Child Birth: అక్కడ బిడ్డ పుడితే అమ్మకు బంగారు నాణేలిస్తారట!
తమకు వారసుడే కావాలంటూ పట్టుబడుతుంటారు కొందరు.. కొడుకు పుట్టే దాకా కుటుంబ నియంత్రణ పాటించకుండా పిల్లల్ని కంటూనే ఉంటారు. ఇక కొడుకు పుట్టడమేమో కానీ.. దీనివల్ల దేశ జనాభా మాత్రం....
తమకు వారసుడే కావాలంటూ పట్టుబడుతుంటారు కొందరు.. కొడుకు పుట్టే దాకా కుటుంబ నియంత్రణ పాటించకుండా పిల్లల్ని కంటూనే ఉంటారు. ఇక కొడుకు పుట్టడమేమో కానీ.. దీనివల్ల దేశ జనాభా మాత్రం పెరిగిపోతుంటుంది.. ఫలితంగా పౌష్టికాహారం, వైద్య సదుపాయాల కొరత ఏర్పడుతుంది.. నిరక్షరాస్యత, నిరుద్యోగం తాండవిస్తుంది. ఈ తిప్పలు తప్పించడానికే ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ చట్టాలు, పాలసీలు రూపొందిస్తుంటాయి. ఇందులో భాగంగా.. వీటిని తు.చ. తప్పకుండా పాటించిన వారికి ఆయా ప్రయోజనాలూ అందిస్తుంటాయి. ఇక ఉల్లంఘించిన వారి పట్ల కఠిన చర్యలూ తీసుకుంటాయి. అలా ఈ పాలసీని ఉల్లంఘించి ఇటీవలే సస్పెండ్ అయ్యారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్. ఇదిలా ఉంటే.. ఎక్కువమంది పిల్లల్ని కనేలా మహిళల్ని ప్రోత్సహిస్తున్నాయి మరికొన్ని దేశాలు. మరి, ఎందుకిలా? అసలు సంతాన సాఫల్యత, కుటుంబ నియంత్రణ విషయాల్లో ఆయా దేశాలు ఎలాంటి పాలసీలు రూపొందించాయి? ఏ తరహా చట్టాలు చేశాయి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రహ్లాద్ సింగ్ అనే కానిస్టేబుల్‌కు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు సంతానం. అయినా తనకు వారసుడే కావాలంటూ.. మరో బిడ్డ కోసం ప్రయత్నించాడాయన! ప్రస్తుతం గర్భవతి అయిన తన భార్య బాగోగులు చూసుకోవడానికి ఈ మధ్యే వారం రోజులు సెలవు పెట్టాడు. దీనిపై అధికారులు ఆరా తీయడంతో అసలు విషయం బయటికొచ్చింది. దీంతో ‘జాతీయ జనాభా పాలసీ’ని ఉల్లంఘించడంతో పాటు ‘ఛత్తీస్‌గఢ్/మధ్యప్రదేశ్ సివిల్ సర్వీస్ కండక్ట్ - 1965’లోని కొన్ని నియమనిబంధనల ప్రకారం ఈ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. నిజానికి నియమనిబంధనల ప్రకారం.. ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలున్న వారు.. ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి అనర్హులు. ఈ కారణంతోనే ప్రహ్లాద్ సస్పెండ్ అయ్యారు.
సిక్కిం రూటే సెపరేటు!
ఇలా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు.. ప్రస్తుతం దేశమంతా ఇద్దరు పిల్లల పాలసీనే అనుసరిస్తోంది. ‘టూ ఛైల్డ్ నార్మ్ బిల్, 2015’ కింద.. ప్రతి కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలుండాలన్న నియమం పెట్టింది. అయితే ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు రాయితీలు కూడా వారు పొందలేరన్న నియమం పెట్టింది.
ఇదిలా ఉంటే సిక్కింలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దేశంలోనే అత్యల్ప జనాభా గల ఈ రాష్ట్రంలో.. సంతాన రేటు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త పాలసీలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్ ఈ ఏడాది ఆరంభంలో ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇందులో భాగంగా.. రెండో బిడ్డకు జన్మనిచ్చిన మహిళా ఉద్యోగికి ప్రత్యేక ఇంక్రిమెంట్, మూడో బిడ్డను కంటే డబుల్ ఇంక్రిమెంట్ అందించనున్నట్లు ప్రకటించారు. ఇక గతేడాది నుంచి.. ప్రభుత్వోద్యోగం చేస్తున్న మహిళలకు ఏడాది పాటు వేతనంతో కూడిన ప్రసవానంతర సెలవు, కొత్తగా తండ్రైన పురుషులకు నెల రోజుల వేతనంతో కూడిన పితృస్వామ్య సెలవును అందిస్తోందీ రాష్ట్రం. అంతేకాదు.. పలు కారణాల వల్ల సంతానానికి నోచుకోలేకపోతున్న మహిళల్ని.. ఐవీఎఫ్, ఇతర సంతాన సాఫల్య పద్ధతుల్ని పాటించే దిశగా చర్యలు తీసుకుంటోంది కూడా!
అప్పుడు ఒక్కరు.. ఇప్పుడు ముగ్గురు!
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం చైనా. ఒకప్పుడు టాప్‌లో కొనసాగిన ఈ దేశంలో 2016 దాకా.. ఒక బిడ్డనే కనాలన్న నియమం ఉండేది. 1980-2015 దాకా.. సుమారు 35 ఏళ్ల పాటు కొనసాగిన ఈ నియమంలో భాగంగా.. అక్కడి ఎంతోమంది మహిళలు కుటుంబ నియంత్రణ కోసం వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులు పాటించారు. మరికొంతమందికి బలవంతపు గర్భస్రావాలు కూడా జరిగాయి. అయితే ఈ పాలసీకి 2016లో తెరపడింది. ఇందుకు కారణం.. జనాభాలో తగ్గుదలే! దీంతో 2016 నుంచి ముగ్గురు పిల్లల్ని కనాలన్న నియమాన్ని తీసుకొచ్చింది చైనా. ఇలాంటి మహిళలకు/కుటుంబాలకు.. పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, నగదు బహుమతులు, ఇతర ప్రోత్సాహకాల పేరిట తాయిలాలు కూడా అందిస్తోంది. అయితే ఇన్ని చేసినా అక్కడ సంతాన రేటు ఆశించినంతగా పెరగట్లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ప్రతి మహిళకు సంతాన రేటు 1.705గా ఉంది.
అక్కడ బిడ్డ పుడితే లక్షలే!
మన దేశంలో తొలిసారి, రెండోసారి తల్లైన మహిళలకు ‘ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంవీవై)’ పథకం కింద కొంత మొత్తం అందజేస్తోంది ప్రభుత్వం. ఇలాంటి పథకం జపాన్‌లోనూ అమలు చేస్తున్నారు. కరోనా తర్వాత జనాభా రేటు తగ్గుదలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం.. సంతాన రేటును పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే.. తొలి కాన్పు, రెండో కాన్పుల్లో పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు 5 లక్షల యెన్ (సుమారు రూ. 2.85 లక్షలు)ల చొప్పున చెల్లిస్తోంది. అయితే ఇక్కడ ఇంతమంది పిల్లలే పుట్టాలన్న నియమమేమీ ప్రభుత్వం విధించలేదు. కాకపోతే.. ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీలు, ఇతర సదుపాయాలు మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే అందేలా పాలసీని తీసుకొచ్చింది. ఇక ఆయా సంస్థలు పిల్లల్ని కన్న తమ ఉద్యోగులకు బోనస్‌లు కూడా అందిస్తున్నాయి. అంతేకాదు.. కొత్తగా తల్లైన మహిళలకు 98 రోజుల ప్రసూతి సెలవులను (ప్రసవ తేదీకి ముందు ఆరు వారాలు, ప్రసవం తర్వాత 8 వారాలు) అందిస్తోన్న జపాన్ ప్రభుత్వం.. ఈ సెలవు ముగిశాక ‘ఛైల్డ్ కేర్ లీవ్’ పేరిట వేతనంతో కూడిన సెలవులు అందిస్తోంది. పాపాయికి 14 నెలల వయసొచ్చేదాకా తల్లులు వీటిని ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది.
కొరియాలో ‘పేరెంట్ పే’!
ప్రపంచంలోనే అతి తక్కువ జననాల రేటు నమోదవుతోన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. ఇక్కడ జననాల కంటే మరణాల రేటే ఎక్కువ! ఆ దేశాన్ని కలవర పెడుతోన్న ఈ సమస్య నుంచి గట్టెక్కించడానికి.. ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. బిడ్డను కన్న కుటుంబాలకు ‘పేరెంట్ పే’ కింద నెలనెలా ఒక మిలియన్ వన్ (సుమారు రూ. 63,242) చొప్పున ప్రత్యేక అలవెన్సులు అందిస్తోంది. ఇలా ఏడాది వరకు కొనసాగిస్తూ.. బేబీకి సంవత్సరం వయసు రాగానే.. ఈ అలవెన్సును సగానికి తగ్గించి తదుపరి ఏడాదంతా అందిస్తోంది. అంతేకాదు.. తమ దేశంలో సంతాన రేటు పెరగకపోవడానికి.. ఉద్యోగం చేసే జంటల్లో ఒత్తిడి కూడా ఓ కారణం అని భావించిన దక్షిణ కొరియా.. ప్రతి నెలా బుధవారం తమ ఉద్యోగుల్ని రాత్రి 7.30 గంటల్లోపే ఇంటికెళ్లేలా నియమం విధించింది. తద్వారా వారు తమ భాగస్వామితో మరింత సమయం గడిపేలా వీలు కల్పించింది. ఇక ఇప్పటికే పిల్లలున్న భార్యాభర్తలు ఈ సమయాన్ని తమ చిన్నారులతో గడిపే అవకాశమిచ్చింది.
బహుమతిగా బంగారు నాణేలు!
కెరీర్ బిజీలో పడిపోయి చాలామంది మహిళలు అమ్మతనాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. తీరా పిల్లల కోసం ప్లాన్ చేసుకుందామనుకునే సరికి.. సంతాన సమస్యలు తలెత్తడం, పుట్టే పిల్లల్లో వివిధ రకాల అనారోగ్యాలు.. ఇదీ ఒక రకంగా ఆ దేశ జననాల రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. టర్కీలోనూ ఇలాంటి పరిస్థితుల్నే గుర్తించిన ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ 2016లో ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లల్నైనా కనాలన్న పాలసీని తీసుకొచ్చారు. అంతేకాదు.. పిల్లల్ని కన్న జంటలకు ప్రోత్సాహకాలతో పాటు.. తొలిసారి తల్లులైన మహిళలకు బంగారు నాణేలు బహుమతిగా ఇవ్వడం.. వర్కింగ్ మదర్స్‌కు పార్ట్‌టైమ్ ఉద్యోగాల్లో కొనసాగే సదుపాయం కల్పించడం.. వంటి చర్యలు తీసుకున్నారాయన! దీంతో అక్కడ జననాల రేటు క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ దేశాల్లో అలా!
⚛ న్యూజిలాండ్‌లో జననాల రేటు పెంచేందుకు.. ఆయా కుటుంబాలకు పలు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు.. పిల్లల్ని పెంచేందుకు తల్లిదండ్రులకు ప్రత్యేక అలవెన్సులు కూడా అందిస్తోంది. పిల్లలు పుట్టినప్పట్నుంచి వారికి ఏడాది వయసొచ్చే దాకా.. ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకొని వారానికోసారి కొంతమొత్తం అందజేస్తోంది.
⚛ కెనడా ప్రత్యేక అవసరాలున్న పిల్లల సంరక్షణపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. వారి ఆరోగ్యం, అవసరాలు, చదువు.. వంటి అంశాల్లో బోలెడన్ని సదుపాయాలు కల్పిస్తూ ఆ చిన్నారులకు బంగారు భవిష్యత్తును అందిస్తోంది.
⚛ కుటుంబంలో ఆరుగురు పిల్లలుండాలన్న నియమాన్ని నాలుగుకు కుదించింది నైజీరియా. తద్వారా ఆ దేశ జనాభాను తగ్గించడంతో పాటు.. చిన్నారుల సంరక్షణ పైనా దృష్టి సారించింది. ఇక మహిళల వివాహ వయసును 18గా, పురుషులకు 24 ఏళ్లుగా నిర్ణయించిన ఆ ప్రభుత్వం.. ‘గర్భధారణకు ఏది సరైన సమయం?’ అన్న విషయంలోనూ అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తోంది. తద్వారా శిశుమరణాల శాతం తగ్గినట్లు అక్కడి నిపుణులు చెబుతున్నారు.
⚛ వియత్నాం జనాభా విధానం ప్రకారం.. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్నే కనాలి. అది కూడా ఇద్దరి మధ్య మూడు నుంచి ఐదేళ్ల గ్యాప్ ఉండాలి. ఒకవేళ కాస్త ఉన్నత కుటుంబాలైతే మూడో బిడ్డను కనేందుకూ అనుమతిస్తోంది ఆ ప్రభుత్వం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.