Published : 07/02/2022 12:44 IST

పెళ్లి ఘడియల్లో పనికొచ్చే బ్యూటీ కిట్..!

పెళ్లి.. వధూవరుల దగ్గర్నుంచి వేడుకకు వచ్చే బంధువుల వరకు ప్రతిఒక్కరూ తీరిక లేకుండా గడిపే మధురమైన క్షణాలు. ఈ శుభ ఘడియల్లో నవవధువుగా తళుక్కున మెరిసిపోవాలని ప్రతి అమ్మాయీ కోరుకోవడం సహజం. అందుకు తగినట్లుగా ముందుగానే సిద్ధమవుతుంది కూడా. అయితే పెళ్లి సమయం దగ్గర పడే కొద్దీ అందాన్ని సంరక్షించుకునే లేదా పదే పదే మేకప్ చేసుకునేంత సమయం పెళ్లికూతుళ్లకు ఉండకపోవచ్చు. అందుకే ఒక ఎమర్జన్సీ బ్యూటీ కిట్ సిద్ధం చేసుకొని, దగ్గరపెట్టుకోవాలని సూచిస్తున్నారు బ్యుటీషియన్లు. ఇంతకీ ఆ కిట్‌లో ఏమేం ఉండాలంటే..

చాలామంది అమ్మాయిలు తమతో చిన్న సైజు మేకప్ కిట్ వంటివి హ్యాండ్‌బ్యాగ్‌లో తీసుకెళ్తూ ఉంటారు. అయితే పెళ్లి సమయంలో కూడా ఇలాంటి ఒక కిట్‌ని సిద్ధం చేసుకోవడం మంచిదన్నది సౌందర్య నిపుణుల సలహా.

లిప్‌స్టిక్

చిన్న పరిమాణంలో ఉన్న లిప్‌స్టిక్ అందుబాటులో పెట్టుకుంటే వీలు చిక్కినప్పుడల్లా అధరాలకు టచప్ ఇచ్చుకునే సౌలభ్యం ఉంటుంది. ఫలితంగా అధరాలు తాజాగా, అందంగా కనిపిస్తాయి. అయితే మీరు పెళ్లికి ఏ షేడ్ లిప్‌స్టిక్ ఉపయోగించాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకుంటే చిన్న పరిమాణంలో ఉన్న అదే షేడ్ లిప్‌స్టిక్‌ను కొనుక్కొని కిట్‌లో పెట్టుకోవచ్చు.

బ్లాటింగ్ పేపర్స్, టిష్యూస్

బ్లాటింగ్ పేపర్స్ దగ్గర పెట్టుకుంటే జిడ్డుగా అనిపించినప్పుడల్లా మేకప్ చెదిరిపోకుండానే వాటిని ఉపయోగించి పైపైన పేరుకున్న జిడ్డుని సులభంగా తొలగించేసుకోవచ్చు. తద్వారా పెళ్లికూతురిగా ఫ్రెష్ లుక్‌లో మెరిసిపోవచ్చు.

ఫేషియల్ స్ప్రే..!

ముఖాన్ని తాజాగా కనిపించేలా చేసే ఫేషియల్ మిస్ట్.. అదేనండీ.. ఫేషియల్ స్ప్రేలు ప్రస్తుతం చాలానే అందుబాటులో ఉంటున్నాయి. ముఖం అలసిపోయినట్లు అనిపించిన ప్రతిసారీ దీంతో స్ప్రే చేసుకొని తుడుచుకుంటే చాలు. ముఖం మళ్లీ తాజాగా కనిపిస్తుంది. ఆ తర్వాత లైట్‌గా మేకప్‌తో టచప్ ఇచ్చుకుంటే సరి.

హెయిర్ స్ప్రే..

పెళ్లి హడావుడిలో ఒక్కోసారి వధువు హెయిర్‌స్త్టెల్ చెదిరిపోతూ ఉంటుంది. అలాకాకుండా ఉండాలన్నా, కురులు ఆరోగ్యంగా కనిపిస్తూ మిలమిలా మెరిసిపోవాలన్నా అది హెయిర్ స్ప్రేతోనే సాధ్యం. ఒకసారి హెయిర్‌స్త్టెల్ వేసుకున్న తర్వాత పైపైన దీంతో స్ప్రే చేసుకుంటే చాలాసేపటి వరకు హెయిర్‌స్త్టెల్ చెదరకుండా ఉంటుంది.

పరిమళించడానికి..

ఒక్కోసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒళ్లంతా చెమట పట్టి దుర్వాసన వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా రోజంతా తాజాగా పరిమళించాలంటే మంచి పెర్‌ఫ్యూమ్ ఉపయోగించాల్సిందే! మీకు నచ్చిన సువాసనలతో గుబాళించే అత్తరు లేదా పెర్‌ఫ్యూమ్ బాటిల్ ఒకటి కిట్‌లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉండచ్చు.

ఇవి కూడా..

* బేబీ పౌడర్- చెమట, జిడ్డుదనాన్ని పీల్చుకుని చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

* హెయిర్‌పిన్స్- వీటి అవసరం ఎప్పుడైనా రావచ్చు.

* ఇయర్‌బడ్స్- చెదిరిన మస్కారా, కాటుక.. మేకప్‌ని సరిచేయడానికి బాగా ఉపకరిస్తాయి.

* సన్‌స్క్రీన్ లోషన్

* మౌత్ ఫ్రెషనర్ మింట్స్

* సేఫ్టీ పిన్స్

* లిప్‌గ్లాస్.. మొదలైనవి

చూశారుగా.. నవవధువుల ఎమర్జన్సీ బ్యూటీ కిట్‌లో ఉండాల్సిన వస్తువులేంటో..! మరి, మీరు కూడా స్వయంగా ఒక కిట్ సిద్ధం చేసుకొని వెంట ఉంచుకోండి.. నవవధువుగా మెరిసిపోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని