సమానమైన పనికి సమాన వేతనం దక్కట్లేదెందుకు?!

పురుషాధిపత్యం ఎక్కువగా ఉండే సేల్స్‌ టీమ్‌లో పని చేస్తున్నా. మా బృందంలో నేనొక్కదాన్నే అమ్మాయిని. నాలుగేళ్లుగా ఇందులో కొనసాగుతున్నా. పనిలో పోటీ, లక్ష్యాలు ఎక్కువ. అయినా ఆస్వాదిస్తూ మగవాళ్లతో సమానంగా పూర్తిచేస్తున్నా. కానీ వాళ్లతో పోలిస్తే....

Published : 25 Aug 2022 20:24 IST

పురుషాధిపత్యం ఎక్కువగా ఉండే సేల్స్‌ టీమ్‌లో పని చేస్తున్నా. మా బృందంలో నేనొక్కదాన్నే అమ్మాయిని. నాలుగేళ్లుగా ఇందులో కొనసాగుతున్నా. పనిలో పోటీ, లక్ష్యాలు ఎక్కువ. అయినా ఆస్వాదిస్తూ మగవాళ్లతో సమానంగా పూర్తిచేస్తున్నా. కానీ వాళ్లతో పోలిస్తే నా జీతం తక్కువే. ఇది నన్ను నిరాశపరుస్తోంది. దీన్నెలా ఎదుర్కోవాలి? - ఓ సోదరి

జ. చాలామంది మహిళల్లో ఇతరులతో జీతాన్ని పోల్చుకోకూడదన్న భావన ఉంటుంది. ఏమనుకుంటారో అనో, ఎలా తెలిసిందని బాస్‌ ప్రశ్నిస్తారనో మిన్నకుండిపోతారు. ఒక్కోసారి తమపై తమకు నమ్మకం లేకపోవడమూ ఇందుకు కారణం కావచ్చు. ముందు వీటిని అధిగమించండి. కొన్ని సంస్థల్లో జీతాల గురించి చర్చించొద్దనే నియమం ఉంటుంది. దీనివల్ల తెలుసుకునే, తెలిసినా దానిపై చర్చించే అవకాశాలు తక్కువ. దీనివల్ల లాభపడేది యాజమాన్యమే. కానీ పని సమానంగా చేసినా.. మగ సహోద్యోగుల కంటే తక్కువ వేతనం పొందుతున్నట్లనిపిస్తే.. నేరుగా వారితో మాట్లాడమే ఉత్తమం. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందీ పడొద్దు. నేరుగా కష్టమనిపిస్తే పరోక్షంగా ప్రయత్నించండి.

ఆపై ‘నేను, ఫలానా వ్యక్తి ఒకేసారి ఉద్యోగంలో చేరాం. తనతో సమాన బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. అయినా జీతం విషయంలో అంతరం ఉంది. కారణాన్ని తెలుసుకోవచ్చా?’ అని మీ మేనేజర్‌ని మర్యాదగా అడిగి చూడండి. అయితే మీ సహోద్యోగి జీతం గురించి ఎలా తెలుసన్న సంభాషణకు ఆస్కారమివ్వకండి. కొంతమంది మేనేజర్లు దీనిపై దృష్టిపెట్టొచ్చు. అదే జరిగితే సంభాషణ దారి మళ్లించండి. ఆయనతో ప్రయోజనం లేదనిపిస్తే హెచ్‌ఆర్‌ను కలవండి. చెల్లింపుల్లో లింగ అంతరాలు సంస్థకు చట్టపరమైన, పీఆర్‌ సమస్యలు కలిగిస్తాయని వాళ్లు గుర్తించగలరు. కాబట్టి, త్వరగా చర్యలు తీసుకోగలుగుతారు. అయితే ఇక్కడ బాస్‌.. తనకు వ్యతిరేకంగా మీరు హెచ్‌ఆర్‌ వాళ్లను కలిసినట్టుగా భావించొచ్చు. కాబట్టి, ఈ విషయంగా మీ పేరు రాకుండా చూడమని వాళ్లను ముందుగానే కోరండి. చివరగా సమస్యను ఎత్తి చూపడానికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. ముందు ఏం, ఎలా మాట్లాడాలన్న దానిపై మనసులో ఆలోచించుకోండి. తర్వాతే ప్రయత్నించండి. లింగ వేతన వ్యత్యాసాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోవచ్చు.. కానీ చర్య తీసుకునేలా ప్రయత్నించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్