Published : 14/10/2022 13:49 IST

Monsoon Tips: ఇంట్లో తేమ లేకుండా..!

వర్షాకాలంలో ఇంట్లో తేమ పెరిగిపోయి.. దాని ప్రభావం అటు వస్తువులపై, ఇటు ఆరోగ్యంపై పడుతుంది. దీనివల్ల గోడలపై ఫంగస్‌ పెరగడం, వస్తువులు బూజెక్కడం.. ఈ సూక్ష్మ క్రిములు గాల్లోకి చేరి శ్వాస సంబంధిత సమస్యలు, చర్మ అలర్జీ.. వంటి సమస్యలకు దారితీయడం.. ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవడానికే చాలామంది ‘డి-హ్యుమిడిఫయర్స్‌’ ఉపయోగిస్తుంటారు. కానీ ఇది కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. మరి, ఇలాంటప్పుడు ఈ సహజసిద్ధమైన చిట్కాలు పాటించి ఇంట్లోని తేమను దూరం చేసుకోవచ్చంటున్నారు.

✬ ఇంట్లోని తేమను దూరం చేసుకోవాలంటే.. గాలి ధారాళంగా ప్రసరించేలా జాగ్రత్తపడాలి. ఇందుకోసం కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం ముఖ్యం.

✬ ఈ కాలంలో ఇంట్లో మొక్కలు పెంచుకునే వారు పెరిగిపోయారు. అయితే ఇవి కూడా వాతావరణంలోకి తేమను విడుదల చేస్తాయి. వీటివల్ల ఇంట్లో హ్యుమిడిటీ స్థాయులు పెరుగుతాయి. కాబట్టి వర్షాకాలంలో ఇంట్లో మొక్కలు లేకుండా చూసుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

✬ ఒకవేళ ఇండోర్‌ మొక్కలు పెంచుకోవాలనుకునే వారు కలబంద, స్నేక్‌ ప్లాంట్‌, కాక్టీ, స్పైడర్‌ ప్లాంట్‌, పీస్‌ లిల్లీ.. వంటివి ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి వాతావరణంలో తేమ స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

✬ ఇంటి మొత్తంలో ఎక్కువ తేమగా ఉండే వాతావరణం ఏది అంటే.. అది బాత్‌రూమే! ఎందుకంటే ఈ గదిలో వెంటిలేషన్‌ సరిగ్గా లేకపోవడమే కారణం. అయితే ఈ సమస్యను తగ్గించడానికి షవర్‌ని తక్కువగా ఉపయోగించడం లేదంటే షవర్‌ చేస్తున్నప్పుడు కూడా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ని ఆన్‌లోనే ఉంచడం.. వంటి ప్రత్యామ్నాయాలు పాటించాలి.

✬ కిచెన్‌లో ఉపయోగించే టవల్స్‌, మనం వాడే టవల్స్‌, ఇతర దుస్తులు.. వంటివన్నీ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ తడిగా ఉంటే వాటిని ఇంట్లో కాకుండా ఆరుబయట ఆరేయాలి.

✬ ఇంటి మూలలు, అల్మరా మూలల్లో తేమ ఎక్కువగా చేరి అక్కడ ఫంగస్‌ పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఆయా ప్రదేశాల్లో రాక్‌సాల్ట్‌, బేకింగ్‌ సోడా.. వంటి సహజసిద్ధమైన పదార్థాల్ని మూటగట్టి అమర్చడం వల్ల ఫలితం ఉంటుంది.

✬ ఇక బ్యాగ్స్‌, షూస్‌.. వంటి చిన్న చిన్న వస్తువుల్లో ఉన్న తేమను తొలగించడానికి సిలికా జెల్ ప్యాకెట్లను ఉపయోగించచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని