ఇలా చేస్తే ఆ మచ్చలు మాయం!

ఆడవారి సౌందర్యంలో కేశాలదీ ప్రత్యేక స్థానమే. అందుకే వాటిని తమకు నచ్చినట్లుగా, నప్పినట్లుగా తీరైన ఆకృతిలో మలచుకోవాలని ఆరాటపడుతుంటారు. అంతేనా.. విభిన్న హెయిర్ డైలతో కేశ సౌందర్యాన్ని పెంపొందించడం ఈ మధ్య కాలంలో....

Published : 10 Jun 2023 19:48 IST

ఆడవారి సౌందర్యంలో కేశాలదీ ప్రత్యేక స్థానమే. అందుకే వాటిని తమకు నచ్చినట్లుగా, నప్పినట్లుగా తీరైన ఆకృతిలో మలచుకోవాలని ఆరాటపడుతుంటారు. అంతేనా.. విభిన్న హెయిర్ డైలతో కేశ సౌందర్యాన్ని పెంపొందించడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిపోయింది. పండగలంటూ, పార్టీలంటూ, ఇతర ప్రత్యేక సందర్భాలంటూ.. ఇలా ఆయా వేడుకలకు తగినట్లుగా జుట్టు అందాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. అయితే కొన్ని రకాల డైలు వేసుకునేటప్పుడు ఒక్కోసారి చర్మంపై అవి అంటుకున్న ప్రదేశంలో మచ్చలాగా పడుతుంటాయి. ఆపై ఎంత రుద్దినా తొలగిపోక అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. మరి, ఇలాంటి డై మచ్చల్ని వదిలించడానికి కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు మన ఇంట్లోనే అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకొని ఫాలో అయిపోతే ఎలాంటి అసౌకర్యమూ ఎదురవదు.

సాధారణంగా హెయిర్ డై వేసుకునేటప్పుడు నుదురు, మెడ మీద డై మచ్చలు ఏర్పడుతుంటాయి. అయితే ఇవి పడకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలంటే డై వేసుకోవడానికి ముందుగానే ఆయా భాగాల్లో పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. ఒకవేళ జెల్లీ రాసుకోవడం మర్చిపోతే.. డై శుభ్రం చేసుకున్న తర్వాత ఆ మచ్చల్ని తొలగించుకోవాలంటే చిన్నపాటి చిట్కాల్ని పాటిస్తే సరిపోతుంది.

రిమూవర్‌తో..

ముఖంపై మేకప్‌ని, గోళ్లపై నెయిల్ పాలిష్‌ని తొలగించుకోవడానికి రిమూవర్లు ఎంతగా ఉపయోగపడతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి, వాటితో మరో ప్రయోజనం కూడా ఉందండోయ్..! అదేంటంటారా.. హెయిర్ డై వల్ల చర్మంపై పడిన మచ్చల్ని తొలగించడానికి కూడా మేకప్ రిమూవర్, నెయిల్ పాలిష్ రిమూవర్‌ని ఉపయోగిస్తారు. ఇందుకోసం కొద్దిగా మేకప్ రిమూవర్‌ని చిన్న కాటన్ బాల్‌పై వేసి మచ్చ పడిన చోట ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా రుద్దాలి. తద్వారా మచ్చ తొలగిపోతుంది. ఒకవేళ మీరు ఉపయోగించే రిమూవర్ ఆల్కహాల్ తరహాది అయితే దాన్ని ఉపయోగించాక ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కొన్ని చుక్కల నెయిల్ పాలిష్ రిమూవర్‌ని కాటన్ బాల్‌పై వేసి మచ్చ పడిన చోట కాస్త వత్తుతూ రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే మచ్చ తొలగిపోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. నెయిల్ పాలిష్ రిమూవర్‌ని చర్మంపై ఎక్కువ సమయం ఉండకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఇది ఎక్కువసేపు చర్మంపై ఉండడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. అలాగే దీన్ని కళ్లకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.

బేకింగ్ సోడాతో..

సౌందర్య పరిరక్షణలో బేకింగ్ సోడా ఉపయోగించడం పరిపాటే. ఫేషియల్స్, స్క్రబ్స్ తయారీలో వాడే ఈ పదార్థంతో హెయిర్ డై వల్ల చర్మంపై పడిన మచ్చల్ని సులభంగా తొలగించుకోవచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడా, డిష్‌వాషింగ్ లిక్విడ్‌లను సమపాళ్లలో తీసుకొని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని మచ్చ పడిన చోట అప్త్లె చేసి చేత్తో లేదంటే కాటన్ ప్యాడ్‌తో నెమ్మదిగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేస్తే మచ్చ తొలగిపోతుంది.. ఈ మిశ్రమం వల్ల చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తపడచ్చు.

టూత్‌పేస్ట్‌తో...

దంతాల్ని శుభ్రం చేసుకోవడానికి వాడే టూత్‌పేస్ట్ వెండి వస్తువుల్ని మెరిపించడంలోనూ ఉపయోగపడుతుంది. అంతేనా.. డై వల్ల చర్మంపై పడిన మచ్చల్ని కూడా ఇది తొలగిస్తుంది. ఇందుకోసం జెల్ కాని టూత్‌పేస్ట్‌ని కొద్దిగా తీసుకొని దాన్ని మచ్చ పడిన చోట అప్త్లె చేయాలి. ఆపై కాటన్ ప్యాడ్ లేదా సాఫ్ట్ టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా పది నిమిషాల పాటు రుద్దాలి. ఇప్పుడు గోరువెచ్చటి నీటిలో ముంచిన కాటన్ వస్త్రంతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తే మచ్చ తొలగిపోతుంది.

పెట్రోలియం జెల్లీతో..

పెట్రోలియం జెల్లీ చర్మంపై హెయిర్ డై మచ్చలు పడకుండా కాపాడడం మాత్రమే కాదు.. ఒకవేళ పడినా వాటిని తొలగించడంలోనూ సహాయపడుతుంది. దీనికోసం కాస్త పెట్రోలియం జెల్లీని మచ్చ పడిన చోట రాసి రుద్దాలి. ఈ క్రమంలో జెల్లీ డై రంగులో మారడం మనం గమనించవచ్చు. ఇది పూర్తిగా డై రంగులోకి వచ్చిన తర్వాత గోరువెచ్చటి నీటిలో ముంచి పిండిన కాటన్ వస్త్రంతో దాన్ని తుడిచేయాలి. ఫలితంగా మచ్చ మాయమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని