చలివేళల్లో గ్లిజరిన్‌..

చలిగాలుల ప్రభావానికి చర్మం సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. గ్లిజరిన్‌తో ముఖాన్ని మెరిసేలా చేయొచ్చు  అంటున్నారు నిపుణులు. 

Updated : 28 Dec 2022 12:57 IST

చలిగాలుల ప్రభావానికి చర్మం సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. గ్లిజరిన్‌తో ముఖాన్ని మెరిసేలా చేయొచ్చు  అంటున్నారు నిపుణులు.  చర్మాన్ని గ్లిజరిన్‌ పొడారకుండా సంరక్షించగలదు. ముందుగా ముఖాన్ని మురికి లేకుండా శుభ్రపరచాలి. ఆ తర్వాత గ్లిజరిన్‌లో ముంచిన దూది ఉండతో ముఖాన్ని మృదువుగా తుడవాలి. కన్ను, నోటి వద్ద కాకుండా మిగతా భాగాన్ని మాత్రం తుడిచి పూర్తిగా ఇంకే వరకు ఆరనిస్తే చాలు. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేయడమే కాకుండా చర్మరంధ్రాల నుంచి చలిగాలులకు నీరు ఆవిరవ్వకుండా కాపాడి తేమగా ఉంచుతుంది. 

క్లెన్సర్‌గా..

మూడు చెంచాల పాలకు చెంచా గ్లిజరిన్‌ కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి రాత్రంతా వదిలేయాలి. ఉదయం చల్లని నీటితో కడిగితే ముఖ చర్మ రంధ్రాల్లో మురికి దూరమవుతుంది. బయటికెళ్లొచ్చిన తర్వాత ముఖంపై పేరుకొన్న దుమ్ము, ధూళిని దూరం చేయడానికి, అలాగే మేకప్‌ను శుభ్రపరచడానికీ ఇది ఉపయోగపడుతుంది. అరకప్పు నీటిలో చెంచాన్నర గ్లిజరిన్‌, మూడు చెంచాల మొక్కజొన్న పిండి కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించి చల్లార్చాలి. ఈ పేస్టును ముఖానికి రాసి తడీపొడిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. ముఖచర్మంపై మురికి పోయి అద్దంలా మెరుస్తుంది.

టోనర్‌గా..

ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత కప్పు నీటిలో రెండు చెంచాల గ్లిజరిన్‌ కలిపిన మిశ్రమంతో ముఖాన్ని కడిగితే చాలు... చర్మ రంధ్రాలను మూసుకొనేలా చేసి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. పావుకప్పు గ్లిజరిన్‌కు కప్పున్నర గులాబీ నీటిని కలిపి ముఖాన్ని కడిగినా చాలు. మంచి టోనర్‌గా మారుతుంది. అలాగే సమపాళ్లలో పెట్రోలియం జెల్లీ, గ్లిజరిన్‌, విటమిన్‌ ఈ ఆయిల్‌ కలిపి స్నానానికి ముందు ముఖానికి అప్లై చేసి పది నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ముఖచర్మం పొడారకుండా మృదువుగా మెరుపులీనుతుంది.

యాంటీఏజింగ్‌గానూ..

ముఖంపై వచ్చే వృద్ధాప్య ఛాయలు, ముడతలు, గీతలను గ్లిజరిన్‌తో తగ్గించుకోవచ్చు. ఒక గుడ్డు తెల్లసొనను గిన్నెలో వేసి చెంచా చొప్పున తేనె, గ్లిజరిన్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే చాలు. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే ముఖంపై గీతలను దూరం చేయొచ్చు. అలాగే చెంచా ముల్తానీ మట్టికి నాలుగుచెంచాల బాదం పొడి, రెండు చెంచాల గ్లిజరిన్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే మొటిమల వల్ల వచ్చే మొండి మచ్చలను మాయం చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్