పతకం రాకుంటే ఏంటి? అందరికీ ముద్దుబిడ్డ అయింది!

గోల్ఫ్... అప్పుడప్పుడు టీవీలు, సినిమాల్లో చూడడమే కానీ చాలామందికి ఈ ఆట గురించి పెద్దగా తెలియదు. ఈ గేమ్‌ ఎలా ఆడతారో, పాయింట్లు ఎలా లెక్కిస్తారో అంతగా అవగాహన ఉండదు.  అయితే ఒక అమ్మాయి గత రెండు రోజులుగా కోట్లాది మంది భారత క్రీడాభిమానులు ఈ ఆటను ఆసక్తిగా తిలకించేలా చేసింది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోయేలా చేసింది. ఆమే 23 ఏళ్ల అదితీ అశోక్.

Published : 07 Aug 2021 17:56 IST

గోల్ఫ్... అప్పుడప్పుడు టీవీలు, సినిమాల్లో చూడడమే కానీ చాలామందికి ఈ ఆట గురించి పెద్దగా తెలియదు. ఈ గేమ్‌ ఎలా ఆడతారో, పాయింట్లు ఎలా లెక్కిస్తారో అంతగా అవగాహన ఉండదు.  అయితే ఒక అమ్మాయి గత రెండు రోజులుగా కోట్లాది మంది భారత క్రీడాభిమానులు ఈ ఆటను ఆసక్తిగా తిలకించేలా చేసింది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోయేలా చేసింది. ఆమే 23 ఏళ్ల అదితీ అశోక్.

టాప్‌ క్రీడాకారిణులకు ముచ్చెమటలు!

వరల్డ్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్స్‌లో అదితి ర్యాంకు 200. అదే ఒలింపిక్స్‌లో అయితే 45వ స్థానం. అలాంటిది ఈ యంగ్‌ గోల్ఫర్‌ టోక్యోలో ఎవరూ ఊహించని అద్భుతం చేసింది. వరల్డ్‌ నంబర్‌ వన్‌తో పాటు టాప్‌-10 క్రీడాకారిణులకు ముచ్చెమటలు పట్టించింది. ఎలాంటి అంచనాలు లేని దశ నుంచి ఏకంగా పతకంపై ఆశలు కల్పించింది. అయితే ఫైనల్‌ రౌండ్లలో ఆమెను దురదృష్టం వెక్కిరించడంతో త్రుటిలో పతకం కోల్పోయింది. నాలుగో స్థానంలో నిలిచి భారమైన హృదయంతో మైదానాన్ని వీడింది. అయితేనేం ప్రపంచ క్రీడల్లో ఆమె చూపిన తెగువను చూసి యావత్‌ భారతదేశం ఆమెను ప్రశంసిస్తోంది.

ఐదున్నరేళ్లకే..!

అతి పిన్నవయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గోల్ఫ్‌లో తన సత్తా చాటుతోన్న అదితీ అశోక్ మార్చి 29, 1998లో బెంగళూరులో జన్మించింది. తల్లి పేరు మహేశ్వరి. తండ్రి పేరు అశోక్‌. ఇలా గోల్ఫర్‌గా రికార్డులు సృష్టిస్తోన్న అదితి.. ఏ వయసులో ఈ క్రీడ ఆడటం మొదలుపెట్టిందో తెలుసా? ఐదున్నరేళ్లకే..! ఆ తర్వాత క్రమంగా  గోల్ఫ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. బెంగళూరు గోల్ఫ్ క్లబ్, కర్ణాటక గోల్ఫ్ అసోసియేషన్ తరఫున అదితి గోల్ఫ్ పోటీల్లో పాల్గొంటోంది. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారిణిగా పన్నెండేళ్ల వయసు నుంచీ రాణిస్తోంది. ఎప్పుడూ గోల్ఫ్ క్రీడలో మునిగి తేలే అదితికి పుస్తకాలు చదవడమంటే మహా ఇష్టమట. తీరిక సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదువుతుందట. అలాగే సినిమాలు చూడటం, సంగీతం వినడం అదితికి ఇష్టమైన పనులు.

అమెచ్యూర్‌గా రాణింపు..

2015 డిసెంబర్ వరకు అదితి అమెచ్యూర్ గోల్ఫర్‌గా రాణించింది. ఆ సమయంలోనే ఆమె ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఏషియన్‌ యూత్‌ గేమ్స్ (2013), యూత్ ఒలింపిక్స్ (2014), ఆసియా క్రీడలు.. ఈ మూడింట్లో పాల్గొన్న తొలి, ఏకైక భారత గోల్ఫ్ క్రీడాకారిణిగా నిలిచింది. అమెచ్యూర్‌గా ఆమె ఖాతాలో 17 టైటిళ్లున్నాయి. 2015లో జరిగిన ఇంటర్నేషనల్ యూరోపియన్ లేడీస్ అమెచ్యూర్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి వెండి పతకమందుకొన్న తొలి ఆసియా క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. జూనియర్ స్థాయిలో మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా, రెండుసార్లు జాతీయ అమెచ్యూర్ ఛాంపియన్‌గా నిలిచింది. అంతేకాదు వివిధ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున పాల్గొన్న తొలి, ఏకైక క్రీడాకారిణిగా పేరు పొందింది అదితి.

ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా..

2016 ప్రారంభంలో ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారిణిగా మారిన అదితి.. అదే ఏడాది రియో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పోటీపడింది. ప్రపంచ క్రీడల్లో గోల్ఫ్‌ను ప్రవేశపెట్టడం కూడా అదే తొలిసారి. అక్కడ తనదైన ప్రతిభ కనబరిచి ఫైనల్ రౌండ్‌కు చేరుకొని మరోసారి సత్తా చాటింది అదితి. దీంతో ఈ క్రీడల్లో తొలిసారి పాల్గొన్న భారతీయ గోల్ఫర్‌గా గుర్తింపు పొందడమే కాదు.. భవిష్యత్తులో తాను ఓ బలమైన క్రీడాకారిణిగా మారబోతున్నాననే సంకేతాన్నిచ్చింది. అదే ఏడాది జరిగిన లల్లా ఐచా టూర్ స్కూల్ గోల్ఫ్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా లేడీస్ యూరోపియన్ టూర్ - 2016 సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకొంది. ఈ విజయం అంతర్జాతీయ టూర్ క్వాలిఫయింగ్ స్కూల్ పోటీల్లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఆమెను నిలిపింది. 2017లో మహిళల ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ అసోసియేషన్ (LPGA) ప్లేయర్‌గా అర్హత పొంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యువ సంచలనం. అదే ఏడాది ఫాతిమా బింట్‌ ముబారక్‌ మహిళల ఓపెన్‌ను కూడా గెల్చుకుంది.

వీసా సమస్యలు... కరోనాకు చిక్కి!!

2018-19 మధ్య కాలంలో జరిగిన పలు పోటీల్లో సత్తా చాటింది అదితి. అయితే కరోనా ప్రభావంతో గతేడాది ఎక్కువగా టోర్నీలు ఆడలేకపోయింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. దీనికి తోడు ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు కొన్ని వ్యక్తిగత సమస్యలు అదితిని బాగా ఇబ్బందిపెట్టాయి. డబుల్ వీసా కోసం ఆమె పాస్‌పోర్ట్‌ కాన్సులేట్‌లో చిక్కుకుపోయింది. దీంతో టోర్నీలున్నా విదేశాలకు వెళ్లలేకపోయింది. అదే సమయంలో కరోనా కోరలకు చిక్కి చాలా రోజులు ఇంటి దగ్గరే ఉండిపోయింది. రెండు నెలలు గోల్ఫ్‌ స్టిక్‌ పట్టుకునే అవకాశమే రాలేదు. మే మొదటి వారంలో కరోనా బారిన పడిన ఆమె జూన్ మధ్యలో తిరిగి ప్రాక్టీస్‌ ప్రారంభించింది. ఒలింపిక్స్‌కు సన్నద్ధమైంది.

ఈసారి తల్లి తోడుగా!

2016 రియో ఒలింపిక్స్‌లో అదితి క్యాడీ (ప్లేయర్‌ వెంటే ఉండి, గోల్ఫ్‌ కిట్స్‌ను చూసుకునే వ్యక్తి)గా ఆమె తండ్రే ఉన్నారు. అయితే ఈసారి ఒలింపిక్స్‌లో మాత్రం తల్లి మహేశ్వరే క్యాడీగా వ్యవహరించింది. తన కూతురును ముందుండి నడిపించింది.

చాలా బాధగా ఉంది!

అద్భుత ఆటతీరుతో ఒకానొక దశలో పతకం తెస్తుందన్న అదితి త్రుటిలో ఆ అవకాశం కోల్పోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె.. ‘ఒలింపిక్స్‌ కాక మరేదైనా టోర్నీలో నాలుగో స్థానం వస్తే ఎంతో సంతోషించేదాన్ని. కానీ ఈ ప్రపంచ క్రీడల్లో నాలుగో స్థానం అంటే తట్టుకోలేకపోతున్నాను. భరించడం కష్టంగా ఉంది. నేను బాగా ఆడాను. 100 శాతం కష్టపడ్డాను. ఇక నా మెడలో ఒలింపిక్స్‌ మెడల్ పడిందనే అనుకున్నాను. నా దేశ ప్రజలు ఎంతో సంతోషపడతారని భావించాను. అయితే ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాను. ఏదేమైనా ఇదో చెడ్డ రోజు. ఒలింపిక్‌ పోడియం ఎక్కలేకపోయాను. నేను గోల్ఫ్‌ ఆడడం ఆరంభించినప్పుడు ఒలింపిక్స్ వరకు వస్తానని అనుకోలేదు. అసలు అప్పుడది ఒలింపిక్‌ క్రీడల జాబితాలోనే ఉండేది కాదు. అయితే ఇష్టమైన ఆటను ఎంచుకుని ప్రతిరోజూ ప్రాక్టీస్‌ చేస్తే ఏదో ఒక రోజు పతకాలు సాధించొచ్చు’ అని ఈ సందర్భంగా స్ఫూర్తి నింపిందీ యువ సంచలనం.

నీ విజయం స్ఫూర్తినిచ్చింది!!

ఈ సందర్భంగా పతకం గెలవనప్పటికీ అద్భుత ఆటతీరును కనబర్చిన అదితిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్‌ వేదికగా ఈ యంగ్‌ గోల్ఫర్‌ను అభినందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్