దంతాలు శుభ్రం చేయించుకుంటే ఎనామిల్‌ పోతుందా?

నా దంతాలు గార పట్టి పచ్చగా మారాయి. దాంతో ఒకసారి డాక్టర్‌ వద్దకు వెళ్లి పళ్లను శుభ్రం చేయించుకున్నాను. కానీ, కొన్ని రోజుల తర్వాత పళ్లు మళ్లీ పచ్చగా మారాయి. అయితే తరచుగా దంతాలు శుభ్రం చేయించుకుంటే....

Published : 21 May 2023 09:47 IST

నా దంతాలు గార పట్టి పచ్చగా మారాయి. దాంతో ఒకసారి డాక్టర్‌ వద్దకు వెళ్లి పళ్లను శుభ్రం చేయించుకున్నాను. కానీ, కొన్ని రోజుల తర్వాత పళ్లు మళ్లీ పచ్చగా మారాయి. అయితే తరచుగా దంతాలు శుభ్రం చేయించుకుంటే పంటిపై ఉండే ఎనామిల్‌ పోతుందని అంటున్నారు. ఇది నిజమేనా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. దంతాలను ప్రొఫెషనల్‌గా డెంటిస్ట్‌ దగ్గర శుభ్రం చేయించుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. దంతాలపై ఎనామిల్‌ దెబ్బతినే అవకాశం ఉండదు. సాధారణంగా దంతాలపై ఉన్న గార (calculus)ను తొలగించడానికి ఒక మెషీన్ వాడుతుంటారు. ఈ మెషీన్‌ దంతాలకు ఎలాంటి నష్టం కలిగించదు. ఇది ఒక అల్ట్రాసానిక్‌ వైబ్రేటర్‌. పంటిపై గార ఉన్న ప్రదేశంలో ఈ మెషీన్ టిప్‌ను పెడుతుంటారు. ఆ ప్రదేశంలో వైబ్రేట్ అవుతూ పంటిపై ఉండే గార లాంటి చెక్కులు విడిపోయేలా చేస్తుంటుంది. అంటే గోడపై పెచ్చులు ఊడినట్లు పంటిపై గార తొలగిపోతుంది. అయితే కొంతమంది ఈ గారను సొంతంగా తొలగించుకోవడానికి పలు వస్తువులను ఉపయోగిస్తుంటారు. కానీ, ఇది ఏమాత్రం మంచిది కాదు.

దంత వైద్యుల దగ్గర పళ్లను శుభ్రం చేయించుకోవడాన్ని ‘ఓరల్ ప్రొఫైల్‌ యాక్సెస్’ అంటారు. దీనివల్ల పంటిపై ఉండే ఎనామిల్‌కు ఎలాంటి హానీ కలగదు. అయితే దంతాలు శుభ్రం చేసుకునేటప్పుడు గట్టిగా ఉండే బ్రష్‌లు వాడడం వల్ల ఎనామిల్‌ అరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, సాఫ్ట్ బ్రష్‌లతో దంతాలు శుభ్రం చేసుకోవాలి. సాధారణంగా మన దంతాలు వివిధ ఆకృతుల్లో ఉంటాయి. కానీ, మనం ఉపయోగించే బ్రష్‌ నిటారుగా ఉంటుంది. దీనివల్ల మనం ఎంత జాగ్రత్తగా బ్రష్‌ చేసుకున్నప్పటికీ అన్ని భాగాలను సరిగా శుభ్రం చేసుకోలేం. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒకసారి ఓరల్ ప్రొఫైల్‌ యాక్సెస్‌ ద్వారా దంతాలు శుభ్రం చేయించుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్