‘అరోమాథెరపీ’నే వ్యాపార సూత్రంగా..!

తలనొప్పికి సింపుల్‌గా ఓ మాత్ర వేసేసుకుంటాం.. ఒత్తిడి-ఆందోళనలకూ మాత్రే పరిష్కారం అనిపిస్తుంది. నిద్ర పట్టకపోయినా మళ్లీ మాత్రే గుర్తొస్తుంది. ఇలా ఏ అనారోగ్యమొచ్చినా దాన్నుంచి త్వరితగతిన ఉపశమనం పొందాలనుకుంటామే కానీ.. అదే మాత్ర దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యల్ని.....

Updated : 04 Feb 2023 18:46 IST

తలనొప్పికి సింపుల్‌గా ఓ మాత్ర వేసేసుకుంటాం.. ఒత్తిడి-ఆందోళనలకూ మాత్రే పరిష్కారం అనిపిస్తుంది. నిద్ర పట్టకపోయినా మళ్లీ మాత్రే గుర్తొస్తుంది. ఇలా ఏ అనారోగ్యమొచ్చినా దాన్నుంచి త్వరితగతిన ఉపశమనం పొందాలనుకుంటామే కానీ.. అదే మాత్ర దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందన్న విషయం గ్రహించేవారు చాలా తక్కువమందే! అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపని సహజసిద్ధమైన ఔషధాలు తయారుచేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన సంగీతా భల్లా. ప్రాచీన కాలం నాటి ప్రకృతి వనమూలికలకు ఆధునిక పద్ధతుల్ని జోడించి.. సులభంగా ఉపయోగించేలా అరోమాథెరపీ ఔషధాలు తయారుచేస్తున్నారామె. వీటితో శరీరంలోని షట్చక్రాల్నీ పునరుత్తేజితం చేయచ్చంటోన్న సంగీత.. తన ‘3000 బీసీ థెరప్యూటిక్స్‌’ వ్యాపార ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

నేను పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే! చరిత్ర ప్రధానాంశంగా బీఏ చేశాక.. మసాచుసెట్స్‌ యూనివర్సిటీ నుంచి మాస్‌ కమ్యూనికేషన్స్‌ పూర్తిచేశా. ఇక భారత్‌కు తిరిగొచ్చాక అడ్వర్టైజింగ్‌ రంగంలో కొన్నాళ్ల పాటు పనిచేశా. ఆపై సొంతంగా ‘పర్పుల్‌ ఆర్క్‌ ఫిల్మ్స్‌’ సంస్థను స్థాపించి.. ఈ వేదికగా సుమారు 12 ఏళ్ల పాటు టీవీ కమర్షియల్స్‌, కార్పొరేట్‌ డాక్యుమెంటరీలు రూపొందించాం. అదే సమయంలో కెరీర్‌ నుంచి కాస్త విరామం తీసుకొని అమ్మగా కొత్త బాధ్యతను అందుకున్నా.

క్యాన్సర్‌తో పోరాడి..!

అటు పాపను చూసుకుంటూనే.. ఖాళీ దొరికినప్పుడల్లా నాకు చిన్నతనం నుంచే ఆసక్తి ఉన్న పెయింటింగ్‌పై దృష్టి పెట్టేదాన్ని. ఈ బాధ్యతల్లోనే 15 ఏళ్లు గడిచిపోయాయి. పాప ఎదిగింది.. ఇక కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్న సమయంలోనే 2016లో నాకు క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. ఇక ఈ వ్యాధి నుంచి బయటపడే క్రమంలో సర్జరీ జరిగింది. దీన్నుంచి కోలుకునే క్రమంలో సహజసిద్ధమైన ఎనర్జీ హీలింగ్‌ విధానాన్ని ఆశ్రయించడం మంచిదనిపించింది. అందుకే ఈ పద్ధతిని పాటించడంతో పాటు దీనిపై పరిశోధనలూ చేశా.. అరోమాథెరపీ గురించి అధ్యయనం చేశా. ఈ రెండూ నేను క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకోవడానికి దోహదం చేశాయి. నాకు ముందు నుంచీ ఒక ఆశయం ఉండేది.. నేను నేర్చుకున్న మంచి విషయాలు నలుగురికీ ఉపయోగపడేలా చేయాలని! కొవిడ్‌ సమయంలో నా ఈ కోరిక నెరవేరింది. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనలు, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఆన్‌లైన్‌ వేదికగా ఉచిత ధ్యాన తరగతుల్ని ప్రారంభించాను. మధ్యమధ్యలో వ్యాయామం, అరోమాథెరపీ, ఎనర్జీ హీలింగ్‌.. వంటి పద్ధతుల్నీ వారికి పరిచయం చేసేదాన్ని. వాళ్ల నుంచి మంచి స్పందన రావడంతో.. దీన్నే వ్యాపార సూత్రంగా మలచుకోవాలనుకున్నా. ఈ ఆలోచనే 2020 ఆగస్టులో ‘3000 BC Therapeutics’ సంస్థను ప్రారంభించడానికి మూలమైంది.

రెండు చుక్కలు చాలు!

ప్రకృతి సిద్ధమైన వనమూలికలకు ఆధునిక పద్ధతుల్ని జోడించి.. సులభంగా ఉపయోగించుకునేలా ఔషధాలు తయారుచేయడమే మా సంస్థ ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో లావెండర్‌, చామొమైల్‌, పెప్పర్‌మింట్‌, యూకలిప్టస్‌.. వంటి సుమారు 50కి పైగా స్వచ్ఛమైన అత్యవసర నూనెల్ని ఉపయోగించి.. మొక్కలు, పువ్వులు, చెట్ల నుంచి సేకరించిన ఎక్స్‌ట్రాక్ట్స్‌తో వాటిని కలిపి.. అరోమా నూనెలు, రోల్‌-ఆన్స్‌, సబ్బులు, షాంపూ బార్స్‌.. వంటివి తయారుచేస్తున్నాం. నొప్పి నివారిణులుగా; ఒత్తిడి, ఆందోళనలు, యాంగ్జైటీ, నిద్రలేమి.. వంటి సమస్యల్ని దూరం చేయడానికి ఇవి సమర్థంగా పనిచేస్తాయి. శరీరంలోని షట్చక్రాల్ని అనుసరించి.. సమస్య ఉన్న చోట ఒకటి లేదా రెండు చుక్కల మిశ్రమాన్ని అప్లై చేస్తే చాలు.. సత్వర ఉపశమనం కలుగుతుంది. అలాగే శిరోజాల ఆరోగ్యానికి, ఫుట్‌ స్పా కోసం మరికొన్ని ఉత్పత్తులు మా వద్ద అందుబాటులో ఉన్నాయి. ఆయుష్ గుర్తింపు ఉన్న మా ఉత్పత్తులను అందరూ నిస్సందేహంగా ఉపయోగించచ్చు. అలాగే వీటిని వాడే క్రమంలో సందేహాలేమైనా ఉంటే.. బాటిల్‌తో పాటు వచ్చే ఇన్‌స్ట్రక్షన్‌ గైడ్‌ని ఫాలో కావచ్చు.

టీచర్‌గా, కౌన్సెలర్‌గా..!

ఈతరం వారు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా.. సులభంగా ఉపయోగించగలిగే ఔషధాల్ని కోరుకుంటున్నారు. సహజసిద్ధంగా ఉంటూనే.. సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం పొందే ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటున్నారు. ఇలా వినియోగదారుల అవసరాల్ని నెరవేరుస్తున్నాయి కాబట్టే ప్రస్తుతం మా ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కొన్ని స్టోర్స్‌లో అందుబాటులో ఉన్న మా ఉత్పత్తుల్ని.. త్వరలో మరింత విస్తరించాలనుకుంటున్నాం. ఈ క్రమంలో వినియోగదారుల అవసరాల మేరకు మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రత్యేకంగా ఒక స్టోర్‌ తెరవాలనుకుంటున్నాం. నిధుల సమీకరణ, నెట్‌వర్కింగ్‌.. వంటి విషయాల్లో వీ-హబ్‌ నాకు చాలా వరకు సహకరించింది. మరోవైపు నాకు ఎనర్జీ హీలర్‌గా సర్టిఫికేషన్‌ కూడా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాచీన పద్ధతులపై సెషన్స్‌ నిర్వహించడంతో పాటు, మానసిక సమస్యలపై కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నా. ఈ క్రమంలోనే త్వరలో హీలింగ్‌, కౌన్సెలింగ్‌ సెంటర్‌ని కూడా ఏర్పాటు చేయబోతున్నా.

ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయద్దు!

మన శరీరంలోని షట్చక్రాల పైనే శారీరక, మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చాలామంది తమకొచ్చిన ఆరోగ్య సమస్యల్ని మొదట్లో నిర్లక్ష్యం చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. మొదట్లోనే సమస్యకు మూలాలేంటో గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది కదా! అంతేకాదు.. ఈ క్రమంలో సరైన చికిత్సా విధానాలు, టూల్స్‌ ఉపయోగించడం కూడా తప్పనిసరి. అవి ఆరోగ్యాన్ని నయం చేసేలా ఉండాలే తప్ప.. ఇతర అనారోగ్యాల్ని సృష్టించేలా ఉండకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని