Updated : 07/05/2022 12:54 IST

ఇద్దరమ్మాయిలూ ఓ మాయాబజార్‌

ఆ స్నేహితురాళ్లు కలిసి చదువుకున్నారు. కలిసి షికార్లు చేశారు. ఆ బంధాన్ని అక్కడికే పరిమితం చేయకుండా వ్యాపారంలోకీ కలిసి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో సరికొత్త ‘మాయాబజార్‌’ సృష్టించారు కడపకు చెందిన అనూష, భీమవరానికి చెందిన శృతి. తమ స్నేహం, వ్యాపారం, భవిష్యత్తు గురించిన సంగతులు వసుంధరతో పంచుకున్నారిలా..!

ఈమధ్య ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు అన్నిచోట్లా. అలాగని వాటిని పార్కులూ, ప్రఖ్యాత ప్రాంతాల్లో తీస్తే జనాల్ని అదుపులో పెట్టడం కష్టం. డ్రెస్‌లు మార్చుకోవడానికీ ఇబ్బంది. కొన్నిచోట్ల అనుమతుల్లాంటి సమస్యలూ ఉన్నాయి. దాంతో ఫొటోషూట్‌లకు ప్రత్యేకమైన స్టూడియోలకే వెళ్తున్నారు. స్నేహితురాలి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కి తోడుగా మేమూ దిల్లీ వెళ్లాం. మేం వెళ్లిన స్టూడియోలో భిన్న రకాల సెట్‌లు ఉన్నాయి. మేం అయిదారుగురం వెళ్లి రెండ్రోజులు ఉండి వచ్చాం. సమయం వృథాతోపాటు ఖర్చు కూడా తడిసిమోపుడైంది. పెళ్లికి ముందు అంత దూరం ఎందుకన్న అసంతృప్తి ఇంట్లోవాళ్ల నుంచి వ్యక్తమైంది. ఆ అనుభవమే మా వ్యాపార ఆలోచనకు బీజం వేసింది. అలాంటి ఫొటోషూట్‌ స్టూడియో హైదరాబాద్‌లో నిర్మించాలనుకున్నాం.

వ్యాపారానికి ఇంట్లో డబ్బు అడగలేదు. అప్పుడే ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. పొదుపు చేసిన మొత్తం, బ్యాంకు రుణంతోపాటు స్నేహితులూ, మా ఇద్దరి అమ్మలూ చేబదులుగా కొంత ఇచ్చారు. ప్రతిభ, నాయకత్వ లక్షణాల పరంగా అమ్మాయిలు ఒకడుగు ముందే. కష్టపడీ పనిచేస్తారు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలోనూ అమ్మాయిల తర్వాతే.

ఒకే స్కూల్‌ ఒకే కాలేజీ...
మేం మొదటిసారి కలుసుకున్నది హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ స్కూల్లో.. తొమ్మిదో తరగతి చదువుతున్నపుడు. ఇంటర్‌, ఇంజినీరింగ్‌ కూడా కలిసే చదువుకున్నాం. ఆ తర్వాత వేర్వేరు కెరియర్లలో అడుగుపెట్టి(శృతి- ఎంబీఏ, అనూష-ఇంటీరియర్‌ డిజైనింగ్‌) ఏడాదిపాటు పనిచేశాం కూడా. ఎగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన మేము.. కలిసి వ్యాపారం చేయాలని అనుకునేవాళ్లం. ఆ క్రమంలోనే ఇటువైపు అడుగు పడింది. హైదరాబాద్‌లో అప్పటికింకా ఫొటోషూట్‌ స్టూడియోలు రాలేదు. ఉద్యోగాలు విడిచి రంగంలోకి దిగాం. స్టూడియో నిర్మాణానికి శంషాబాద్‌ని ఎంచుకున్నాం. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ప్రకటనలూ, ఫ్యాషన్‌ ఫొటోలు తీయడానికి దేశం నలుమూలల నుంచీ ఇక్కడికి  రప్పించాలన్నది మా లక్ష్యం. సమీపంలోని అమ్మపల్లి శ్రీరామచంద్ర స్వామివారి ఆలయంలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు ఎక్కువగా జరుగుతాయి. వాళ్లూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందనుకున్నాం. ఆ ఆలయానికి 2.కి.మీ. దూరంలో అయిదు ఎకరాల పొలాన్ని లీజుకి తీసుకున్నాం. పని మొదలుపెట్టే సమయానికి ఒప్పందం రద్దుచేసుకున్నారు అవతలివాళ్లు. తర్వాత ఆ పక్కనే అంతే విస్తీర్ణం ఉన్న పొలం దొరికింది. రాళ్లూరప్పలూ, ముళ్లతుప్పలతో ఉండేది. నీరు, విద్యుత్‌ సౌకర్యాలూ లేవు. మేమే చదును చేయించి విద్యుత్‌ లైన్‌ వేయించాం. మొదట బోర్‌ తవ్విస్తే నీరు పడలేదు. రెండో ప్రయత్నంలో సఫలమయ్యాం. మేమిద్దరమే 25 సెట్‌ల డిజైన్లని ఎంచుకుని  కట్టించాం. మేస్త్రీలకు, కూలీలకూ చెబితే పని తొందరగా అయ్యేది కాదు. ఇదిగో వస్తున్నాం అనేవారు. పదిరోజులకిగానీ కనిపించేవాళ్లు కాదు. డబ్బులివ్వలేమనో, గట్టిగా అడగలేమనో కానీ వాయిదాలు వేస్తూనే ఉండేవారు. కొందరు డబ్బులు తీసుకుని మాయమైపోయేవారు కూడా. ఈ కష్టాలన్నీ దాటి నిర్మాణం పూర్తిచేయడానికి ఏడాది పట్టింది.

సినిమావాళ్లూ వస్తున్నారు...
ఫొటోగ్రఫీలో గ్రామీణ వాతావరణానికి డిమాండ్‌ ఎక్కువ. అందుకే బావి, ఎడ్లబండి, మంచె లాంటి సెట్‌లు పెట్టాం. అలాగే కోటల మాదిరి సెట్‌లూ, రాజప్రాసాదాల్ని తలపించేవీ, ఇండోర్‌లో ఊయల్లాంటివీ పెట్టించాం. ప్రతి ఆరు నెలలకీ కొత్త సెట్‌ ఏర్పాటుచేస్తాం. మా సంస్థకు ‘మాయాబజార్‌’ అని పేరు పెట్టి 2019 అక్టోబరులో ప్రారంభించాం. కొద్ది నెలలకే గుర్తింపు వచ్చింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో 20 చొప్పున షూట్‌లు జరిగాయి. అంతలోనే కొవిడ్‌. ఆర్నెళ్లపాటు సేవల్ని నిలిపేయడంతో ఆర్థికంగా ఇబ్బంది అయ్యింది. అప్పటికే షూట్‌లు బాగా జరగడంతో ఇక్కడ భవిష్యత్‌ ఉంటుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, బేబీ షూట్‌, శ్రీమంతం, ప్రకటనలూ, ఫ్యాషన్‌ ఫొటోలూ, యూట్యూబ్‌ వీడియోలు తీసేవాళ్లూ... ఇక్కడ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. రెండు సినిమా షూటింగ్‌లూ జరిగాయి. సెట్లని బట్టి రోజుకు రూ.10-25 వేల మధ్య వసూలు చేస్తాం. వచ్చేవారికి ఏసీ గదులూ, వాష్‌రూమ్‌ సదుపాయాలుంటాయి. కెమెరా పట్టుకుని వస్తే చాలు. పొలంలో సేంద్రియ పద్ధతిలో కంది, పొద్దు తిరుగుడు, బంతి, మిరప... లాంటి పంటల్నీ సాగుచేస్తాం. ఇప్పటివరకూ మాయాబజార్‌లో 250 వరకూ షూట్‌లు జరిగాయి. ఇప్పటికే లాభాల బాట పట్టాం. ఇది కాకుండా మాలాంటి స్టూడియోలు నిర్మించేవాళ్లకి డిజైనింగ్‌లో సేవలు అందిస్తున్నాం. ‘గుడ్‌గాసిప్‌(ఇన్‌స్టా)’ పేరుతో డిజైనర్‌ వేర్‌ని అద్దెకు ఇస్తున్నాం. మరిన్ని రంగాల్లోకీ వెళ్లే ఆలోచన ఉంది. - మైలారం వెంకటేష్‌, శంషాబాద్‌గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని