వంటివి అమర్చుకుంటే అటు సౌకర్యవంతంగా, ఇటు దుర్వాసన రాకుండా ఉంటుంది.

* పాదాల చర్మంపై చేరిన మృతకణాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా గోరువెచ్చటి నీటితో పాదాల్ని కాసేపు నానబెట్టుకొని.. ఆపై ప్యూమిస్‌ స్టోన్‌తో మృదువుగా రుద్దుకుంటే సరి! ఈ ప్రక్రియ ద్వారా పాదాలు కోమలంగా, తాజాగా మారతాయి. ఫలితంగా పాదాల నుంచి దుర్వాసన వచ్చే ఆస్కారమే ఉండదు.

వర్షాకాలంలో పాదాల దుర్వాసన సర్వసాధారణమైన సమస్యే అయినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, అధిక చెమట.. వంటివి దాడి చేస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం మర్చిపోవద్దు. తద్వారా సమస్యను ఆదిలోనే తగ్గించుకోవచ్చు.

మరి, ఈ వర్షాకాలంలో మీరు మీ పాదాల్ని ఎలా సంరక్షించుకుంటున్నారు? దుర్వాసన రాకుండా ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి. మీరిచ్చే సలహాలు ఎంతోమందికి చిట్కాల్లా ఉపయోగపడచ్చు..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని