Dadasaheb Phalke Award : ఆ మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి!

ఎరికా ఫెర్నాండెజ్.. అసలు పేరు కంటే ప్రేర్నా శర్మగానే ఈ ముద్దుగుమ్మకు గుర్తింపెక్కువ. హిందీ సీరియళ్లు ఫాలో అయ్యే వారికి ఈ అందాల బొమ్మను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్‌లో ప్రేర్నా శర్మగా అందరి మనసూ దోచుకోవడంతో పాటు ప్రతి ఇంట్లో వ్యక్తిగా మారిపోయిందీ లవ్లీ గర్ల్. ప్రస్తుతం ‘కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ.....

Updated : 18 Feb 2022 13:31 IST

(Photo: Instagram)

ఎరికా ఫెర్నాండెజ్.. అసలు పేరు కంటే ప్రేర్నా శర్మగానే ఈ ముద్దుగుమ్మకు గుర్తింపెక్కువ. హిందీ సీరియళ్లు ఫాలో అయ్యే వారికి ఈ అందాల బొమ్మను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్‌లో ప్రేర్నా శర్మగా అందరి మనసూ దోచుకోవడంతో పాటు ప్రతి ఇంట్లో వ్యక్తిగా మారిపోయిందీ లవ్లీ గర్ల్. ప్రస్తుతం ‘కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ : నయీ కహానీ’ అనే సీరియల్‌లో నటిస్తోన్న ఈ చక్కనమ్మ.. తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇందుకు గుర్తింపుగానే తాజాగా ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ గెలుచుకుంది ఎరిక. ‘దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2022’లో భాగంగా గతేడాదికి గాను ‘ఉత్తమ టీవీ నటి’గా ఈ అవార్డు అందుకొని మరోసారి తనకు ఎదురులేదనిపించిందీ బుల్లితెర క్వీన్‌. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయిందీ క్యూట్‌ బ్యూటీ.

బాలీవుడ్ బుల్లితెర తారగా ఎరికా ఫెర్నాండెజ్‌కు మంచి పేరుంది. గతంలో ‘కసౌటీ జిందగీ కే’ అనే ధారావాహికలో ప్రేర్నా శర్మగా ఆకట్టుకున్న ఈ చక్కనమ్మ.. ప్రస్తుతం ‘కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ : నయీ కహానీ’ అనే సీరియల్‌లో నటిస్తోంది. ఇది 2017లో ప్రసారమైన ‘కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ’ సీరియల్‌కు సీక్వెల్‌. ఇందులో డాక్టర్‌ సోనాక్షీ బోస్‌ దీక్షిత్‌ పాత్రలో నటిస్తోన్న ఆమె.. తన అభినయంతో ప్రేక్షకుల్ని చూపుతిప్పుకోకుండా చేస్తోంది.

మనసుకు నచ్చిన పాత్ర అవార్డు తెచ్చింది!

‘దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2022’ అవార్డుల వేడుకలో భాగంగా.. సోనాక్షి పాత్రకు గాను తాజాగా ‘ఉత్తమ టీవీ నటి-2021’గా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకుంది ఎరిక. ఇదే విషయాన్ని ఇన్‌స్టాలో పంచుకుంటూ.. తన మనసుకు నచ్చిన పాత్ర ఇంతటి ప్రతిష్ఠాత్మక అవార్డు తెచ్చిపెట్టడం చాలా సంతోషంగా ఉందంటోంది. ‘ప్రస్తుతం నేను నటిస్తోన్న సోనాక్షీ బోస్‌ పాత్ర నా మనసుకెంతో దగ్గరైంది. ఇప్పుడు ఇదే పాత్రకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం నా అదృష్టం. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. నేను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందనిపిస్తోంది.

నా చిన్నతనంలో ఒక వ్యక్తి నాతో ఇలా చెప్పారు.. ‘నీలో అద్భుతమైన ప్రతిభ దాగుంది. దాన్ని ప్రదర్శించడానికి నీకు తప్పకుండా అవకాశం దొరుకుతుంది. అయితే నీలోని ప్రతిభను నిరూపించుకోవడం మాత్రం నీ చేతిలోనే ఉంది.. ఆ దిశగా కష్టపడు.. నీకంటూ చక్కటి కెరీర్‌ని నిర్మించుకో!’ అంటూ వెన్నుతట్టారు.. ఆ మాటలు నాలో స్ఫూర్తి రగిలించాయి..’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకుందీ ముద్దుగుమ్మ.

నాన్ వెజ్ అంటే ఇష్టం!

* బాలీవుడ్ టీవీ సీరియళ్లతో ప్రతి ఇంట్లో అమ్మాయిగా మారిపోయిన ఎరికా ఫెర్నాండెజ్ అసలు పేరు ఎరికా జెన్నిఫర్ ఫెర్నాండెజ్. 1993, మే 7న ముంబయిలో జన్మించిన ఆమె.. బాంద్రాలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజ్‌లో బీఏలో చేరింది.

* చిన్నతనం నుంచి మోడలింగ్‌పై ఆసక్తి కనబరిచే ఎరిక.. తన డిగ్రీని మధ్యలోనే ఆపేసి మోడలింగ్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే 2012 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఆమె టాప్-10లో చోటు సంపాదించింది.

* ‘కసౌటీ జిందగీ కే’ అనే టీవీ సీరియల్‌లో ప్రేర్నా శర్మగా అందరికీ దగ్గరైన ఎరికా.. తన కెరీర్‌ను ప్రారంభించింది మాత్రం సినిమాలతోనే..! 2014లో ‘నిన్నిండలే’ అనే కన్నడ చిత్రంలో నటించింది. అయితే దాని విడుదల ఆలస్యమై, తాను నటించిన 'అయింతు అయింతు అయింతు' అనే తమిళ చిత్రం మొదటగా విడుదలైంది.

* ఈ బాలీవుడ్ బ్యూటీకి తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా అనుబంధం ఉంది. టాలీవుడ్‌లో ఆది సరసన ‘గాలిపటం’తో పాటు ‘డేగ’ అనే మరో సినిమాలో మెరిసిందీ బ్యూటీ. తాను నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం దక్షిణాది పరిశ్రమకు చెందినవే!

* తాను నటిని కాకపోయుంటే ఫ్యాషన్ డిజైనర్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గా సెటిలయ్యేదాన్నని చెబుతోందీ లవ్లీ గర్ల్. సీరియళ్లు-సినిమాలతో బిజీగా ఉన్నా.. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే దుస్తుల్ని డిజైన్ చేయడం, కుట్టడం.. వంటివి చేస్తానంటోందీ ముద్దుగుమ్మ.

* ఎరికా పెద్ద ఫుడీ! నాన్‌వెజ్ వంటకాలను బాగా ఇష్టపడతానంటోంది. ఇక తన ఫేవరెట్ డిష్ విషయానికొస్తే.. శ్రీలంకన్ చికెన్ కర్రీ అంటే చెవి కోసుకుంటుందట! అలాగే గోల్‌గప్పా, ఫ్రాంకీస్.. వంటి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట! అయితే కేవలం తినడమే కాదు.. కొత్త కొత్త వంటకాలనూ ట్రై చేస్తుందట ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా కేక్స్, బిస్కట్స్.. వంటి బేకరీ ఐటమ్స్ ఎంతో రుచిగా తయారుచేస్తానంటోందీ ఫుడ్‌ లవర్‌.

* ట్రావెలింగ్‌ను బాగా ఇష్టపడే ఎరిక.. సమయం దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రదేశాల్ని సందర్శించడం, అక్కడి వాతావరణాన్ని, ప్రత్యేక వంటకాలను ఆస్వాదించడం, సాహస క్రీడల్లో పాల్గొనడం.. వంటివి చేస్తుందట!

* డూడుల్స్ వేయడంలో తనకు సాటి మరొకరు లేరనడానికి తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకునే డూడుల్స్‌ ఫొటోలే ప్రత్యక్ష సాక్ష్యం! దీంతో పాటు పెయింటింగ్, పాటలు పాడడం, కీబోర్డ్ వాయించడం.. ఈ ముద్దుగుమ్మ అభిరుచుల్లో కొన్ని!

* ఎరికా పెట్ లవర్ కూడా! తన పెంపుడు కుక్క 'ఛాంప్' అంటే తనకు ఎనలేని మక్కువట!

* ప్రస్తుతం బాలీవుడ్‌ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతోన్న ఎరికకు.. అమెరికన్ నటుడు రాబర్ట్ డౌనే జూనియర్ చాలా ఇష్టమైన నటుడు. అలాగే నటీమణుల విషయానికొస్తే.. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, కంగనా రనౌత్.. అంటే ఇష్టమట!

* షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంటుందీ సుందరి. వివిధ ప్రదేశాలకు వెళ్లినా, ఫొటోషూట్స్‌లో పాల్గొన్నా.. ఇలా ప్రతి సందర్భంలో తాను దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లోనే ఉంటుందీ లవ్లీ బేబీ.

* ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్‌లో ప్రేర్నా శర్మ పాత్రతోనే చాలామందికి దగ్గరైందీ బాలీవుడ్‌ అందం. అందుకే ఆ పాత్ర ఆధారంగా అభిమానులు అందమైన బొమ్మల్ని తయారుచేయడం.. అప్పట్లో వైరల్‌గా మారింది.

* అందంగా కనిపించాలంటే స్వీయ ప్రేమ ముఖ్యమంటోంది ఎరిక. ఎవరిని వారు ప్రేమించుకోవడం వల్ల తమ అందం, ఆరోగ్యం గురించి తాము మరింత శ్రద్ధ చూపిస్తారు. ఇదే మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, నవయవ్వనంగా కనిపించేలా చేస్తుందంటోందీ చక్కనమ్మ. తన అందానికి ఇదీ ఓ కారణమే అని చెబుతోంది.

* ఓవైపు నటిగా బిజీగా ఉన్నప్పటికీ.. మరోవైపు తన పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ కూడా నిర్వహిస్తోందీ బుల్లితెర క్వీన్‌. ఇందులో సౌందర్య చిట్కాలు, మేకప్‌ టిప్స్‌, హెల్త్‌ టిప్స్‌.. వంటివెన్నో పంచుకుంటూ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోంది.

* తన వృత్తి, కుటుంబం తనకు రెండు కళ్లని చెబుతోంది ఎరిక. ఈ క్రమంలో ప్రతి సందర్భాన్నీ వాళ్లతో సెలబ్రేట్‌ చేసుకుంటూ.. ఆ మధురానుభూతుల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతుంటుందీ హోమ్లీ గర్ల్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని