Updated : 14/03/2023 19:29 IST

ఈ ఐస్‌క్రీమ్ తిన్నా బరువు పెరగరు..!

చల్లచల్లని నోరూరించే ఐస్‌క్రీమ్ తినాలని ఎవరికి అనిపించదు చెప్పండి..! అందులోనూ సమ్మర్‌లో.. అయితే సాధారణంగా బయట తయారుచేసే ఐస్‌క్రీమ్స్‌లో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్లుండే ఆహారం తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకునేవారు బయట తయారుచేసే షుగర్ లోడెడ్ ఐస్‌క్రీమ్స్‌ని తినడం వల్ల మొదటికే మోసం వస్తుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఐస్‌క్రీమ్ మానేయాలా.. అంటారా? ఏం అక్కర్లేదు. చక్కెర వాడకుండా ఇంట్లోనే తయారుచేసే షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్‌ను తీసుకుంటే అటు ఐస్‌క్రీమ్ తినాలన్న కోరికా తీరుతుంది.. ఇటు బరువు పెరుగుతామన్న భయమూ ఉండదు.. అలాంటి ఓ షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్ రెసిపీనే ఇది..!

కావాల్సినవి

స్ట్రాబెర్రీలు - 6

అరటి పండ్లు - 10

గింజలు - 1 టేబుల్‌స్పూన్ (గుమ్మడి గింజలు, అవిసె గింజలు కలిపి తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించడంలో తోడ్పడతాయి.)

వాల్‌నట్స్ - 1 టేబుల్‌స్పూన్

వెన్న తొలగించిన పెరుగు - 5 కప్పులు

తేనె - 6 టీస్పూన్లు

ఐస్‌క్రీమ్ మౌల్డ్ సెట్ - 6 మౌల్డ్స్ ఉన్నది తీసుకోవాలి.

తయారీ

ముందుగా పండ్లు, గింజలు, వాల్‌నట్స్.. అన్నీ మిక్సీ జార్‌లోకి తీసుకొని నీళ్లు పోసుకుంటూ అన్నీ చిన్న చిన్న ముక్కలయ్యేలా (స్మూతీలా కాకుండా) మిక్సీ పట్టుకోవాలి.

ఇప్పుడు ఐస్‌క్రీమ్ మౌల్డ్స్‌లలో సగం వరకు పెరుగు నింపి, అందులో ఒక్కో టీస్పూన్ చొప్పున తేనె వేసి.. దానిపైన మిక్సీ పట్టుకున్న పండ్ల మిశ్రమంతో మౌల్డ్స్‌ని నింపాలి.

ఆపై మౌల్డ్ స్టిక్ సహాయంతో ఒక్కో మౌల్డ్‌లోని మిశ్రమాన్ని బాగా కలిపి మౌల్డ్‌ని బిగించేయాలి.

ఈ సెట్‌ని డీప్ ఫ్రీజర్‌లో పెట్టి అది పూర్తిగా గడ్డకట్టేంత వరకూ ఉంచాలి.

అంతే.. చల్లచల్లగా, ఎంతో టేస్టీగా, నోరూరించే ఐస్‌క్రీమ్ తయారైనట్లే..! దీన్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ తయారుచేసుకొని తినాలనిపించడం ఖాయం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని