తొమ్మిదేళ్లలో పది వేల లీటర్ల చనుబాలు దానమిచ్చింది!

తల్లిపాలు శిశువుల్లో ఎన్నో అనారోగ్యాల్ని దూరం చేస్తాయి.. నెలలు నిండకుండా పుట్టిన చిన్నారులు ఆరోగ్యంగా బరువు పెరగడానికి, ఇతర ఇన్ఫెక్షన్లు వారిపై దాడి చేయకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి. అయితే ఇలాంటి అమృత ధారలు కొంతమంది తల్లుల్లో పాపాయికి సరిపడా ఉత్పత్తి కావు.. మరికొందరిలో తల్లిపాల ఉత్పత్తి....

Updated : 15 Jul 2023 19:26 IST

(Photos: Instagram)

తల్లిపాలు శిశువుల్లో ఎన్నో అనారోగ్యాల్ని దూరం చేస్తాయి.. నెలలు నిండకుండా పుట్టిన చిన్నారులు ఆరోగ్యంగా బరువు పెరగడానికి, ఇతర ఇన్ఫెక్షన్లు వారిపై దాడి చేయకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి. అయితే ఇలాంటి అమృత ధారలు కొంతమంది తల్లుల్లో పాపాయికి సరిపడా ఉత్పత్తి కావు.. మరికొందరిలో తల్లిపాల ఉత్పత్తి అసలే ఉండదు. అలా తల్లిపాలకు నోచుకోని ఎంతోమంది నవజాత శిశువుల ఆకలి తీర్చుతోంది అమెరికన్‌ మామ్‌ ఎలిసాబెత్ యాండర్సన్. గత తొమ్మిదేళ్లుగా పది వేల లీటర్లకు పైగా తల్లిపాలను దానం చేసి ఎందరో చిన్నారుల కడుపు నింపింది. తనలోని ఈ సేవా గుణమే తాజాగా ఆమెకు ‘గిన్నిస్‌ రికార్డు’ను తెచ్చిపెట్టింది. ప్రత్యేకించి 2015-18 మధ్య ‘ఎక్కువ మొత్తంలో తల్లిపాలు దానం చేసిన మహిళ’గా ఎలిసా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మూడేళ్ల వ్యవధిలో 1599.68 లీటర్ల చనుబాలతో ఎంతోమంది పసిపిల్లల ఆకలి తీర్చింది ఎలిసా. మహా అయితే బిడ్డ పుట్టాక ఒకట్రెండేళ్ల వరకు చనుబాలు ఉత్పత్తవుతాయి. అలాంటిది.. ఎలిసా ఏళ్లకేళ్లు లీటర్ల కొద్దీ తల్లిపాలను ఎలా దానం చేయగలుగుతోంది? తెలుసుకోవాలంటే ఆమె కథ చదవాల్సిందే!

ఎలిసాబెత్‌ది అమెరికా ఒరెగాన్‌ నగరంలోని అలోహ అనే ప్రాంతం. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న ఆమె ముగ్గురు పిల్లల తల్లి. సాధారణంగా పిల్లలు పుట్టాక చనుబాల ఉత్పత్తి మొదలవుతుంది. కానీ గర్భం ధరించిన కొన్ని వారాల తర్వాత నుంచే తనలో పాల ఉత్పత్తి మొదలైందని చెబుతోందామె.

గర్భంతో ఉన్నప్పుడే..!

‘నా తొలి ప్రెగ్నెన్సీలో భాగంగా.. 13 వారాల తర్వాత నుంచే నా స్తనాల్లో పాల ఉత్పత్తి మొదలైంది. అలా రోజుకు అర లీటర్‌ చొప్పున ఉత్పత్తవడం చూసి.. గర్భధారణలోనే ఏదో లోపముందనుకున్నా. డాక్టర్‌ని సంప్రదిస్తే అరుదైన హైపర్‌లాక్టేషన్‌ సిండ్రోమ్‌ వల్లే ఇలా జరుగుతుందని చెప్పారు. అలా అప్పుడు మొదలైన చనుబాల ఉత్పత్తి నేటికీ కొనసాగుతోంది. ఏటికేడు అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఆపై మరో ఇద్దరు పిల్లలకు తల్లయ్యా. రెండుసార్లు గర్భంతో ఉన్నప్పుడూ లీటర్ల కొద్దీ పాలు ఉత్పత్తయ్యాయి. ఇప్పటికీ రోజుకు ఆరు లీటర్ల చొప్పున తల్లిపాలు ఉత్పత్తవుతున్నాయి. అయితే చనుబాల ఉత్పత్తి ఆగిపోవాలంటే.. మందులు వాడడం లేదా డబుల్‌ మాస్టెక్టమీ చేయించుకోవాలన్నారు వైద్యులు. కానీ నేను ఆ రెండింటినీ తిరస్కరించా.. చనుబాలతో నవజాత శిశువుల కడుపు నింపాలని నిర్ణయించుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ మాతృమూర్తి.

ఆ బిడ్డ ఆకలి చూడలేక..!

తనలో ఉన్న అధిక పాల ఉత్పత్తిని సమాజం కోసం వినియోగించాలని నిర్ణయించుకున్న ఎలిసా.. తన మొదటి బిడ్డ పుట్టాక వారానికే ఇంటి బయట ఓ ఫ్రీజర్‌ ఏర్పాటు చేసి.. అందులో పాలు నిల్వ చేయడం మొదలుపెట్టింది. ఆపై తనలో పాల ఉత్పత్తి పెరిగే కొద్దీ ఫ్రీజర్ల సంఖ్యను పెంచుతూ పోయానంటోందామె.

‘ఓసారి నా భర్తతో కలిసి ప్యూర్టోరికో వెళ్లా. వారం రోజుల పాటు అక్కడే ఉన్నాం. ఈ క్రమంలోనే ఓ మూడు నెలల నవజాత శిశువు తల్లిపాలు సరిపడా అందక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్నా. ఆరా తీస్తే.. ప్రసవ సమయంలో తలెత్తిన సమస్యల కారణంగా ఆ బిడ్డ తల్లి చనిపోయినట్లు తెలిసి నా మనసు తరుక్కుపోయింది. ఇక అప్పట్నుంచి ఆ చిన్నారి తండ్రి డబ్బు ఖర్చుపెట్టి మరీ.. తల్లిపాలు కొనుగోలు చేస్తున్న విషయం తెలిసింది. దాంతో నేను అక్కడున్న వారం రోజులు ఆ చిన్నారికి ఉచితంగా పాలు అందించా.. తిరిగొచ్చాక కూడా దాదాపు ఏడాది పాటు ఆ చిన్నారికి నిత్యం పాలు పంపించేలా ఏర్పాటు చేసుకున్నా. నాలో ఉన్న అరుదైన సమస్యే.. నెలలు నిండకుండా జన్మించిన ఇలాంటి ఎంతోమంది చిన్నారుల ఆకలి తీర్చే వరంగా పరిణమిస్తుందని నేను ఊహించలేదు. నిజంగా ఇదో మధురానుభూతి!’ అంటోంది ఎలిసా.

సేవకు ‘గిన్నిస్‌’ రికార్డు!

తన వక్షోజాల్లో ఉత్పత్తవుతోన్న పాలు సేకరించడానికి బ్రెస్ట్‌ పంప్స్‌ ఉపయోగిస్తోన్న ఈ సూపర్‌ మామ్‌.. వీటి సేకరణ, నిల్వ, ఆయా చిన్నారులకు తాజాగా అందేలా చూసే విషయాల్లో తగిన పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాల్ని పాటిస్తున్నానని చెబుతోంది. ఇలా తొమ్మిదేళ్లుగా పది వేల లీటర్లకు పైగా తల్లిపాలను దానం చేసిన ఆమె.. 2015-18 వరకు 1599.68 లీటర్ల చనుబాలతో ఎందరో చిన్నారుల కడుపు నింపింది. తనలోని ఈ సేవా గుణమే తాజాగా ఆమెకు ‘గిన్నిస్‌ రికార్డు’ను తెచ్చిపెట్టింది. ఈ మూడేళ్ల వ్యవధిలో ‘ఎక్కువ మొత్తంలో తల్లిపాలు దానం చేసిన మహిళ’గా ఎలిసాబెత్‌కు గిన్నిస్‌ రికార్డు దక్కింది.

‘పాల సేకరణ, వీటిని చిన్నారులకు అందించే విషయంలో మావారు, నా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారు. ఆకలితో ఉన్న చిన్నారులకు పాలు అందేలా చూడడం సాటి తల్లిగా నా బాధ్యత. ఈ క్రమంలోనే గిన్నిస్‌ రికార్డు దక్కడం సంతోషంగా ఉంది. అయితే ఈ సమాజంలో తల్లిపాల పంపిణీ సర్వసాధారణమైతే మరింత ఆనందపడతా..’ అంటోన్న ఎలిసా.. బహిరంగ ప్రదేశాల్లో సైతం తన పిల్లలకు పాలిస్తూ ఎంతోమంది అమ్మల్ని ఈ దిశగా ప్రోత్సహిస్తోంది కూడా!

మెనోపాజ్‌ రాకముందే..!

ప్రస్తుతం ఎలిసాబెత్‌ మూడో బిడ్డ వయసు ఐదు నెలలు. ఇలా ఓవైపు తన ముగ్గురు చిన్నారుల ఆలనా పాలన చూస్తూనే.. మరోవైపు పాల సేకరణ నిర్విరామంగా కొనసాగిస్తోందీ అమెరికన్‌ మామ్‌. ఈ క్రమంలో కార్లో ప్రయాణించేటప్పుడు, పిల్లల్ని స్కూల్‌ నుంచి తీసుకొచ్చేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఇంటి పనుల్లో నిమగ్నమైనప్పుడూ.. పాలు సేకరిస్తున్నానంటోందామె.

‘నాకున్న హైపర్‌లాక్టేషన్‌ సిండ్రోమ్‌ వల్ల కొన్నిసార్లు డీహైడ్రేషన్‌, పోషకాహార లేమి.. తదితర సమస్యలూ ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ఆస్పత్రుల్లోనూ చేరాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడూ పాలు సేకరించడం ఆగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా. అలాగే చనుబాల ద్వారా పిల్లలకు పోషకాలన్నీ అందేలా నిపుణుల సలహా మేరకు ఆరోగ్యకరమైన ఆహార నియమాలు కూడా పాటిస్తున్నా. అయితే జీవితాంతం నేను ఇలా చనుబాలు దానం చేయలేను. ప్రస్తుతం 35 ఏళ్లున్న నేను.. మరో ఐదు నుంచి పదేళ్ల పాటు దీన్ని కొనసాగించగలుగుతానేమో..! ఇక ఆ తర్వాత మెనోపాజ్‌ దశలోకి ప్రవేశిస్తే.. తల్లిపాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. అందుకే ఆ సమయం రాకముందే బ్రెస్ట్‌ఫీడింగ్, బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడం, చనుబాలు దానమివ్వడం.. వంటి అంశాల పైన పలువురిలోనూ అవగాహన పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటూ తన మంచి మనసును చాటుకుంటోందీ మాతృమూర్తి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని